రెండు ముఠాలు... ఏడుగురు దొంగలు! | Minor Thiefs And Chain Snatchers Arrest in Hyderabad | Sakshi
Sakshi News home page

రెండు ముఠాలు... ఏడుగురు దొంగలు!

Published Sat, Dec 14 2019 9:32 AM | Last Updated on Sat, Dec 14 2019 9:32 AM

Minor Thiefs And Chain Snatchers Arrest in Hyderabad - Sakshi

వివరాలు వెల్లడిస్తున్న నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌

సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని పశ్చిమ మండలంలో దారి దోపిడీ, బ్యాగ్‌ స్నాచింగ్‌లకు పాల్పడిన రెండు ముఠాలను పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ శుక్రవారం వెల్లడించారు. వెస్ట్‌జోన్‌ జాయింట్‌ సీపీ ఏఆర్‌ శ్రీనివాస్, ఆసిఫ్‌నగర్‌ ఏసీపీ ఆర్జీ శివమారుతిలతో కలిసి తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. బార్కస్‌లోని యర్రకుంట ప్రాంతానికి చెందిన సయ్యద్‌ జఫార్‌ వృత్తిరీత్యా గ్లాస్‌ ఫిట్టింగ్‌ పని చేసేవాడు. గత ఏడాది నుంచి నేరాలు ప్రారంభించిన ఇతడిపై నల్లగొండ జిల్లా, గుడిపల్లితో పాటు నగరంలో చంద్రాయణగుట్ట, బాలాపూర్‌ ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. భవానీనగర్‌కు చెందిన మహ్మద్‌ మజీదుద్దీన్, బార్కస్‌ ప్రాంతానికి చెందిన ఇద్దరు బాలురు అతడికి స్నేహితులు. వీరిలో ఇద్దరు మైనర్లపై హత్య సహా వివిధ కేసులు నమోదై ఉన్నాయి. ఈ నలుగురూ కలిసి రోజు మద్యం తాగడంతో పాటు గంజాయి సేవిస్తుంటారు.

ఆ నిషాలో రోడ్లపైకి వచ్చి నేరాలు చేస్తుంటారు. ఇటీవల ఓ ఆటోను అద్దెకు తీసుకున్న ఈ ముఠా ఈ నెల 3న అర్ధరాత్రి అందులో చక్కర్లు కొట్టింది. లంగర్‌హౌస్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో జరిగిన శుభకార్యానికి హాజరైన ఇస్లాం బిన్‌ అబ్దుల్లా అనే వ్యక్తి రాత్రి 2.30 గంటల ప్రాంతంలో ఇంటికి వెళ్లేందుకు రోడ్డుపై నిలుచున్నాడు. అదే సమయంలో ఆటోలో వచ్చిన ఈ నలుగురూ ఒకరు డ్రైవర్‌గా, మిగిలిన ముగ్గురూ ప్యాసింజర్లుగా నటించారు. అబ్దుల్లాను ఆటోలో ఎక్కించుకుని కొద్దిదూరం వెళ్లిన తర్వాత కత్తి చూపించి బెదిరించారు. అతడి వద్ద ఉన్న రూ.1100 నగదు, సెల్‌ఫోన్‌ లాక్కున్నారు. అయితే ఆటో నుంచి దూకేసిన బాధితుడు తనతో పాటు ఓ నిందితుడినీ పట్టుకుని కిందకు లాగేశాడు. అదే సమయంలో అటుగాగస్తీ వాహనంలో వస్తున్న గోల్కొండ ఠాణా ఏఎస్సై ఒమర్‌ దీనిని గుర్తించి అప్రమత్తమయ్యాడు. పారిపోతున్న నిందితుడిని వెంబడించి పట్టుకుని బాధితుడితో సహా పోలీసుస్టేషన్‌కు తరిలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న మిగిలిన ముగ్గురినీ అరెస్టు చేసి సొత్తు, ఆటో, కత్తి స్వాధీనం చేసుకున్నారు.

చీకట్లో తిరుగుతూ స్నాచింగ్‌లు...
గోల్కొండ, బంజారాహిల్స్, టోలిచౌకీ ప్రాంతాలకు చెందిన ఆఫ్రోజ్‌ఖాన్, మహ్మద్‌ సోహైల్‌ ఖురేషీ, మహ్మద్‌ అబ్దుల్‌ గఫార్‌ స్నేహితులు. వృత్తిరీత్యా ఆటోడ్రైవర్, ప్రైవేట్‌ ఉద్యోగి, డెలివరీ బాయ్‌లుగా పని చేసే వీరు జల్సాలకు అలవాటు పడి నేరాలు చేయడం ప్రారంభించారు. అఫ్రోజ్‌పై గతంలో 11, సోహైల్‌పై 13 కేసులు ఉన్నాయి. వీరితో జట్టుకట్టిన గఫార్‌ కూడా నేరం చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ నెల 2వ తేదీ తెల్లవారుజామున ఖైరున్నిస్సాబేగం అనే మహిళ కుటుంబసభ్యులతో సహా ఆటోలో జగ్జిఖానా నుంచి బీహెచ్‌ఈఎల్‌లోని తమ ఇంటికి వెళుతుండగా, అదే సమయంలో బైక్‌పై వచ్చిన ఈ ముగ్గురు ఆటోను వెంబడిస్తూ కొంత దూరం వెళ్లారు. అదును చూసుకుని ఖైరున్నిస్సా బేగం బ్యాగ్‌ లాక్కుని ఉడాయించారు. లంగర్‌హౌస్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. శుక్రవారం ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి చోరీ సొత్తుతో పాటు కత్తి స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు, విచారణ నేపథ్యంలో ఈ ముఠా సైబరాబాద్‌ పరిధిలోని నార్సింగి ఠాణా పరిధిలో రెండు, లంగర్‌హౌస్‌ పరిధిలోనే మరో రెండు నేరాలకు పాల్పడినట్లు గుర్తించారు. ఈ కేసులు ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన సిబ్బందిని సీపీ అంజనీకుమార్‌ అభినందించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement