నిందితుడు వివరాలు వెల్లడిస్తున్న అర్బన్ జిల్లా ఎస్పీ రాజకుమారి
రాజమహేంద్రవరం క్రైం: స్థానిక గోదావరి గట్టున ఉన్న సులభ కాంప్లెక్‌లో జరిగిన వృద్ధుడి దారుణ హత్యకేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. మంగళవారం రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ బి.రాజకుమారి ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆమె కథనం ప్రకారం.. ఈనెల రెండోతేదీన రాజమహేంద్రవరం గోదావరి గట్టున ఉన్న మార్కండేయ స్వామి గుడి సమీపంలో ఉన్న సులభ కాంప్లెక్స్‌లో కృష్ణా జిల్లా గన్నవరం మండలం, కేసరపల్లి గ్రామానికి చెందిన వీర వెంకటేశ్వరరావును ఖమ్మం జిల్లా ముస్తాబ్‌నగర్‌కు చెందిన తోట వీరబాబు పెట్రోల్ పోసి నిప్పు పెట్టి దారుణంగా హత్య చేశాడని ఎస్పీ వివరించారు.
ఈనెల రెండోతేదీ మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో తోట వీరబాబు గోదావరి గట్టుపై గల మార్కండేయ స్వామి ఘాట్ వద్ద కు వచ్చాడని, ఫ్లాట్‌ఫాంపై పడుకొని ఉన్న ఒక సాధువును భయపెట్టి అతడి వద్ద నుంచి బలవంతంగా డబ్బులు లాక్కొంటుండగా వెంకటేశ్వరరావు(బాబాయ్) వారించాడు. అక్కడ ఉన్న స్థానికులు కార్తీక్, ప్రసాద్ అనే వ్యక్తుల సహాయంతో తోట వీరబాబును కొట్టారు. దీంతో కక్ష పెంచుకున్న వీరబాబు వెంకటేశ్వరరావును హత్య చేయాలనే ఉద్దేశంతో గోకవరం బస్టాండ్ వద్దగల పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లి ఒక ప్లాస్టిక్ బాటిల్ లో పెట్రోల్ పోయించుకొని మార్కండేయ స్వామి గుడి వద్ద గల సులభ కాంప్లెక్ వద్దకు మధ్యాహ్నం చేరుకుని సులభ్ కాంప్లెక్స్ కేబిన్‌లో నిద్రిస్తున్న వెంకటేశ్వరరావుపై వెంట తెచ్చుకున్న పెట్రోల్ పోసి అగ్గిపుల్ల వెలిగించి హత్య చేశాడని తెలిపారు. ఈ కేసును సెంట్రల్ జోన్ డీఎస్పీ జె.కుల శేఖర్, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ బి. రామకృష్ణ, ఆద్వర్యంలో వన్‌టౌన్ సీఐ రవీంద్ర, ఎస్సై రాజశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారని తెలిపారు. నిందితుడిని రాజమహేంద్రవరం డీలక్స్ సెంటర్‌లోని విజయ టాకీస్ సందులో అరెస్ట్ చేసినట్టు తెలిపారు. వీరవెంకటేశ్వరరావును హత్య చేసింది తానేనని అంగీకరించాడని తెలిపారు.
నేరప్రవృత్తిగల నిందితుడు
నిందితుడు తోట వీర బాబు విజయవాడ గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు చోరీ కేసులు ఉన్నాయని తెలిపారు. డబ్బులు అవసరమైనప్పుడు ఘాట్లు మెట్లపై పడుకునే సాధువుల వద్ద లాక్కోని పారిపోతుంటాడని తెలిపారు. ఇతని పై వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీట్ ఓపెన్ చేసి దానిని విజయవాడకు బదిలీ చేస్తామని ఎస్పీ తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనబరిచిన సీఐ రవీంద్ర, ఎస్సై రాజశేఖర్, ఏఎస్సై శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ చిన్నారావు, కె. నెహ్రు, కానిస్టేబుల్ ప్రదీప్, వీరబాబులను ఎస్పీ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment