ఉద్యోగాలిప్పిస్తానని.. ఉడాయించేశాడు..! | Person Cheated Unemployed Youth By Not Giving Jobs In Visakhapatnam | Sakshi
Sakshi News home page

ఉద్యోగాలిప్పిస్తానని.. ఉడాయించేశాడు..!

Published Sun, Jul 21 2019 11:55 AM | Last Updated on Sun, Jul 21 2019 11:55 AM

Person Cheated Unemployed Youth By Not Giving Jobs In Visakhapatnam  - Sakshi

వెజాగ్‌ హోమ్స్‌ ఏసీ సర్వీస్‌ సెంటర్‌ యాజమాని మురహరి సాయి సంతోష్‌

సాక్షి, విశాఖపట్నం : నిరుద్యోగులే టార్గెట్‌... ఉద్యోగం కోసం ఆశగా నిరీక్షిస్తున్న వారు కనిపించగానే అక్కడ వాలిపోయాడు... డీఆర్‌ఎం ఆఫీసులో తను పనిచేస్తున్నానని, ఉద్యోగాలిప్పిస్తానని నమ్మించి రూ.కోటికిపైగా వసూలు చేసేశాడు... అనంతరం అదుగో ఉద్యోగాలు.. ఇదిగో ఉద్యోగాలు.. అంటూ కాలం గడిపేశాడు.. చివరకు బండారం బయటపడుతుందని అనుమానం రాగానే నగరం నుంచి ఉడాయించేశాడు. దీంతో మోసపోయిన 30 మందికిపైగా బాధితులు నాలుగో పట్టణ పోలీసులను ఆశ్రయించారు. ఇందుకు సంబంధించి పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... 

నమ్మించి టోకరా 
నగరంలోని అక్కయ్యపాలెంలో ‘వైజాగ్‌ హోమ్స్‌’ పేరిట ఎయిర్‌ కూలర్‌ సర్వీస్‌ సెంటర్‌ను శ్రీకాకుళం జిల్లాకు చెందిన మురహరి సాయి సంతోష్‌ నిర్వహించేవాడు. అందులో నష్టాలు రావడంతో తెలిసిన వారి వద్ద అప్పులు చేశాడు. వాటి నుంచి గట్టెక్కేందుకు సులువుగా డబ్బులు సంపాదించాలని భావించాడు. అనుకున్నదే తడువుగా నిరుద్యోగులను తన టార్గెట్‌గా పెట్టుకున్నాడు. గత ఏప్రిల్‌ నెలలో రైల్వే శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులకు నమ్మించాడు. వారు తెలియనప్పటికీ సంతోష్‌ నేరుగా వెళ్లి పరిచయం చేసుకునేవాడు.

డీఆర్‌ఎం కార్యాలయంలో హెచ్‌ఆర్‌ విభాగంలో రిక్రూట్‌మెంట్‌ అధికారిగా పనిచేస్తున్నాను... రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేవాడు. అనంతరం అతని భార్య మురహరి సుజాతని రంగంలోకి దింపేవాడు. ఆమె చాకచక్యంగా మాట్లాడుతూ నిరుద్యోగులను అక్కయ్యపాలెం పరిధి లలితానగర్‌లోని ఎంకే కైలాస్‌ టవర్స్‌లో అద్దెకు ఉంటున్న తమ నివాసానికి తీసుకొచ్చి నమ్మకం కలిగించేది. మరికొందరిని డీఆర్‌ఎం కార్యాలయానికి రమ్మని అక్కడి పరిచయాలతో నమ్మకం కలిగించేవాడు. పూర్తిగా నిరుద్యోగులను నమ్మించిన తర్వాత డబ్బులు అకౌంట్‌లో వేయాలని చెప్పేవాడు. ఇలా మొత్తం ఐదు అకౌంట్‌లలో బాధితుల నుంచి డబ్బులు డిపాజిట్‌ చేయించుకున్నాడు. అలా సుమారు 30 మంది నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.4లక్షలు చొప్పున రూ.కోటికి పైగా వసూలు చేశాడు. 

సెంటర్‌లోని ఫర్నిచర్‌ తరలింపు 
బాధితుల నుంచి డబ్బులు తీసుకున్న తర్వాత వారిని నమ్మించేందుకు భువనేశ్వర్‌కు వెళ్లేందుకు రైలు రిజర్వేషన్‌ చేయించుకోమనేవా డు. ఈ క్రమంలో వారు సిద్ధమైతే వాయిదా వేసేవాడు. చివరకు ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసేశాడు. దీంతో మోసపోయామని భావించిన బాధితులు అప్పట్లోనే నగరంలోని నాలుగో పట్టణ పోలీసులను ఆశ్రయించారు. దీంతో అతని ఇల్లు, వైజాగ్‌ హోమ్స్‌ సర్వీసు సెంటర్‌పై పోలీసులు నిఘా పెట్టారు.

అయినప్పటికీ వారి కళ్లుగప్పి గురువారం రాత్రి అందులోని ఫర్నిచర్, కంప్యూటర్లు, ఇతర విలువైన సామగ్రిని మురహరి సాయి సంతోష్‌ తరలించుకుపోయాడు. దీంతో విషయం తెలుసుకున్న బాధితులు మరోసారి పోలీసులను ఆశ్రయించారు. సంతోష్‌ను అదుపులోకి తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇదేవిషయాన్ని నాలుగో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐ సూర్యనారాయణ వద్ద ప్రస్తావించగా కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని బాధితులకు న్యాయం చేస్తామన్నారు. 

30 మందికిపైగా బాధితులు 
మురహరి సంతోష్‌ బాధితులు విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో 30 మందికిపైగా ఉన్నా రు. వారిలో శ్రీనివాస్, నక్కరాజు వెంకట సింహాద్రి, నక్కరాజు శివ, కర్రి సత్యారావు, గరికిన స్వర్ణ, గుర్రం అనిల్‌కుమార్, నక్కా రమణ, గెడ్ల మోహన్‌రెడ్డి, జి.వెంకట సతీష్, వళ్లు సూర్యనారాయణ, ఎల్లా త్రీనాథమ్మ, రేగిడి పద్మలతో కలిసి 30 మందికి పైగా బాధితులున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement