యశోద (ఫైల్), రాహుల్ (ఫైల్)
సాక్షి, ధర్మారం(ధర్మపురి): గ్యాస్ సిలిండర్ పేలి తల్లీకొడుకు సజీవ దహనం అయిన ఘటన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామంలో విషాదం నింపింది. అర్ధరాత్రి ఘటన చోటుచేసుకోవడంతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. పోలీసులు, గ్రామస్తుల కథనం మేరకు..దొంగతుర్తి గ్రామానికి చెందిన గొట్టె నారాయణ మొదటి భార్య మృతిచెందగా, రెండోభార్యకు విడాకులు ఇచ్చి, యశోదను మూడోపెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం యశోద(45)తో కలిసి ఉంటున్నాడు. వీరికి కుమారుడు రాహుల్(18)కుమార్తె రాణి ఉన్నారు. రాహుల్ ధర్మారంలో ఇంటర్ చదువుతుండగా, రాణి గోదావరిఖనిలోని సాంఘిక సంక్షేమ పాఠశాలలో తొమ్మిదోతరగతి చదువుతోంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నారాయణ ఇంటికే పరిమితమయ్యాడు. యశోద కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. యశోద, ఆమె భర్త, కొడుకు రాత్రి భోజనం చేసి యశోద, రాహుల్ ఒక గదిలో, నారాయణ మరోగదిలో నిద్రపోయారు. (తల్లీ, కొడుకు సజీవదహనం!)
ఘటనలో ధ్వంసమైన ఇల్లు
అర్ధరాత్రి భారీ పేలుడు..
అర్ధరాత్రి 11:30 గంటలకు నారాయణ ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. యశోద, రాహుల్ నిద్రిస్తున్న గదిలో పేలుడు సంభవించడంతో ఇంటి పైకప్పు ఎగిరిపోయింది. భారీగా మంటలు చెలరేగాయి. వెంటనే నారాయణ తలుపులు తీసుకుని కేకలు వేస్తూ బయటకు పరిగెత్తాడు. గ్రామస్తులు అక్కడకు చేరుకొని యశోద, రాహుల్‌ను కాపాడే ప్రయత్నం చేశారు. మంటలకు గదిలో ఉన్న యశోద, రాహుల్ పూర్తిగా కాలిపోయారు. గ్రామస్తుల సమాచారంతో సంఘటన స్థలానికి పోలీసులు, ఫైర్‌సిబ్బంది చేరుకొని మంటలు ఆర్పేశారు. మంగళవారం ఉదయం సంఘటన స్థలానికి చేరుకున్న పెద్దపల్లి ఏసీపీ హబీబ్‌ఖాన్, ధర్మపురి సీఐ ప్రదీప్‌కుమార్ ఘటనపై విచారణ జరిపారు. మృతదేహాలను పరిశీలించారు, గొట్టె నారాయణ, గ్రామస్తులు, యశోద బంధువులతో మాట్లాడారు. వివరాలు నమోదు చేసుకున్నారు.
గ్యాస్ లీకై ఘటన..
నారాయణ ఇంట్లో వంట గ్యాస్ సిలిండర్ లీక్ కావడంతోనే ప్రమాదం జరిగి ఉంటుందని ఏసీపీ హబీబ్‌ఖాన్ తెలిపారు. గ్యాస్ లీకైన వాసన రావడంతో యశోద లేదా రాహుల్ గుర్తించి ఉంటారని పేర్కొన్నారు. అప్పటికే గ్యాస్ గదిలో నిండిపోయి ఉండడం లైట్ ఆన్‌చేసి ఉండడంతో భారీ పేలుడు జ రిగి ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు.
ఘటనపై అనుమానాలు..
నారాయణ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలుడుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూడేళ్లుగా నారాయణ, యశోదకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. పెద్దమనుషుల సమక్షంలో పలుమార్లు పంచాయితీలు కూడా జరిగాయి. యశోదనే కొడుకు, కూతురు బాగోగులు చూసేదని స్థానికులు తెలిపారు. సోమవారం రాత్రి సిలిండర్ పేలిన సంఘటన విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ సంఘటనపై అనుమానాలు ఉన్నాయని యశోద సోదరి గమ్మటి కమల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రదీప్‌కుమార్ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పెద్దపల్లి ఆస్పత్రికి తరలించామని చెప్పారు.
గుండెలు పగిలేలా రోదించిన కూతురు
‘నన్ను ఒంటరిని చేసి వెళ్లిపోయారా’ అంటూ కూతురు రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. తల్లి, సోదరుడు మంటల్లో కాలిపోయిన విషయం తెలుసుకున్న రాణి హాస్టల్ నుంచి గ్రామానికి చేరుకుంది. ఇంటి వద్ద శ్మశాన వాతావరణం, మంటల్లో కాలి బూడిదైన తల్లి యశోద, సోదరుడు రాహుల్ మృతదేహాలను చూసి గుండెలు పగిలేలా రోదించింది.
Comments
Please login to add a commentAdd a comment