
సాక్షి, బెంగళూరు : ఓలా క్యాబ్ డ్రైవర్ ఓ మహిళను బెంబేలెత్తించాడు. అసభ్యంగా తాకుతూ బెదిరిస్తూ ఆమెకు దాదాపు గుండె ఆగినంత పనిచేశాడు. అదృష్టవశాత్తు బయటపడిన బాధితురాలు ఆ రోజు రాత్రి తనకు కాలరాత్రి అంటూ తన భయానక అనుభవాన్ని వెల్లడించింది. వివరాల్లోకి వెళితే.. ఓ కంపెనీలో ఫ్యాషన్ స్టైలిస్ట్‌గా విధులు నిర్వహిస్తున్న 23 ఏళ్ల మహిళ ఆదివారం రాత్రి 10.30కు కంపెనీ రప్పించిన ఓలా కారులో ఎక్కింది. సరిగ్గా ఆగ్నేయ బెంగళూరు రింగ్ రోడ్డు వైపు ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో డ్రైవర్ కారును ఆపేశాడు. అప్పుడే ఆమె ఫోన్ బ్యాటరీ అయిపోవచ్చింది.
అదే సమయంలో కారు ఆపిన డ్రైవర్ ఆమె కాళ్లను అసభ్యంగా తాకడం మొదలుపెట్టాడు. ' ఆ రోజు రాత్రి రోడ్డుపై ఏ ఒక్కరూ లేరు. అతడు అనూహ్యంగా కారు ఆపగానే కారు అద్దంలో నుంచి బయటకు చూశా. అతడు నన్ను అసభ్యంగా తాకడం మొదలుపెట్టాడు. నేను అతడి బెదిరించాను. కారును ధ్వంసం చేసేందుకు ప్రయత్నించాను. వదిలేశాడు. ఓ ఆటో రిక్షా దొరికే వరకు నేను పరుగెత్తాను.అతడు నాకు ఫోన్ చేయడం మొదలుపెట్టాను. నంబర్ బ్లాక్ చేశాను. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశాను' అని ఆమె వివరించింది. ఈ సంఘటనపై ఓలా సంస్థ ఆమెకు క్షమాపణలు చెప్పింది. కేసు విషయంలో పూర్తిగా సహకరిస్తామని స్పష్టం చేస్తామని హామీ ఇచ్చింది.