మృతదేహాల వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు ,తల్లిదండ్రులను ఒకేసారి కోల్పోయిన నందిని, గ్రీష్మ
ఉలవపాడు : ఆ చిన్నారులకు ఇంకా ఊహే తెలియదు. తల్లి చాటు బిడ్డలు వారు. అలాంటి చిట్టి హృదయాలకు కొండంత కష్టం వచ్చింది. శనివారం గుడ్లూరు మండల పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకేసారి తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిపోయారు. విగత జీవులుగా ఉన్న తల్లిదండ్రులను చూసి మళ్లీ వస్తారేమోనని ఆ చిన్నారులు పిలుస్తుంటే అక్కడి వారి హృదయాలు తల్లడిల్లిపోయాయి. మండల పరిధిలోని బద్దిపూడి గ్రామానికి చెందిన భార్యాభర్తలు నలగంగు రవి (35), నారాయణమ్మ (30) దంపతులు తమ చిన్న కుమార్తె మూడేళ్ల గ్రీష్మతో కలిసి ద్విచక్ర వాహనంపై అత్తగారి ఊరు వెళ్తున్నారు. మార్గమధ్యంలో గుడ్లూరు మండల పరిధిలోని మన్నేరు దాటిన తర్వాత రోడ్డు ప్రమాదానికి గురై దంపతులు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
వారిద్దరి మధ్యలో కూర్చోన్న చిన్న కుమార్తె గ్రీష్మ ఎగిరి చెట్లలో పడటంతో ప్రాణాలతో బయటపడింది. మృతదేహాలను ఆదివారం స్వగ్రామం బద్దిపూడి తీసుకురావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దంపతుల పెద్ద కుమార్తె ఏడేళ్ల నందిని, మూడేళ్ల గ్రీష్మలు అనాథలుగా మిగిలిపోయారు. చివరకు నాయనమ్మ రమణమ్మే ఆ చిన్నారులకు దిక్కయింది. తాత కూడా లేడు. కొడుకు, కోడలు మరణించడంతో రమణమ్మ ఒంటరైంది. వయసుపై బడింది. ఇద్దరు చిన్నారుల ఆలనాపాలన చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ ఇంటి పరిస్థితి చూసిన వారు విచారం వ్యక్తం చేస్తున్నారు.
ఆ బిడ్డలకు తోడెవరు?
అసలే పేద కుటుంబం. ఇప్పటి వరకూ రమణమ్మ కుమారుడే చెరువుల వద్ద విద్యుత్ పనులు చేసి కుటుంబాన్ని పోషించాడు. ఇలాంటి పరిస్థితిలో ఎవరూ లేని ఆ తల్లి రమణమ్మ, చిన్నారుల పరిస్థితి ఏమిటో గ్రామస్తులకు అర్థం కావడం లేదు. మాటలు కూడా సరిగా రాని చిన్న కుమార్తె గ్రీష్మ అందరూ ఏడుస్తుంటే తానూ ఏడుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment