భార్య క్రాంతితో మృతుడు రాంబాబు (ఫైల్)
రామచంద్రపురం: తాను ఉంటున్న అపార్టుమెంటులో అనుమానాస్పదంగా మృతి చెందిన చెల్లూరి రాంబాబు మృతి మిస్టరీగా మారింది. ఈనెల 26న పట్టణానికి చెందిన రాంబాబు తోటవారివీధిలోని ఒక అపార్టుమెంటులో ముఖమంతా రక్తంతో గాయాలతో మృతి చెందిన విషయం తెలిసిందే. తొలుత గుండెపోటుతో మృతి చెందాడని చెప్పినా.. శరీరంపై ఉన్న గాయాలతో రాంబాబు హత్యకు గరైనట్టు తెలుస్తోంది. ఈ సంఘటన జరిగిన ఐదో రోజు నుంచి పోలీసులు చేపట్టిన దర్యాప్తుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తొలుత అనుమానాస్పద రీతిలో మృతి చెందినట్టు కేసు నమోదు చేసిన పోలీసులు రాంబాబు హత్యకు గురైనట్టు నిర్ధారణకు వచ్చి దర్యాప్తును మొదలెట్టారు. సంఘటన జరిగిన రోజునే రాంబాబు భార్య క్రాంతిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు ఒకే కోణంలో విచారణ చేయడంపై చూస్తే కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది.
క్లూస్‌టీం ఎందుకు రాలేదు?
సాధారణంగా అనుమానాస్పదంగా మృతి చెందిన కేసుల్లో పోలీసులు సంఘటన జరిగిన ప్రాంతానికి క్లూస్‌టీం ను తీసుకువచ్చి ఆధారాలు సేకరిస్తుంటారు. రాంబాబు మృతి విషయంలో సంఘటన స్థలం అపార్ట్‌మెంట్‌కు పోలీసులు తాళాలు వేశారే తప్ప క్లూస్‌టీంను రప్పించలేదు. మృతి చెందిన నాలుగు రోజులకు రామచంద్రపురం డీఎస్పీ జేవీ సంతోష్, సీఐ కె శ్రీధర్‌కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
అపార్ట్‌మెంటులో సీసీ కెమెరాలెక్కడ?
సంఘటన జరిగిన అపార్ట్‌మెంట్‌కు సీసీ కెమెరాలు కూడా లేకపోవడం రాంబాబు మృతి వెనుక పెద్ద కుట్రే ఉందనే అనుమానాలను రాంబాబు సన్నిహితులు వ్యక్తం చేస్తున్నారు. 50 నుంచి వంద మంది వరకు సంచరించే చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనే నిబంధన ఉన్నా ఇక్కడ సీసీ కెమెరాలు లేవు. అంతేకాదు అపార్ట్‌మెంట్‌కు రెండు చోట్ల ఉన్న ద్వారాలకు గేట్లు లేకపోవడంతో రాంబాబును హతమార్చినవారు వెనుక గేటు నుంచి వెళ్లిపోయి ఉండవచ్చనే అనుమానాలు
వస్తున్నాయి.
ఆర్థిక లావాదేవీలే కారణమా?
హతుడు రాంబాబు కొంతమంది పెద్ద తలకాయలకు బినామీగా ఉన్నాడనే విషయం పలువురు చెబుతున్నారు. జూదం ఆడే కొంత మందికి కార్లు, ఇతర మోటారు సైకిళ్లు తాకట్టు పెట్టుకుని రాంబాబు పెద్ద మొత్తంలో ఫైనాన్స్ చేస్తుంటారని ఆయన సన్నిహితులు అంటున్నారు. రాంబాబుకు ఇటీవల పెద్ద మొత్తంలో సొమ్ములు ముట్టాయని కొంత మంది అంటున్నారు. ఈ నేపథ్యంలోనే వారం రోజుల క్రితం ఇదే వ్యవహారంపై ద్రాక్షారామలో రాంబాబు ఒక సెటిల్‌మెంట్ చేసినట్టు చెబుతున్నారు. ఈ ఆర్థిక లావాదేవీలే ఆయన హత్యకు దారితీశాయనే అనుమానాలు ఉన్నాయి. తన భార్యతో గొడవలు, వివాహేతర సంబంధాల నేపథ్యంలోనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు తప్ప రాంబాబుతో ఆర్థిక లావాదేవీలు జరిపే వారిని విచారించకపోవడం, క్లూస్‌టీంను రప్పించకపోవడంపై అనుమానాలు బలపడుతున్నాయి. రాంబాబు స్థానిక అధికార పార్టీ నేతలకు అత్యంత సన్నిహితుడు. అధికార పార్టీలో ఉండి కూడా రాంబాబు హత్యకు గురైతే ఎందుకు ఇంత నిర్లిప్తంగా ఉంటున్నారనే రాంబాబు సన్నిహితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని అనుమానలతో నాలుగు రోజులుగా రామచంద్రపురం పట్టణంలో రాంబాబు హత్య ఉదంతం హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై రామచంద్రపురం సీఐ కొమ్ముల శ్రీధర్‌ను వివరణ కోరగా దోషులెవరైనా విడిచిపెట్టేది లేదని దర్యాప్తు వేగవంతం చేశామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment