సాక్షి, సిటీబ్యూరో: ఫేస్‌బుక్ ద్వారా ఎర వేసిన సైబర్ నేరగాళ్లు నగరంలో నివసిస్తున్న ఓ ఆర్మీ ఉన్నతాధికారి భార్యను మోసం చేశారు. అమెరికా నుంచి చాట్ చేస్తున్నట్లు చెప్పిన వాళ్లు భారత్ వచ్చామని, కిడ్నాప్ అయినట్లు కథ అల్లారు. రూ.1.5 లక్షలు కాజేశారు. మరో రూ.10 లక్షలకు గాలం వేశారు. భార్య ద్వారా సమాచారం అందుకున్న ఆ అధికారి కశ్మీర్ నుంచి ఆగమేఘాలపై వచ్చి గురువారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఆర్మీలో కల్నల్ హోదాలో పని చేస్తున్న ఓ అధికారి గతంలో నగరం కేంద్రంగా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆయనకు కాశ్మీర్‌లో పోస్టింగ్ వచ్చినప్పుటికీ కుటుంబాన్ని మాత్రం ఇక్కడే ఉంచారు. అప్పుడప్పుడు ఆయనే వచ్చి వెళుతుండే వారు. ఇదిలా ఉండగా... దాదాపు నెల రోజుల క్రితం సిటీలో ఉన్న ఆ కల్నల్ భార్యకు ఫేస్‌బుక్ ద్వారా ఓ రిక్వెస్ట్ వచ్చింది. అమెరికాకు చెందిన కిమ్‌గా, పెద్ద వ్యాపారిగా ఉన్న ప్రొఫైల్ చూసిన ఆమె యాక్సెప్ట్ చేయడంతో ఇద్దరూ ఫ్రెండ్స్‌గా మారారు. అప్పటి నుంచి కొన్నాళ్ల పాటు పూర్తి స్నేహపూర్వకంగా చాటింగ్ చేసిన కిమ్ కల్నల్ భార్య నమ్మకాన్ని చూరగొన్నాడు. ఆపై అసలు కథ ప్రారంభించిన అతగాడు మిమ్మల్ని కలవడానికి భారత్‌కు వస్తున్నట్లు చెప్పడంతో ఆమె అంగీకరించారు.
ఇది జరిగిన రెండు రోజులకు ఢిల్లీ నుంచి అంటూ కిమ్ ఫోన్ చేశాడు. అమెరికా నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చిన తనను కొందరు కిడ్నాప్ చేశారని, డబ్బు చెల్లించకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నానని చెప్పి ఫోన్ కట్ చేశాడు. కొద్దిసేపటికి మళ్లీ కాల్ చేసిన కిమ్.. కిడ్నాపర్లు మాట్లాడతారని అంటున్నారంటూ ఫోన్ మరొకరికి అందించాడు. కల్నల్ భార్యతో మాట్లాడిన అతగాడు కిమ్‌ను కిడ్నాప్ చేసి ఢిల్లీ శివార్లలో దాచామని, తక్షణం రూ.1.5 లక్షలు చెల్లించకపోతే అతడిని చంపేస్తామంటూ బెదిరించారు. దీంతో భయపడిన ఆమె విషయాన్ని తన భర్తకు చెప్పడానికి ఫోన్ ద్వారా ప్రయత్నించారు. కాశ్మీర్‌లో విధుల్లో ఉన్న ఆయన ఫోన్ కలవకపోవడంతో డబ్బు చెల్లిస్తానంటూ కిడ్నాపర్లుగా చెప్పుకున్న వారితో ఒప్పందం చేసుకున్నారు. ఆపై వారు చెప్పిన ఖాతాలోకి రూ.1.5 లక్షలు బదిలీ చేశారు. ఈ డబ్బు ముట్టిన తర్వాత మరోసారి కాల్ చేసి కిడ్నాపర్లుగా చెప్పుకున్న మరో కొత్త కథ అల్లారు. కిమ్ దగ్గర ఉన్న ఫోన్‌లో మీవి, మీ పిల్లలవి వివరాలు, ఫొటోలు ఉన్నాయని చెప్పారు.
తమకు రూ.10 లక్షలు చెల్లించకపోతే ఆ ఫొటోలను మార్ఫింగ్ చేసి అసభ్యంగా, అశ్లీలంగా మారుస్తామని, అంతటితో ఆగకుండా వాటిని సోషల్‌మీడియాలో పెడతామని బెదిరించారు. అదను చూసుకుని మీ పిల్లల్ని చంపేస్తామంటూ హెచ్చరించారు. దీంతో ఆందోళనకు గురైన ఆమె మంగళవారం తన భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పారు. అది నైజీరియన్ల పనిగా గుర్తించిన ఆయన ఒక్క పైసా కూడా చెల్లించవద్దంటూ ఆమెకు చెప్పి హుటాహుటిన బయలుదేరి నగరానికి వచ్చారు. కాశ్మీర్‌లో తాను విధులు నిర్వర్తిస్తున్న ప్రాంతం నుంచి శ్రీనగర్‌కు హెలీకాఫ్టర్‌లో అక్కడ నుంచి ఢిల్లీకి, అట్నుంటి సిటీకి విమానంలో వచ్చారు. గురువారం తన భార్యతో సహా వచ్చి సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక పరిశీలన నేపథ్యంలో ఆమె డబ్బు బదిలీ చేసిన ఖాతా ఈశాన్య రాష్ట్రాలకు చెందినదిగా గుర్తించారు. ఇది నైజీరియన్ల పనిగా తేల్చిన అధికారులు బాధ్యుల కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment