సాక్షి, బొమ్మలసత్రం(కర్నూలు) : నంద్యాల ఎస్‌బీఐ కాలనీకి చెందిన వివాహిత ఊహాశ్రీ హైదరాబాద్‌లో కనిపించకపోవటంతో తల్లిదండ్రుల్లో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. భర్త బంధువుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదైనప్పటికీ నేటికీ ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఎవరైనా కొత్త వ్యక్తులు తన కుమార్తెను కిడ్నాప్ చేసి ఉండవచ్చని తండ్రి నాగరాజు అనుమానం వ్యక్తం చేస్తున్నాడు.
నాగరాజు తెలిపిన వివరాల మేరకు ఎస్‌బీఐ కాలనీకి చెందిన నాగరాజు, అరుణ దంపతుల కుమార్తె ఊహాశ్రీని హైదారాబాద్‌లోని గాజుల రామారం ప్రాంతానికి చెందిన నాగరాజు, శాంతమ్మ దంపతుల కుమారుడు మురళితో రెండేళ్ల క్రితం వివాహం చేశారు. పెళ్లయిన కొద్ది రోజులకే మురళి ఉద్యోగరీత్యా ఖడ్తర్‌కు వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఊహాశ్రీ అత్తమామల వద్దే ఉంటుండగా ఆరోగ్యం సరిగా లేక అత్త కొంత కాలం క్రితం చికిత్స నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లిపోయింది.
మామ నాగరాజుతో కలిసి ఊహశ్రీ ఇంట్లోనే ఉంటోంది. గత నెల జూలై 5న మామ నాగరాజు ఉద్యోగరీత్య విధులకు వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి రాగా ఊహాశ్రీ కనిపించలేదు. సమీప బంధువులను విచారించినా ప్రయోజనం లేకపోవడంతో జీడిమెట్ల పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఊహాశ్రీ కోసం తెలంగాణ పోలీసులు ఎంత గాలించినా ఫలింతం లేకపోవటంతో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. గత నెల 9న ఒంగోలులో ఓ వ్యక్తితో ఊహాశ్రీ కనిపించినట్లు తల్లిందండ్రులు, పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులతో కలిసి తల్లిదండ్రులు ఒంగోలు, చుట్టు పక్కల గాలించినా ఆచూకీ లభించలేదు. ఇప్పటి వరకు తమ కుమార్తె జాడ తెలియకపోవటంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment