పండక్కు వస్తామంటూ.. తిరిగిరాని లోకాలకు.. | New Married Couple Died in Car Accident Chittoor | Sakshi
Sakshi News home page

పండక్కు వస్తామంటూ.. తిరిగిరాని లోకాలకు..

Published Tue, Mar 12 2019 7:49 AM | Last Updated on Tue, Mar 12 2019 3:26 PM

New Married Couple Died in Car Accident Chittoor - Sakshi

బాలాజీ, కావ్య (ఫైల్‌ ఫొటో)

నెలరోజుల క్రితం పెళ్లయింది. ఎన్నో ఆశలు, మరెన్నో కలలతో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. జీవితమంతా బంగారు భవిష్యత్తంటూ ఊహల్లో తేలియాడుతున్న ఆ యువ దంపతులను చూసి దేవుడికే కన్నుకుట్టిందేమో.. ఆనందంగా పుట్టింటికి వెళ్లి వస్తున్న సమయంలో కారు ప్రమాదం రూపంలో ఆ జంటను తన వద్దకు తీసుకెళ్లాడు. అయినవారికి తీరని శోకం మిగిల్చాడు. తిరుపతి జూపార్క్‌ రోడ్డులో సోమవారం ఉదయం బైకును కారు ఢీకొనడంతో నవ వధూవరులు కావ్య(19), బాలాజీ (22) మృతి చెందారు. వీరిద్దరికీ గత నెల 8న పెళ్లయింది. దంపతుల మృతితో వధూవరుల గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

చిత్తూరు, చంద్రగిరి: ‘‘అమ్మా మళ్లీ పండగకు వస్తాము. మా అత్త, మామతో పాటు మా ఆయన నన్ను బాగా చూసుకుంటున్నారు.. నువ్వేమీ నా గురించి దిగులు పడొద్దు.. ఎండా కాలంలో కావడంతో మాకోసం కొత్తగా కూలర్‌ను కూడా తీసుకొచ్చారమ్మా.. నాకు చాలా సంతోషంగా ఉంది’’ అని చెప్పి అని తల్లిని ఊరడించి, అత్తగారింటికి బయల్దేరిన కుమార్తె గంట వ్యవధిలోనే తన భర్తతో సహా తిరిగిరాని లోకాలకు చేరుకుంది. కొత్త ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఆ నవదంపతులను మృత్యువు కారు రూపంలో కబళించింది.

మండలంలోని కూచువారిపల్లెకు చెందిన కావ్య, కరకంబాడికి చెందిన బాలాజికి గత నెలలో వివాహమైంది. ఆదివారం కావ్య తన భర్తతో కలసి స్కూటీ వాహనంపై పుట్టింటికి వచ్చింది. అందరినీ పలకరించి సంతోషంగా  గడిపింది.  సోమవారం ఉదయం తిరిగి నవదంపతులు కరకంబాడికి ద్విచక్ర వాహనంపై వెళ్తూ తిరుపతి–అలిపిరి బైపాస్‌లోని సైన్స్‌ సెంటర్‌ వద్ద రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో ఇటు కూచివారిపల్లె, అటు కరకంబాడిలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇంటికి చేరాక ఫోన్‌ చేస్తామన్న తన కుమార్తె, అల్లుడి మరణం గురించి ఫోన్‌లో వినాల్సి వస్తుందని  కలలో కూడా అనుకోలేదని కుటుంబ సభ్యులు భోరున విలపించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement