వరుసలుపెట్టి పిలుస్తూ.. | police arrest thief in suryapet | Sakshi
Sakshi News home page

వరుసలుపెట్టి పిలుస్తూ..

Published Wed, Oct 4 2017 11:24 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

police arrest thief  in suryapet - Sakshi

వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ నాగేశ్వర్‌రావు

నల్లగొండ, సూర్యాపేట క్రైం : అమ్మా.. అక్కా.. అన్నా ఉన్నావా అంటూ వరుసలు పెట్టి పిలుస్తూ.. దప్పిక వేస్తోంది.. నీళ్లు ఇవ్వమని అడుగుతూ.. మాటల్లోకి దించి చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని సూర్యాపేట పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఎం.నాగేశ్వరరావు వివరాలు వెల్లడించారు. పట్టణంలోని జేజేనగర్‌కు చెందిన నరందాసు మణికంఠ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో దొంగతనాలకు అలవాటుపడ్డాడు. సెప్టెంబర్‌ 15న స్థానిక 60 ఫీట్ల రోడ్డులో గల ఓ ఇంటికి వెళ్లి దప్పిక వేస్తుందని.. ఇంట్లో ఉన్న వృద్ధురాలిని మాటల్లోకి దింపి బంగారు గొలుసు, ముత్యపు ఉంగరం, రూ.600 గల పర్సును దొంగిలించాడు. ఉంగరాన్ని ముత్తూట్‌ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టి రూ.6700 తీసుకుని వాడుకున్నాడు. సెప్టెంబర్‌ 26న తేదీన సూర్యాపేటలోని కబేళా బజారులో గల ఓ ఇంటికి వెళ్లి ఇంట్లోని బీరువా సీక్రెట్‌ లాకర్‌ను పగులగొట్టి బీరువాలో గల పుస్తెలతాడు, ఉంగరం, దిద్దులు, లక్ష్మీదేవి బిల్ల, వెండి కుంకుడుకాయ, పర్సు దొంగలించాడు. నకిరేకల్‌కు వెళ్లి గుర్తు తెలియని వ్యక్తికి ఒక ఉంగరం, దిద్దు బుట్టలు తాకట్టు పెట్టి రూ.3 వేలు తీసుకున్నాడు. 28న పట్టణంలోని ముత్తూట్‌ ఫైనాన్స్‌లో పుస్తెల తాడును తాకట్టుపెట్టి రూ.39000 తీసుకున్నాడు.

మంగళవారం స్థానిక కొత్త బస్టాండ్‌ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా మణికంఠపై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్‌కు తీసుకొచ్చి సోదాచేశారు. అతని వద్ద బంగారు గొలుసు, లక్ష్మీదేవి బొమ్మ గల బంగారు బిల్ల, బంగారు చెవి దిద్దుబుట్టా, వెండి కుంకుడుకాయ లభ్యమయ్యాయి. వీటిపై విచారించగా.. నేరం ఒప్పుకున్నాడు. నిందితుడి నుంచి సుమారు రూ. 1.50 లక్షల విలువ చేసే ఐదు తులాల ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మణికంఠ గతంలో పట్టణంలోనే చాలా దొంగతనాలు చేశాడు. 2016, డిసెంబర్‌లో సూర్యాపేటలో మూడు చోరీలకు పాల్పడి.. పోలీసులకు పట్టబడ్డాడు. ఈ కేసుల్లో 8 నెలల శిక్ష అనుభవించాడు. ఆగస్టులో జైలు నుంచి విడుదలైన తర్వాత తిరిగి చోరీలకు పాల్పడుతున్నాడు. సమావేశంలో సీఐ వై.మొగలయ్య, ఎస్‌ఐ జానికిరాములు, ఐడీ పార్టీ హెడ్‌ కానిస్టేబుల్‌ చనగాని వెంకన్నగౌడ్, ఐడీ పార్టీ కానిస్టేబుళ్లు చామకూరి శ్రీనివాస్‌గౌడ్, రామచంద్రయ్య, దైద రాజు, జనార్దన్‌రెడ్డి, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement