కాయ్‌ రాజాల పట్టివేత... | Police Arrested Cricket Betting Gang In Kurnool, Seized Huge Money | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ బుకీల అరెస్టు

Published Tue, Apr 24 2018 11:36 AM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM

Police Arrested Cricket Betting Gang In Kurnool, Seized Huge Money - Sakshi

బెట్టింగ్‌ రాయుళ్లను మీడియా ఎదుట హాజరుపరిచిన పోలీసు అధికారులు

సాక్షి, కర్నూలు:  జిల్లాలో కర్నూలు, ఆదోని, నంద్యాల, కోవెలకుంట్ల ప్రాంతాల్లో  క్రికెట్‌ బెట్టింగ్‌ జోరుగా సాగుతున్న నేపథ్యంలో పోలీసులు దాడులు ముమ్మరం చేశారు. ఈ మేరకు సీసీఎస్‌ డీఎస్పీ హుసేన్‌ పీరా నేతృత్వంలో పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి ఆదివారం రాత్రి దాడులు నిర్వహించారు. కర్నూలు నగరం పాతబస్తీలోని లాల్‌ మసీదు ఎదురుగా ఉన్న సొహైల్‌ ఇంటితో పాటు బిర్లా కాంపౌండ్‌లోని శశికాంత్‌ ప్లాజాలోని మల్లికార్జునగౌడ్‌ ఆఫీస్‌ (సారథి కమ్యూనికేషన్స్‌)లో సోదాలు నిర్వహించారు.

బుకీ ఈడిగ మల్లికార్జున గౌడ్, సహాయ బుకీలు షేక్‌ మహమ్మద్‌ సొహైల్, అశోక్‌కుమార్, బెట్టింగ్‌ రాయుళ్లు రవికుమార్, వెంకటేశ్వర్లు, సనావుల్లా, షేక్‌ ఫయాజ్, అంజాద్‌ అలీ తదితరులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.6.44 లక్షల నగదు, కంప్యూటర్, టీవీ, ల్యాప్‌టాప్, సెటాప్‌ బాక్సు, రెండు ఏటీఎం కార్డులు, రెండు నోట్‌బుక్‌లు, బ్యాంకు పాస్‌ బుక్, 9 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని ఎస్పీ గోపినాథ్‌ జెట్టి ఎదుట హాజరుపరిచారు.

సోమవారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్‌ ఆడిటోరియంలో అడిషనల్‌ ఎస్పీ షేక్షావలి, కర్నూలు డీఎస్పీ ఖాదర్‌బాషాతో కలసి విలేకరుల సమావేశం నిర్వహించి ఎస్పీ వివరాలు వెల్లడించారు. మరో బుకీ మహమ్మద్‌ షొయబ్, బెట్టింగ్‌ రాయుళ్లు లక్ష్మణ్, మజీద్, షేక్‌ ఆసిఫ్‌ తదితరులు పరారీలో ఉన్నారు. మల్లికార్జున గౌడు గతంలో పేకాట దాడుల్లో కూడా పలుమార్లు పట్టుబడ్డాడు.  

ప్రధాన బుకీ ప్రొద్దుటూరు శంకర్‌  
కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన బుకీ శంకర్‌తో కర్నూలుకు సంబంధించిన మల్లికార్జున గౌడ్, మహమ్మద్‌ సొహైల్, అశోక్‌ కుమార్‌లు బెట్టింగ్‌ వ్యవహారాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీసు విచారణలో వెలుగు చూసింది. గత సంవత్సరం కూడా స్వల్ప స్థాయిలో బెట్టింగ్‌ వ్యవహారాన్ని వీరు నిర్వహించారు. ప్రధానంగా గెలుపు, ఓటములపై చిన్న టీమ్, పెద్ద టీమ్‌లుగా బెట్టింగ్‌ నిర్వహిస్తున్నట్లు నిందితులు అంగీకరించారు.  

ఆర్థిక వ్యవహారాలన్నీప్రధాన బ్యాంకుల ద్వారానే...  
ఆర్థిక వ్యవహారాలన్నీ ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, హెడ్‌డీఎఫ్‌సీ వంటి ప్రధాన బ్యాంకుల ద్వారానే బెట్టింగ్‌ కార్యకలాపాలన్నీ సోషల్‌ మీడియా(వాట్సాప్‌)ల ద్వారా లావాదేవీలు జరుగుతున్నట్లు విచారణలో బయటపడింది. ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్‌ల ద్వారా నెట్‌ను ఉపయోగించి బెట్టింగ్‌ కార్య కలాపాలను నిర్వహిస్తున్నారు. నంద్యాల, కోవెలకుంట్ల, ఆదోని ప్రాంతాల్లో కూడా ఇదే తరహాలోని బెట్టింగ్‌ వ్యవహారాలు సాగుతున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు ఎస్పీ వెల్లడించారు. కర్నూలులో జరిగిన బెట్టింగ్‌ వ్యవహారంలో మొత్తం 43 మంది 62 అకౌంట్ల ద్వారా బెట్టింగ్‌ వ్యవహారాన్ని నడిపినట్లు విచారణలో వెలుగు చూసినట్లు వెల్లడించారు.  

పిల్లలపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలి
తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బు సంపాదించాలన్న అత్యాశతో విద్యార్థులు, యువకులు బుకీల వలలో పడి బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారని, తమ పిల్లలపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలని ఎస్పీ సూచించారు. పిల్లలు ఏమి చేస్తున్నారో తల్లిదండ్రులు నిఘా ఉంచుకుని వారిని క్రమపద్ధతిలో పెంచి పోషించుకోవాలని సూచించారు. నిఘా లేకపోతే పిల్లల భవిష్యత్‌ నాశనమవుతుందన్నారు. వన్‌టౌన్‌ సీఐ మురళీధర్‌రెడ్డి, టూటౌన్‌ సీఐ రామకిషోర్, కర్నూలు రూరల్‌ సీఐ పవన్‌ కిషోర్, సీసీఎస్‌ సీఐ లక్ష్మయ్య, మధుసూదన్‌రావు, ఎస్‌ఐలు శ్రీకాంత్‌రెడ్డి, మధుసూదన్, శ్రీనివాసులు, రమేష్, సిబ్బంది బాలరాజు, బాషా తదితరులను ఎస్పీ అభినందించారు.        

కుమారుడు బెట్టింగ్‌కు పాల్పడి అప్పులపాలు చేశాడు
వ్యసనాలకు బానిసై తమ కుమారుడు విజయ భాస్కర్‌రెడ్డి బెట్టింగ్‌లకు పాల్పడుతూ తమ కుటుంబాన్ని అప్పులపాలు చేశాడని నంద్యాల పట్టణానికి చెందిన వృద్ధ దంపతులు రామిరెడ్డి, ఆదిలక్ష్మమ్మ ఎస్పీ గోపినాథ్‌ జెట్టికి మొర పెట్టు కున్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్‌ ఆడిటోరియంలో పోలీసు ప్రజాదర్బార్‌కు వచ్చిన వృద్ధ దంపతులు.. క్రికెట్‌ బెట్టింగ్‌ ఆడు తూ ఆర్థికంగా నష్టపోయిన తన కుమారుడిని నిలదీసినందుకు తమపై దాడి చేశాడని, అతని నుంచి రక్షణ కల్పించాల్సిందిగా ఎస్పీని వేడుకున్నారు.   
–  పోలీస్‌ ప్రజాదర్బార్‌ను ఆశ్రయించిన వృద్ధ దంపతులు  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement