ప్రేమజంట సౌజన్య, ప్రాణదీప్
నిజామాబాద్ క్రైం(నిజామాబాద్ అర్బన్) : ప్రేమ జంట వివాహాన్ని యువతి బంధువులు అడ్డుకున్నారు. వరుడిపై దాడి చేసి పెళ్లి కూతురును వేదికపై నుంచి బలవంతంగా ఎత్తుకెళ్లారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రెంజల్ మండలం వీరన్నగుట్టకు చెందిన ప్రాణదీప్, మాక్లూర్ మండలం కొత్తపల్లికి చెందిన సౌజన్యలు నాలుగేళ్లుగా ప్రే మించుకున్నారు.
వివాహం చేసుకునేందుకు బుధవారం నగరంలోని ఆర్యసమాజ్‌కు వచ్చారు. మరో 15 నిమిషాలలో వివాహం జరుగుతుందనగా పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు, బంధువులకు విషయం తెలిసింది. వెంటనే అక్కడకు వచ్చి పెండ్లి దుస్తులు ధరించి ఉన్న ప్రాణదీప్‌ను చితక బాదా రు. ఆర్యసమాజ్ నుంచి సౌజన్యను బలవంతంగా బైక్‌పై ఎత్తుకెళ్లిపోయారు.
ఈ సందర్భంగా ఆర్యసమాజ్ బయట రోడ్డుపై కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. పెండ్లి కొడుకు స్నేహితులు డయల్ 100కు ఫోన్‌చేయగా, అక్కడికి 2వ టౌన్ పోలీసులు చేరుకున్నారు. అప్పటికే సౌజన్యను అక్కడి నుంచి బంధువులు తీసుకెళ్లిపోయారు. తమ పెళ్లిని అడ్డుకున్న సౌజన్య తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులపై ప్రాణదీప్ ఫిర్యాదు చేసినట్లు ఎస్సై అంజనేయులు తెలిపారు.
తామిద్దరం మేజర్లైనప్పటికీ పెండ్లిని అడ్డుకున్నారని, సౌజన్యను బలవంతంగా ఎత్తుకుపోయారని ప్రాణదీప్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, అయితే ప్రేమజంట మేజర్లా కాదా అనే విషయాన్ని దర్యాప్తు చేసి వారికి న్యాయం చేస్తామని ఎస్సై పేర్కొన్నారు. దాడిలో గాయపడిన ప్రాణదీప్‌ను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment