నెల్లూరు(క్రైమ్): గతంలో రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వ నిబంధనలు గుదిబండగా ఉండేవి. ఈ తలనొప్పి మాకెందుకులే అంటూ బాధితులను ఆదుకునేందుకు ప్రజలు వెనకడుగు వేసేవారు. వాటన్నింటికి ఫుల్‌స్టాప్ పెడుతూ ప్రమాద బాధితులకు సాయం చేసేవారికి అనుకూలంగా సుప్రీంకోర్టు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోవడం సర్వసాధారణమైంది. క్షతగాత్రులకు వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వ నిబంధనలు అడ్డంకిగా మారాయి. క్షతగాత్రుల దయనీయ స్థితిని చూసి ఎవ్వరైనా స్పందించి ఆస్పత్రిలో చేర్చితే ఇంకేముంది పోలీసులు విచారణ పేరుతో వేధింపులకు గురిచేసేవారు. వివరాలు సేకరించేందుకు గంటల తరబడి నిలిపి బాధితుల సహనాన్ని పరీక్షించేవారు. అంతటితో ఆగకుండా కేసులంటూ కోర్టుల చుట్టూ తిప్పేవారు. దీంతో ప్రజలు తమకెందుకులే అని క్షతగాత్రులకు సాయం చేసేందుకు నిరాసక్తి కనబరిచేవారు. ఫలితంగా సరైన సమయంలో వైద్యసేవలు అందక క్షతగాత్రులు మృత్యువాతపడేవారు.
గెజిట్ నోటిఫికేషన్
క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించే వారికి ఏ విధమైనా ఇబ్బందులు తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిబంధనలతో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ రాజధాని ఢిల్లీకి చెందిన సేవ్ లైవ్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ ప్రమాద బాధితులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై దేశ సర్వోన్నతన్యాయస్థానం (సుప్రీంకోర్టు)లో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు క్షతగాత్రులకు సాయం చేసేవారికి అనుకూలంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.దీని ప్రకారం ప్రమాద బాధితులకు సాయం చేసేవారు తమ వివరా లను చెప్పకపోయినా...వారు తీసుకొచ్చి న క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్చుకోవాల్సిందే. వారు తమ వివరాలను వెల్లడించి స్వచ్ఛందంగా కోర్టుకు వచ్చి సాక్ష్యం చెబుతామంటేనే పోలీసులు వారి వివరాలు నమోదు చేసుకోవాలి.
గెజిట్‌లో నిబంధనలు
రోడ్డు ప్రమాద బాధితులను సమీపంలోని ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లవచ్చు. అతన్ని వైద్యులు పర్యవేక్షణలో ఉంచి వెంటనే వెళ్లిపోవచ్చు. తమ వివరాలు చిరునామా చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోవచ్చు. అంతకు మించి ఆస్పత్రి సిబ్బంది రక్షించిన వ్యక్తిని వివరాలేమి అడగరు. ఉండమని చెప్పరు. సాయం చేసిన వారి వివరాలను ఎట్టి పరిస్థితుల్లో ఇతరులకు వెల్లడించకూడదు. ఇలా చేస్తే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకొంటారు.
క్షతగాత్రులకు సత్వరమే వైద్యం
ప్రమాద బాధితులకు సత్వరమే వైద్యసేవలు అందించాలి. కారణం లేకుండా చికిత్స చేసేందుకు ఏ వైద్యుడైనా నిరాకరిస్తే అతనిపై ఇండియన్ మెడికల్ కౌన్సిల్ నిబంధనల మేరకు క్రమశిక్షణా చర్యలు తీసుకోవచ్చు.
ఒక్కసారే కోర్టుకు
ఎవరైనా రోడ్డు ప్రమాదానికి ప్రత్యక్ష సాక్షి అయితే కేసు దర్యాప్తులో భాగంగా తన వివరాలను పోలీసులకు అందజేయవచ్చు. వీరు కేసు విచారణలో భాగంగా సాక్ష్యం చెప్పేందుకు ఒక్కసారి కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుంది. అతన్ని విచారణ పేరిట వేధింపులకు గురిచేయకూడదు. కోర్టుకు ఎప్పుడు రావాలో సాక్షికి తెలియజేయాలి.
విలువైన కాలం
రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు వెంటనే సాయం చేసేవారు చాలా అరుదు. రోడ్డుపై రక్తం కారుతూ ఎవరైనా ఉన్నా పట్టించుకోని వారే అధికం. ఇందుకు నిబంధనలు సైతం ఓ కారణమవుతున్నాయి. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులను కాపాడేందుకు ప్రతిక్షణం అమూల్యమైందే. ఇలాంటి పరిస్థితుల్లో సాయం చేయాలని మనస్సుల్లో ఉన్నా నిబంధనలు, కేసుల భయంతో ఎవరూ ముందుకు రాకపోవచ్చు. ఇటువంటి సమస్యలు లేకుడా క్షణం ఆలస్యం చేయకుండా బాధితులను ఎవరైనా ఆస్పత్రికి తరలించేలా సుప్రీంకోర్టు మార్గదర్శకాలను విడుదల చేసింది. దీని వల్ల బాధితులను ఆస్పత్రిలో చేర్పించిన వారిపై ఏవిధమైన కేసులు పెట్టే అవకాశం లేదు.
ప్రాణం నిలపండి.. కేసు ఉండదండి
Published Wed, Oct 4 2017 9:46 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment