పంచలోహ విగ్రహం చేతిలో నాగమణి.. | Panchaloha Statue Robbery Gang Arrested in Hyderabad | Sakshi
Sakshi News home page

మహిమాన్వితమంటూ మస్కా!

Published Wed, Feb 26 2020 7:39 AM | Last Updated on Wed, Feb 26 2020 11:09 AM

Panchaloha Statue Robbery Gang Arrested in Hyderabad - Sakshi

విగ్రహాన్ని చూపిస్తున్న నగర సీపీ అంజనీకుమార్‌

సాక్షి, సిటీబ్యూరో: ఇత్తడితో చేసిన దుర్గామాత విగ్రహాన్ని పంచలోహ విగ్రహంగా చెబుతూ..  సాధారణ రాళ్లను నాగమణులుగా ప్రచారం చేస్తూ.. ఈ రెంటినీ కలిపి పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మించి రూ.కోటికి అంటగట్టడానికి ప్రయత్నించిన ముఠాకు పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు చెక్‌ చెప్పారు. ఈ కేసుకు సంబంధించి మంగళవారం నలుగురు నిందితుల్ని అరెస్టు చేసినట్లు నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ పి.రాధాకిషన్‌ రావుతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితులను కుల్సుంపురా పోలీసులకు అప్పగించామని ఆయన పేర్కొన్నారు.

కస్టమర్‌తో కలిసి దందా..
కార్వాన్‌ ప్రాంతంలో నివసించే బి.దేవేందర్‌ జియాగూడలోని గోట్‌ మార్కెట్‌లోని మహ్మద్‌ అష్రఫ్‌ దుకాణంలో దినసరి కూలీగా పని చేస్తుంటాడు. ఇతడు కొన్నాళ్ల క్రితం ముంబై వెళ్లాడు. అక్కడ ఓ గుర్తుతెలియని వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తన వద్ద మహిమాన్వితమైన నాగమణి ఉందని, దాన్ని దగ్గర పెట్టుకుంటే అదృష్టం కలిసి వస్తుందని చెప్పిన ఆ వ్యక్తి ఓ సా«ధారణ రాయిని చిన్న బాక్సులో పెట్టి రూ.లక్షకు దేవేందర్‌కు విక్రయించాడు. దాన్ని నగరానికి తీసుకువచ్చిన అష్రఫ్‌ తన వద్దే ఉంచుకున్నాడు. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన టి.జాన్‌ ఆర్మీలో సిపాయిగా పని చేసి ఆరోగ్య కారణాల నేపథ్యంలో బయటకు వచ్చారు. ఆపై చిట్‌ఫండ్స్‌ వ్యాపారం చేసినా.. నష్టాలు రావడంతో ప్రస్తుతం వంటపని చేస్తున్నారు. ఇతడు మటన్‌ కొనుగోలు కోసం తరచూ అష్రఫ్‌ దుకాణానికి వెళ్లేవాడు. ఈ నేపథ్యంలోనే ఇతగాడికి దేవేందర్‌తో పరిచయం ఏర్పడింది. దేవేందర్‌ తన వద్ద ఉన్న నాగమణి విషయాన్ని జాన్‌కు చెప్పాడు. దాన్ని పరిశీలించిన జాన్‌.. దీన్ని పంచలోహాలతో తయారైన దుర్గామాత విగ్రహం చేతిలో పెట్టి పూజలు చేయాల్సి ఉంటుందని చెప్పాడు. 

రూ.లక్షన్నర వెచ్చించి.. కాకినాడ నుంచి..
తాను విగ్రహాన్ని సమీకరిస్తానని జాన్‌ చెప్పడంతో దేవేందర్‌ అంగీకరించాడు. దీంతో కొన్నాళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకు వెళ్లిన జాన్‌ అక్కడ పూజారిగా పని చేస్తున్న తన పరిచయస్తుడిని కలిసి తమకు ఇత్తడి దుర్గామాత విగ్రహం కావాలని కోరాడు. ఆయన సూచించిన దుకాణంలో రూ.1.5 లక్షలు వెచ్చించి మూడు అడుగుల ఎత్తు, 30 కేజీలకుపైగా బరువు ఉన్న ఇత్తడి దుర్గామాత విగ్రహాన్ని ఖరీదు చేసుకుని నగరానికి చేరుకున్నాడు. దీన్ని పంచలోహ విగ్రహంగా పేర్కొంటూ దేవేందర్‌కు అప్పగించి... నాగమణితో కలిపి ఎక్కువ ధరకు అమ్మి సొమ్ము చేసుకుందామని చెప్పాడు. తమ వద్ద మహిమాన్వితమైన విగ్రహం, నాగమణి ఉన్నాయనే విషయాన్ని దేవేందర్‌ అష్రఫ్‌కు చెప్పాడు. ఆయన ఈ విషయాన్ని తన స్నేహితుడైన రామ్‌కోఠి వాసి ప్రేమ్‌చంద్‌ గుప్తాకు తెలిపాడు. ఆ రెంటినీ రూ.కోటికి అమ్మేయడం ద్వారా డబ్బును నలుగురూ పంచుకోవాలని పథకం వేశారు. దీంతో గడిచిన కొన్నాళ్లుగా వీళ్లు నకిలీ నాగమణి, పంచలోహంగా చెబుతూ ఇత్తడి విగ్రహాన్ని రూ.కోటికి ఖరీదు చేసే కస్టమర్ల కోసం వెతుకుతున్నారు. నాలుగే చేతులతో ఉన్న ఈ విగ్రహానికి ముందుకు చాపి ఉన్న ఒక ఎడమ చేతిలో నాగమణి పెట్టి పూజలు చేయాలంటూ నమ్మబలుకుతూ దాదాపు ముగ్గురు నలుగురు వ్యాపారులనూ సంప్రదించారు. ఈ విషయంపై పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్‌కు ఉప్పందింది. దీంతో ఇన్‌స్పెక్టర్‌ బి.గట్టుమల్లు నేతృత్వంలో ఎస్సైలు ఎన్‌.రంజిత్‌కుమార్, పి.మల్లికార్జున్, మహ్మద్‌ ముజఫర్‌ అలీ వలపన్ని మంగళవారం నలుగురినీ పట్టుకుని ఇత్తడి విగ్రహం, నకిలీ నాగమణి స్వాధీనం చేసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement