నిందితురాలు, కిరాయి ముఠా సభ్యులు
సాక్షి, యలహంక(కర్ణాటక) : ఆస్తి అమ్మకానికి నిరాకరించాడని అక్క సొంత తమ్మున్ని హతమార్చడానికి పన్నాగం పన్నగా, మహిళతో పాటు నలుగురు సుపారి గ్యాంగ్ సభ్యులను యలహంక పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు యలహంక బిబి రోడ్డులో నివాసముంటున్న సందీప్‌రెడ్డి అక్క సుమలత. ఆమె భర్త క్యాట్ రాజు ఓ కేసులో నిందితునిగా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అతన్ని జైలు నుంచి బెయిలుపై విడిపించడానికి డబ్బు కావాలని అందుకు తమ్ముడు సందీప్‌రెడ్డికి సంబంధించిన ఆస్తిని అమ్మమని అక్క ఒత్తిడి చేస్తోంది. అందుకు తమ్ముడు నిరాకరిస్తున్నాడు. దీంతో ఎలాగైనా తమ్మున్ని హతమార్చి ఆస్తి కాజేసి అమ్మి వచ్చిన డబ్బుతో జైలులో శిక్ష అనుభవిస్తున్న భర్తను విడిపించుకోవాలని దురాలోచన చేసింది. తమ్మున్ని చంపే పనిని ఒక కిరాయి ముఠాకు అప్పగించింది. (ఎంపీ రంగయ్యకు ప్రధాని మోదీ లేఖ)
అందరూ కలిసి సందీప్ రెడ్డిని హతమార్చడానికి పథకం రచించారు. మే 29వ తేదీ అర్ధరాత్రి మారణాయుధాలతో సందీప్ రెడ్డిపై దాడి చేయడంతో అతడు గాయపడి స్పృహ తప్పిపడిపోయాడు. చనిపోయాడని భావించి వెళ్లిపోయారు. రక్తపు మడుగులో పడి ఉన్న సందీప్ రెడ్డి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈ సంఘటనపై యలహంక పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి విచారించగా అక్క సుమలత, కిరాయి మూకలు మంజు, గౌతమ్, వినాయక్, మౌలాలి ఖాన్‌ల పాత్ర బయటపడడంతో వారిని అరెస్టు చేశారు. డిసిపి భీమాశంకర్, ఎసిపి శ్రీనివాస్ సూచనలతో సిఐ రామకృష్ణ రెడ్డి నిందితులను అరెస్టు చేశారు. (కొద్ది సేపట్లో భర్త రెండో పెళ్లి.. )
దెయ్యం విడిపిస్తానని లైంగికదాడి
మైసూరు: దెయ్యం విడిపిస్తానని చెప్పి యువతిపై ఒక ధర్మ గురువు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన మైసూరు జిల్లాలో జరిగింది. చిల్కుంద గ్రామానికి చెందిన యువతి మానసికంగా ఇబ్బంది పడుతోంది. ఆమెకు దయ్యం పట్టిందని భావించిన బంధువు... హణసూరు లాల్‌బన్ వీధికి చెందిన ధర్మగురువు జబీవుల్లా వద్దకు తీసుకొచ్చాడు. ఆమెపై మంత్ర ప్రయోగం జరిగిందని, దయ్యం పట్టుకుందని పిరియాపట్టణ దర్గా వద్దకు తీసుకొస్తే దెయ్యాన్ని విడిపిస్తానని చెప్పి వెళ్లిపోయాడు. దీంతో బంధువు ఆ యువతిని దర్గా వద్దకు తీసుకెళ్లాడు. యువతి వద్ద ఉంటే నీకూ దెయ్యం పడుతుందని బంధువును దూరంగా పంపించాడు. అనంతరం యువతికి స్నానం చేయాలనే నెపంతో తీసుకెళ్లి జబీవుల్లా అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ పైశాచిక కృత్యంతో బెదిరిపోయిన యువతి జరిగిన సంగతిని తన తండ్రికి తెలిపింది. యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హుణసూరు గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి జబీవుల్లాను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment