
సాక్షి, న్యూఢిల్లీ : సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్‌కు ఊహించని ఝలక్ తగిలింది. కర సేవకులపై కాల్పుల ఘటన కేసులో ఆయనకు సంబంధం ఉందంటూ సుప్రీంకోర్టులో మంగళవారం ఓ పిటిషన్ దాఖలైంది.
ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మనుషులను కాల్చి చంపాలంటూ ములాయం ఆదేశాలు ఇవ్వటం దారుణం. ఆయనపై అభియోగాలు నమోదు చేసి.. విచారణ జరిపించాల్సిందేనని పిటిషనర్ కోర్టును అభ్యర్థించారు. కాగా, అక్టోబర్ 30, 1990లో అయోధ్య దగ్గర అల్లర్లు చెలరేగగా.. కర సేవకులపై కాల్పులు జరపాల్సిందిగా నాడు ముఖ్యమంత్రిగా ఉన్న ములాయం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మొత్తం 16 మంది మృతి చెందారు.
అయితే ఈ ఘటనపై ఇప్పటికే పలుమార్లు ఆయన తన పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ముస్లిం మైనార్టీలను రక్షించాలన్న ఉద్దేశ్యంతోనే తాను అలా ఆదేశాలు జారీ చేశానని.. ఒకవేళ ఆనాడు ప్రభుత్వం వారిని అడ్డుకోకపోయి ఉంటే మారణహోమం జరిగి ఉండేదని ఆయన చెప్పుకొచ్చారు. ‘‘ముస్లిం కమ్యూనిటీ విశ్వాసం, దేశ సమైక్యతను కాపాడాలన్న ఉద్దేశ్యంతోనే ఆదేశాలు ఇచ్చా’’ అని ఆయన సమర్థించుకున్నారు. కాగా, ఈ ఘటన జరిగిన మరుసటి ఏడాదే అంటే 1991 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయి ములాయం గద్దె దిగిపోవాల్సి వచ్చింది.