ప్రియాంక కేసులో ఇదే కీలకం | Police Careful With Accused Unti TID Parade Is Completed. | Sakshi
Sakshi News home page

ప్రియాంక కేసులో ఇదే కీలకం

Published Sat, Nov 30 2019 8:52 AM | Last Updated on Sat, Nov 30 2019 8:10 PM

Police Careful With Accused Unti TID Parade Is Completed. - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పశువుల వైద్యురాలు ప్రియాంకరెడ్డి కిడ్నాప్, అత్యాచారం, హత్య కేసులో నిందితులకు శిక్ష పడాలంటే టెస్ట్‌ ఐడెంటిఫికేషన్‌ (టీఐడీ) పరేడ్‌ కీలకంగా మారనుంది. ఎక్కడా సరైన ఆధారాలు దొరక్కుండా నిందితులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. అయినప్పటికీ కొన్ని భౌతిక సాక్ష్యాలు, సీసీ కెమెరాల్లో నమోదైన ఫీడ్‌తో పాటు టీఐడీ పరేడ్‌... వీరు చేసిన నేరాన్ని న్యాయస్థానంలో నిరూపించడానికి ఉపకరించనున్నాయి. డిజిగ్నేటెడ్‌ న్యాయమూర్తి సమక్షంలో ఈ పరేడ్‌ జరుగుతుంది. నిందితులు మృతదేహాన్ని కాల్చడానికి పెట్రోల్‌ కోసం రెండు బంకుల వద్దకు వెళ్లారు. వాటి యజమానులు/వర్కర్లు, ఇతరుల్లో కొందరు వీరిని కచ్చితంగా చూసే ఉంటారు. వీరందరూ కేసులో సాక్షులుగా మారుతారు. న్యాయస్థానంలో వీరందరి సాక్ష్యం కీలకంగా మారనుంది.

కేసును విచారిస్తున్న న్యాయస్థానం న్యాయమూర్తి నియమించే మరో న్యాయయూర్తి (డిజిగ్నేటెడ్‌ జడ్జి) సమక్షంలో ఈ టీఐడీ పరేడ్‌ జైల్లోనే జరుగుతుంది. ఆ రోజు ఈ కేసులోని సాక్షులంతా న్యాయమూర్తి ఎదుట నిందితులను గుర్తించాల్సి ఉంటుంది. నేరానికి సన్నాహాలు జరుగుతున్నప్పుడు తాము చూసింది వీరినేనని వాంగ్మూలం ఇవ్వాలి. నిందితులను దోషులుగా నిరూపించడానికి ఇది ఎంతో కీలకం. ఈ పరేడ్‌ నిర్వహించాల్సి ఉన్న కారణంగానే శుక్రవారం నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టలేదు. వారి ఫొటోలను సైతం ముఖాలపై ముసుగుతోనే చూపించారు. దోపిడీ, బందిపోటు దొంగతనంతో పాటు కొన్ని రకాలైన హత్య, ఉగ్రవాద చర్యల్లోనూ టీఐడీ పరేడ్‌ కీలకంగా మారుతుంది. అందుకే ఈ తరహా కేసుల్లో టీఐడీ పరేడ్‌ పూర్తయ్యే వరకు నిందితుల ఫొటోలు బయటకు రాకుండా పోలీసులు జాగ్రత్త పడతారు.

చదవండి : బిడ్డా.. ఈ అడ్డాలు డేంజర్‌ 

ఇలా చేస్తారు...  
టీఐడీ పరేడ్‌ను ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌లోని సెక్షన్‌ 9ను అనుసరించి చేపడతారు. ఒక్క మాటలో చెప్పాలంటే... న్యాయమూర్తి సమక్షంలో నిందితుడిని సాక్షులు లేదా బాధితులు గుర్తించడమే. సాధారణంగా అత్యాచారం, దోపిడీ, బందిపోటు దొంగతనం, కొన్ని హత్యలు, ఉగ్రవాద చర్యల్లో పోలీసులు టీఐడీ పరేడ్‌ నిర్వహణకు న్యాయస్థానం అనుమతి కోరతారు. కేసును విచారిస్తున్న న్యాయస్థానం న్యాయమూర్తి దీన్ని నిర్వహించరు. అందుకే ఆయన మరో న్యాయమూర్తిని డిజిగ్నేట్‌ చేస్తారు. ఈ పరేడ్‌ను జైలులోనే జరుపుతారు. సాక్షులకు సమన్లు ఇచ్చి పిలిచించడం ద్వారా నిర్వహిస్తారు. రాష్ట్రంలోని జైళ్లలో కేవలం శనివారం మాత్రమే టీఐడీ పరేడ్‌లు జరుగుతున్నాయి. దీనికి ఏర్పాటు చేయాల్సిందిగా ముందుగా జైలు అధికారులకు లేఖ రాయాల్సి ఉంటుంది. టీఐడీ పరేడ్‌లో నిందితుడిని గుర్తించడానికి కొన్ని ప్రమాణాలున్నాయి.

నిందితుడి దేహ దారుఢ్యం, అదే పోలికలు, వయసులో ఉన్న దాదాపు ఆరు నుంచి పది మందిని ఎంపిక చేస్తారు. వీరి మధ్యలో నిందితుడిని ఉంచిన న్యాయమూర్తి సాక్షులను పిలిచి గుర్తించమని కోరతారు. ఇలా నిందితుడి స్థానాన్ని రెండు మూడుసార్లు మార్చి మళ్లీ గుర్తించమంటారు. అయితే టీఐడీ పరేడ్‌ నిర్వహణకు ముందు నిందితుడిని సాక్షి చూడలేదని న్యాయస్థానానికి స్పష్టంగా తెలియజేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కొన్ని కేసుల్లో అరెస్టు చూపించే సందర్భంలో పోలీసులు నిందితుల ముఖానికి ముసుగు వేస్తారు. ఈ తంతు పూర్తయ్యే వరకు అతని ఫొటో బయటకు రాకుండా జాగ్రత్త పడతారు. పరేడ్‌లో పాల్గొనే సాక్షికి ముసుగు వేయడం ద్వారా వారిని నిందితుడు గుర్తించకుండా జాగ్రత్త పడతారు. నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నది పబ్లిక్‌ ఫిగర్, సెలబ్రెటీ అయిన పక్షంలో టీఐడీ పరేడ్‌ చెల్లదు.

చదవండి : శంషాబాద్‌లో మరో ఘోరం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement