
సాక్షి,సిటీబ్యూరో: రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో రెండు రోజుల్లో తొమ్మిది స్నాచింగ్‌లకు పాల్పడి హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్‌కు చిక్కిన సీరియల్ స్నాచర్ల విచారణలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో పట్టుకున్న వీరిని పోలీసులు మంగళవారం నగరానికి తరలించారు. వీరు తస్కరించిన దాదాపు 30 తులాల బంగారం స్వాధీనం చేసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఉదంతం క్షేత్రస్థాయి లోని అనేక లోపాలను వెలుగులోకి తెచ్చింది. స్థానికులు, యూపీ వాసులతో కూడిన ఈ ముఠా ను బుధవారం అరెస్టు ప్రకటించే అవకాశం ఉంది.
రెండు రోజుల్లో వరుస హల్‌చల్...
ఉత్తరప్రదేశ్‌కు చెందిన స్నాచర్లు పక్షం క్రితం రెండు రోజుల్లో హల్‌చల్ చేశారు. తొమ్మిది స్నాచింగ్స్ చేయడంతో పాటు మరో యత్నానికీ పాల్పడ్డారు. మొదటి రోజు ఉదయం మలక్‌పేటలో బైక్ (టీఎస్ 08 ఈపీ 4005) అద్దెకు తీసుకున్న వీరు అదే రోజు సాయంత్రం గంట వ్యవధిలో మీర్‌పేట, వనస్థలిపురం, హయత్‌నగర్, ఎల్బీనగర్ ప్రాంతాల్లో ఐదు చోట్ల పంజా విసిరారు. అక్కడి నుంచి నల్లగొండ చౌరస్తా మీదుగా మలక్‌పేట వరకు వచ్చిన వీరు మళ్లీ వెనక్కు వెళ్లి చైతన్యపురి ప్రాంతంలో అదృశ్యమయ్యారు. ఆ రాత్రి ఓ లాడ్జిలో తలదాచుకున్న ఈ ద్వయం గురువారం ఉదయం నాగోల్‌లో ఓ స్నాచింగ్‌కు యత్నించింది. ఆపై 7 గంటలకు చైతన్యపురిలో మొదలెట్టి 40 నిమిషాల్లో వనస్థలిపురం, హయత్‌నగర్‌ల్లో నాలుగు స్నాచింగ్స్ చేసింది. హయత్‌నగర్ నుంచి తిరిగి ఎల్బీనగర్ మీదుగా సాగర్ రోడ్డు వరకు వెళ్లి అదృశ్యమైంది.
అద్దెకు ఇచ్చిన వారిని విచారిస్తే...
స్నాచింగ్ ఉదంతాల నేపథ్యంలో రికార్డైన సీసీ కెమెరా ఫుటేజ్‌లో కేటీఎం వాహనం వెనుక కూర్చున్న స్నాచర్ ఓ ట్రావెల్ బ్యాగ్‌ను వెనుక వేసుకున్నట్లు గుర్తించిన పోలీసులు బయటి నుంచి వచ్చిన దుండగులే ఈ పని చేశారని ప్రాథమికంగా నిర్థారించారు. ఆపై వాహనం సైతం లభించడంతో లోతుగా ఆరా తీశారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు స్నాచర్లు వాహనాన్ని మలక్‌పేటలో అద్దెకు తీసుకున్నట్లు తేలింది. వారు వినియోగించిన కేటీఎం వాహనం మహేశ్వర్‌రెడ్డి పేరుతో ఉండటంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా రెండేళ్ల క్రితం అతను దానిని మహ్మద్ ముఘాయిజ్‌ను విక్రయించినట్లు తేలింది. ఇతడి అనుచరుడైన సూఫియాన్ సదరు వాహనాన్ని కొన్నాళ్లుగా అద్దెకు ఇస్తున్నాడు. సూఫియాన్ వద్దే ఉత్తరాది స్నాచర్లకు ఈ వాహనాన్ని నగరానికి చెందిన ఓ వ్యక్తి అద్దెకు ఇప్పించినట్లు తేలింది. అతడిని పట్టుకుని విచారించగా సూత్రధారిగా బయటపడటంతో పాటు పాత్రధారుల వివరాలూ తెలిశాయి. యూపీ వెళ్లిన టాస్క్‌ఫోర్స్ ముమ్మరంగా గాలించి స్నాచర్లను పట్టుకుంది.
మూడు తులాలకు పైనే..
వీరి విచారణలో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. వీరిని విచారించిన అధికారులు ఉత్తరాదికి చెందిన ముఠాలు దక్షిణాదితో పాటు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండలపై ఎందుకు కన్నేస్తున్నారని ప్రశ్నించారు. దీనికి వారు చెప్పిన సమాధానం విని అధికారులే అవాక్కయ్యారు. ఉత్తర భారతదేశంలో మహిళలు మెడలో పుస్తెలతాడు లేదా బంగారు గొలుసులు ధరించి తిరగడం చాలా తక్కువట. ఒకవేళ ఎవరైనా తిరిగినా దాని బరువు గరిష్టంగా తులం, అంతకంటే తక్కువగానే ఉంటుందని ఈ ముఠా వెల్లడించింది. అదే దక్షిణ భారతదేశం విషయానికి వస్తే... ఇక్కడ మహిళలు కచ్చితంగా పుస్తెలతాడు ధరించడంతో పాటు ఏ గొలుసు చూసినా కనిష్టంగా మూడు తులాలు ఉంటుందని గుర్తించామన్నారు. దీంతోపాటు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండల్లో భాష సమస్య లేకపోవడంతో పాటు ప్రధాన రహదారులకు అనుసంధానంగా ఉండే లైన్లు, బైలైన్లు ఎక్కువ కావడంతో తప్పించుకోవడమూ సులువని వారు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment