Pancaloha statues
-
పంచలోహ విగ్రహం చేతిలో నాగమణి..
సాక్షి, సిటీబ్యూరో: ఇత్తడితో చేసిన దుర్గామాత విగ్రహాన్ని పంచలోహ విగ్రహంగా చెబుతూ.. సాధారణ రాళ్లను నాగమణులుగా ప్రచారం చేస్తూ.. ఈ రెంటినీ కలిపి పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మించి రూ.కోటికి అంటగట్టడానికి ప్రయత్నించిన ముఠాకు పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు చెక్ చెప్పారు. ఈ కేసుకు సంబంధించి మంగళవారం నలుగురు నిందితుల్ని అరెస్టు చేసినట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ పి.రాధాకిషన్ రావుతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితులను కుల్సుంపురా పోలీసులకు అప్పగించామని ఆయన పేర్కొన్నారు. కస్టమర్‌తో కలిసి దందా.. కార్వాన్ ప్రాంతంలో నివసించే బి.దేవేందర్ జియాగూడలోని గోట్ మార్కెట్లోని మహ్మద్ అష్రఫ్ దుకాణంలో దినసరి కూలీగా పని చేస్తుంటాడు. ఇతడు కొన్నాళ్ల క్రితం ముంబై వెళ్లాడు. అక్కడ ఓ గుర్తుతెలియని వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తన వద్ద మహిమాన్వితమైన నాగమణి ఉందని, దాన్ని దగ్గర పెట్టుకుంటే అదృష్టం కలిసి వస్తుందని చెప్పిన ఆ వ్యక్తి ఓ సా«ధారణ రాయిని చిన్న బాక్సులో పెట్టి రూ.లక్షకు దేవేందర్‌కు విక్రయించాడు. దాన్ని నగరానికి తీసుకువచ్చిన అష్రఫ్ తన వద్దే ఉంచుకున్నాడు. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన టి.జాన్ ఆర్మీలో సిపాయిగా పని చేసి ఆరోగ్య కారణాల నేపథ్యంలో బయటకు వచ్చారు. ఆపై చిట్‌ఫండ్స్ వ్యాపారం చేసినా.. నష్టాలు రావడంతో ప్రస్తుతం వంటపని చేస్తున్నారు. ఇతడు మటన్ కొనుగోలు కోసం తరచూ అష్రఫ్ దుకాణానికి వెళ్లేవాడు. ఈ నేపథ్యంలోనే ఇతగాడికి దేవేందర్‌తో పరిచయం ఏర్పడింది. దేవేందర్ తన వద్ద ఉన్న నాగమణి విషయాన్ని జాన్‌కు చెప్పాడు. దాన్ని పరిశీలించిన జాన్.. దీన్ని పంచలోహాలతో తయారైన దుర్గామాత విగ్రహం చేతిలో పెట్టి పూజలు చేయాల్సి ఉంటుందని చెప్పాడు. రూ.లక్షన్నర వెచ్చించి.. కాకినాడ నుంచి.. తాను విగ్రహాన్ని సమీకరిస్తానని జాన్ చెప్పడంతో దేవేందర్ అంగీకరించాడు. దీంతో కొన్నాళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకు వెళ్లిన జాన్ అక్కడ పూజారిగా పని చేస్తున్న తన పరిచయస్తుడిని కలిసి తమకు ఇత్తడి దుర్గామాత విగ్రహం కావాలని కోరాడు. ఆయన సూచించిన దుకాణంలో రూ.1.5 లక్షలు వెచ్చించి మూడు అడుగుల ఎత్తు, 30 కేజీలకుపైగా బరువు ఉన్న ఇత్తడి దుర్గామాత విగ్రహాన్ని ఖరీదు చేసుకుని నగరానికి చేరుకున్నాడు. దీన్ని పంచలోహ విగ్రహంగా పేర్కొంటూ దేవేందర్‌కు అప్పగించి... నాగమణితో కలిపి ఎక్కువ ధరకు అమ్మి సొమ్ము చేసుకుందామని చెప్పాడు. తమ వద్ద మహిమాన్వితమైన విగ్రహం, నాగమణి ఉన్నాయనే విషయాన్ని దేవేందర్ అష్రఫ్‌కు చెప్పాడు. ఆయన ఈ విషయాన్ని తన స్నేహితుడైన రామ్‌కోఠి వాసి ప్రేమ్‌చంద్ గుప్తాకు తెలిపాడు. ఆ రెంటినీ రూ.కోటికి అమ్మేయడం ద్వారా డబ్బును నలుగురూ పంచుకోవాలని పథకం వేశారు. దీంతో గడిచిన కొన్నాళ్లుగా వీళ్లు నకిలీ నాగమణి, పంచలోహంగా చెబుతూ ఇత్తడి విగ్రహాన్ని రూ.కోటికి ఖరీదు చేసే కస్టమర్ల కోసం వెతుకుతున్నారు. నాలుగే చేతులతో ఉన్న ఈ విగ్రహానికి ముందుకు చాపి ఉన్న ఒక ఎడమ చేతిలో నాగమణి పెట్టి పూజలు చేయాలంటూ నమ్మబలుకుతూ దాదాపు ముగ్గురు నలుగురు వ్యాపారులనూ సంప్రదించారు. ఈ విషయంపై పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్‌కు ఉప్పందింది. దీంతో ఇన్స్పెక్టర్ బి.గట్టుమల్లు నేతృత్వంలో ఎస్సైలు ఎన్.రంజిత్‌కుమార్, పి.మల్లికార్జున్, మహ్మద్ ముజఫర్ అలీ వలపన్ని మంగళవారం నలుగురినీ పట్టుకుని ఇత్తడి విగ్రహం, నకిలీ నాగమణి స్వాధీనం చేసుకున్నారు. -
పంచలోహ విగ్రహాల చోరీ
ఈపూరు : గుంటూరు జిల్లా ఈపూరు మండలం బొగ్గారంలో గురువారం రాత్రి చోరీ జరిగింది. గ్రామంలో హనుమాన్ ఆలయంలో ఉన్న మూడు పంచలోహ విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. ఈ విషయం గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన స్థానిక ఎస్ఐ ఉజ్వల్ కుమార్ దర్యాప్తు ప్రారంభించారు. -
పంచలోహ విగ్రహాలు చోరీ...
- దొంగలను పట్టుకున్న రైతులు వల్లూరు(మహబూబ్‌నగర్ జిల్లా) మహబూబ్‌నగర్ జిల్లా ఇటిక్యాల మండలం వల్లూరులోని శ్రీవేణుగోపాలస్వామి ఆలయంలో పంచలోహ విగ్రహాలు, విలువైన వెండి, బంగారు ఆభరణాలను దొంలించిన దొంగలను ఆదివారం ఉదయం రైతులు పట్టుకున్నారు. వారికి దేహశుద్ధిచేసి పోలీసులకు అప్పగించారు. శ్రీవేణుగోపాలస్వామి ఆలయంలో శనివారం రాత్రి దొంగలుపడి 3 పంచలోహ విగ్రహాలతోపాటు బంగారు,వెండి ఆభరణాలు చోరీచేశారు. చోరీ విషయం గమనించిన స్థానికులు ఆదివారం ఉదయం పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను రైతులు పట్టుకుని ప్రశ్నించడంతో వారే దొంగతనం చేశారని అంగీకరించారు. దాంతో వారికి దేహశుద్ధిచేసి కొండాపురం పోలీసులకు అప్పగించారు. శ్రీవేణుగోపాలస్వామి ఆలయం నల్లసోమనాద్రి కాలం నాటిదని, పంచలోహ విగ్రహాలు 150 సంవత్సరాలనాటివని పోలీసులు తెలిపారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విక్రయించేందుకు వచ్చి.. పోలీసులకు చిక్కి.!
► ఆదోనిలో గుప్త నిధుల పేరుతో రైతును బురిడీకి యత్నించిన ముఠా ► పంచలోహ విగ్రహాలను విక్రయించేందుకు వచ్చి పోలీసులకు చిక్కిన ముఠా సభ్యులు కర్నూలు: పంచలో విగ్రహాలను విక్రయించడానికి వచ్చిన ఓ ముఠా పోలీసుల వలలో పడ్డారు. ఆదోని పట్టణానికి చెందిన బోయ ఉరుకుందప్ప పొలంలో పెద్ద ఎత్తున ధనం ఉందని వెలికి తీస్తామని ముఠా సభ్యులు నమ్మించి అతని వద్ద భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసేందుకు విఫలయత్నం చేసి చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. ఆ వివరాలు.. పట్టణానికి చెందిన షేక్ మహబూబ్ బాషా, సయ్యద్ తహీర్, కర్నూలు పట్టణానికి చెందిన మహమ్మద్ షరీఫ్, షేక్ అలీ, నవాబు పేట అల్లాబకాష్ తదితరులు ముఠాగా ఏర్పడి పథకం ప్రకారం బోయ ఉరుకుందప్ప పొలంలో పంచలోహ విగ్రహాలను పాతిపెట్టారు. బోయ ఉరుకుందప్ప, బోయ ఈరప్పలను కలిసి పలానా చోట టన్నుల కొద్ది గుప్త నిధులున్నాయని నమ్మబలికారు. వాటిని వెలికి తీసేందుకు రూ.16 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని రూ.లక్ష అడ్వాన్స్ తీసుకుని పొలంలోకి వెళ్లి తవ్వకాలు జరిపి రెండు విగ్రహాలను వెలికి తీసి రైతులను నమ్మించారు. ఇంకా భారీ మొత్తంలో ఇక్కడ గుప్త నిధులున్నాయని, మిగిలిన డబ్బులు అప్పగిస్తే వాటిని కూడా వెలికి తీసి ఇస్తామని నమ్మించారు. బయట పడిన పురాతన వస్తువులను విక్రయించేందుకు కర్నూలుకు వచ్చి ముఠా సభ్యులంతా కల్లూరులోని నవాబ్‌పేట అల్లాబకాష్‌ను ఆశ్రయించి పోలీసులకు దొరికిపోయారు. పోలీసులకు ఇలా పట్టుబడ్డారు.. బోయ ఉరుకుందప్ప పొలంలో తవ్వకాలు జరిపి వెలికితీసిన నాగదేవత, శివుడి విగ్రహాలు, 5 బంగారు వర్ణం కలిగిన బల్లేలు, ఇత్తడి బిందె, ఇత్తడి మూతతో పాటు ఒక సంచిలో వేసుకుని కల్లూరులోని నవాబుపేట అల్లాబకాష్ దగ్గరికి వచ్చారు. సోమవారం వాటిని విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా నాల్గవ పట్టణ పోలీసులకు సమాచారం అందడంతో మారువేషంలో కల్లూరులోని నిర్మల్ నగర్ లక్ష్మీ కమర్షియల్ కాంప్లెక్స్ వద్ద కాపు కాసి ఏడుగురిని పట్టుకుని వారి వద్ద నుంచి 18వ శతాబ్దం నాటి పంచలోహ విగ్రహాలను స్వాధీనం చేసుకుని ఎస్పీ ఆకే రవికృష్ణ ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, నాల్గవ పట్టణ సీఐ నాగరాజురావుతో కలసి విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరాలను వెల్లడించారు.