నిందితులు శివారెడ్డి, క్రిష్ణకుమారి
మల్కాజిగిరి: మానవత్వం మంట గలిసింది. ఆర్థిక ఇబ్బందులకు తోడు, ఆడపిల్ల కావడం ఆ చిన్నారి పాలిట శాపమైంది. తల్లితండ్రులు లేకపోవడంతో చిన్నమ్మ పంచన చేరిన ఆ చిన్నారి చివరికి ఆమె చేతుల్లోనే హతమైంది. మరో ఘటనలో మారు తండ్రి ఓ బాలికపై లైంగికదాడికి పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. సోమవారం ఒకే రోజు వేర్వేరు ప్రాంతాల్లో ఈ దారుణాలు చోటు చేసుకున్నాయి..
ఆర్థిక భారంతో..
దమ్మాయిగూడకు చెందిన లక్ష్మి ప్రసన్న భర్త లేకపోవడంతో కుమార్తె జ్ఞానేశ్వరితో కలిసి ఉండేది. నాలుగు నెలల క్రితం లక్ష్మి ప్రసన్న మృతి చెందడంతో జ్ఞానేశ్వరి మౌలాలి గాయత్రినగర్‌లో ఉంటున్న అమ్మమ్మ పెంటమ్మ, చిన్నమ్మ క్రిష్ణకుమారి ఇంటికి చేరింది. పెంటమ్మ స్టేట్‌బ్యాంక్ విశ్రాంత ఉద్యోగి కాగా. క్రిష్ణకుమారి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో హౌస్‌కీపింగ్‌గా పనిచేసి ఇటీవల మానేసింది. ఆమెకు సరూర్‌నగర్ మార్గదర్శి కాలనీకి చెందిన ప్రైవేట్ ఉద్యోగి శివారెడ్డితో పరిచయం ఏర్పడటంతో తరచూ వారి ఇంటికి వచ్చి వెళ్లేవాడు. పెంటమ్మకు వచ్చే పెన్షన్‌తోనే క్రిష్ణకుమారి ఆమె కుమారుడు సురేష్ జీవనం సాగించేవారు. దీనితోడు జ్ఞానేశ్వరి కూడా వారి వద్దకే చేరుకోవడంతో భారంగా భావించిన క్రిష్ణకుమారి ఆమెను కడతేర్చాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో శివారెడ్డికి ఈ విషయం చెప్పి అతడిని ఒప్పించింది. ఈ నెల 22న పెంటమ్మ తన పెన్షన్ డబ్బులు తెచ్చుకునేందుకు పాట్నీలోని బ్యాంక్‌కు వెళ్లింది.
దీనిని అదనుగా తీసుకున్న క్రిష్ణకుమారి తన కుమారుడు సురేష్‌ను ఆడుకునేందుకు బయటకు పంపించింది. అనంతరం శివారెడ్డితో కలిసి జ్ఞానేశ్వరిని బెడ్‌రూమ్‌లోకి తీసుకెళ్లి తలను గోడకేసి బాదారు. కిందపడిన చిన్నారిని ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఇంటికి వచ్చిన పెంటమ్మకు జ్ఞానేశ్వరి ఫిట్స్ వచ్చి కిందపడిందని నమ్మించారు. ఆటో తీసుకొచ్చిన శివారెడ్డి, క్రిష్ణకుమారి, పెంటమ్మతో కలిసి జ్ఞానేశ్వరిని చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లుతున్నట్లు నటించారు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత జ్ఞానేశ్వరి శరీరం చల్లబడడంతో చనిపోయిందని పెంటమ్మను నమ్మించారు. అనంతరం ఎవరికీ తెలియకుండా అంత్యక్రియలు చేద్దామని సూచించాడు. మృతదేహాన్ని ఆటోలో ఇంటికి తీసుకువచ్చిన వారు మరోసారి బ్యాంక్‌కు వెళ్లిన అంత్యక్రియలకు అవసరమైన డబ్బులు డ్రా చేసుకువచ్చారు. చీకటిపడిన అనంతరం మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం కుషాయిగూడలోని శ్మశానవాటికకు తీసుకెళ్లగా, అక్కడ ఉన్న సిబ్బంది అనుమానంతో 100 ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో కుషాయిగూడ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. జ్ఞానేశ్వరి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి ఆస్పత్రికి తరలించారు. తలకు గాయమైనట్లుగా వైద్యులు నిర్దారించడంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. సోమవారం నిందితులు క్రిష్ణకుమారి, శివారెడ్డిలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
బాలికపై మారుతండ్రి లైంగికదాడి
గోల్కొండ: ఓ మారు తండ్రి కూతురు వరుసయ్యే బాలికపై లైంగికదాడికి పాల్పడిన సంఘటన గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గోల్కొండకు చెందిన ఆయూబ్‌ఖాన్ కొంత కాలం క్రితం భర్త నుంచి విడిపోయిన ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. కాగా ఆమెకు మొదటి భర్త నుంచి నలుగురు పిల్లలు ఉన్నారు. వీరిలో ఓ బాలిక(13)నార్సింగిలోని ఏఆర్ రహమాన్ చారిటబుల్ ట్రస్ట్ ఆర్ఫనేజ్‌లో ఉంటోంది. ఇదిలా ఉండగా కొద్దిరోజుల క్రితం అయుబ్ ఖాన్ అదే ప్రాంతానికి చెందిన మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఆమె ఉద్యోగ నిమిత్తం దుబాయ్‌లో ఉంటోంది. రెండ్రోజుల క్రితం ఆర్ఫనేజ్‌లో ఉంటున్న ఆయుబ్‌ఖాన్ మొదటి భార్య కుమార్తె ఇంటికి వచ్చింది. సోమవారం ఆయూబ్‌ఖాన్ బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితురాలు ఈ విషయాన్ని తల్లితో చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమో దు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నిందితుడిని కఠినంగా శిక్షించాలి
బాలికపై లైంగికదాడికి పాల్పడిన ఆయుబ్‌ఖాన్‌ను సవరించిన ఫోక్సో చట్టం ప్రకారం శిక్షించాలని బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుతారావు డిమాండ్ చేశాడు. బా«లికకు వైద్య పరీక్షలు చేయించి ఆమెకు రక్షణ కల్పించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment