లాహోర్ : కనిపించకుండాపోయిన బాలుడు స్థానిక జూలోని సింహపుబోనులో ముక్కలై కనిపించడం కలకలం రేపింది. లాహోర్ సఫారి పార్క్‌లో సోమవారం ఈ విషాదం చోటు చేసుకుంది. సఫారి పార్క్ లాహోర్ డైరెక్టర్ చౌదరి షాఫ్‌కత్ అందించిన సమాచారం ప్రకారం మరణించిన మైనర్ బాలుడిని బిలాల్ (18) గా గుర్తించారు. అతని బట్టలు ఆధారంగా బాలుడుని తండ్రి గుర్తించగా, అయితే బోనులోకి బిలాల్ ఎలా ప్రవేశించాడనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలుడిని హత్య చేసి అనంతరం బోనులోకి విసిరి వుంటారా అనే అంశంపై కూడా ఆరా తీస్తున్నారు.
సోమవారం నుంచి తమ కుమారుడు కనిపించకుండాపోవడంతో కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం పార్క్ అధికారులను సంప్రదించారు. దీంతో మృతదేహానికి సంబంధించిన తల, చేతులు లాంటి శరీర భాగాలను సింహం బోనులో జూ అధికారులు కనుగొన్నారు. దీంతో పాటు కొడవలి, గడ్డిని కూడా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. గడ్డి కోసుకునేందుకు జూ ఫెన్సింగ్ గోడ ఎక్కి పార్కులోకి ప్రవేశించినపుడు బాలుడిపై సింహాలు దాడి చేసి వుంటాయని జూ అధికారులు భావిస్తున్నారు. కాగా బిలాల్ మామయ్య ఇదే పార్కులో ఉద్యోగిగా ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment