
నిందితుడు మొయినుద్దీన్ పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించిన బాధిత కుటుంబసభ్యులు
69 ఏళ్ల గణతంత్ర భారతం... అయినా అత్యాచారాలు, అఘాయిత్యాలు, దాడులు ఆగడం లేదు. అమ్మతనాన్ని పంచే ‘ఆమె’కు స్వేచ్ఛ, స్వాతంత్య్రం, రక్షణ కరువైంది. గణతంత్ర దినోత్సవం సాక్షిగా మరో చిన్నారి కామాంధుడి కబంధహస్తాల్లో చిక్కింది. అమ్మ పొత్తిళ్లలో హాయిగా ఆడుకోవాల్సిన ఆ చిన్నారి... ఇప్పుడు అచేతనంగా పడి ఉంది. తీవ్ర రక్తస్రావంతో విలవిల్లాడుతోంది. అసలేం జరిగిందో కూడా తెలియని ఆ పసిప్రాణం బాధను భరించలేక రోదిస్తుంటే.. తల్లిదండ్రుల గుండె చెరువైంది. మద్యం మత్తులో ఓ కామాంధుడు రెండేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన ఈ హృదయవిదారక ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది.
దుండిగల్: రెండేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు లైంగికదాడికి పాల్పడిన సంఘటన దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు, చిన్నారి బంధువుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జహీరాబాద్ ప్రాంతానికి చెందిన మహ్మద్ మోయినుద్దీన్ కొన్నేళ్ల క్రితం నగరానికి వలస వచ్చి గాజులరామారం డివిజన్ కైసర్‌నగర్‌లో ఉంటూ ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతడికి ఇద్దరు భార్యలు, ముగ్గురు సంతానం. వారి ఇంటి సమీపంలోనే ఓ పెయింటర్ కుటుంబం నివాసం ఉంటోంది. గురువారం సాయంత్రం మొయినుద్దీన్ స్నేహితుడు షరీఫ్ కుమారుడి పుట్టిన రోజు కావడంతో మరో స్నేహితుడు యాకూబ్‌తో కలిసి స్థానిక ప్రభుత్వ పాఠశాల వెనుక విందు చేసుకున్నారు.
ఆందోళనకారులకు నచ్చచెబుతున్న పోలీసులు
అనంతరం వారు అదే రోజు రాత్రి మోయినూద్దీన్‌ను ఆటోలో అతని ఇంటి వద్ద దింపి వెళ్లిపోయారు. అదే సమయంలో వీరి ఇంటి సమీపంలో ఆడుకుంటున్న పెయింటర్ కుమార్తె (02)ను ఎత్తుకుని సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన మొయినుద్ధీన్ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఏమీ ఎరగనట్లు చిన్నారిని ఇంటి వద్ద వదిలివెళ్లిపోయాడు. చిన్నారికి తీవ్ర రక్తస్రావం అవుతుండటాన్ని గుర్తించిన ఆమె కుటుంబ సభ్యులు లైంగికదాడి జరిగినట్లుగా అనుమానించి దుండిగల్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించగా మోయినుద్దీన్ చిన్నారిని ఎత్తుకెళ్లి, తీసుకు వచ్చిన దృశ్యాలు కనిపించాయి. అతడి కోసం గాలింపు చేపట్టిన స్థానికులు రాత్రి 11 గంటల ప్రాంతంలో కైసర్‌నగర్‌లోని డబుల్‌బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాల వద్ద అతడిని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. బాధితురాలిని మెరుగైన చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. చిన్నారి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
బంధువుల ఆందోళన..
చిన్నారి బంధువులు, స్థానికులు పెద్ద సంఖ్యలో దుండిగల్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. అరగంట పాటు రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ స్తంభించింది. బాలానగర్ ఏసీపీ గోవర్ధన్, దుండిగల్ సీఐ శంకరయ్య, ఎస్సై రాందాస్ అక్కడికి వచ్చి ఆందోళన కారులతో మాట్లాడారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. రెండేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి నిందితుడు మోయినుద్దీన్ కు ఉరి శిక్ష విధించాలని, బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో గత 24 రోజుల వ్యవధిలో 28 మంది మైనర్లపై లైంగిక దాడులు జరిగాయన్నారు. ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి నిందితులకు త్వరగా శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.