
డీఎస్పీకి ఫిర్యాదు చేస్తున్న బాధిత మహిళ, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం నాయకులు (చేతులు కట్టుకున్న ఆమె బాధితురాలు)
అనంతపురం సెంట్రల్: ‘మా సమస్యలోకి తలదూరుస్తావా.. ఏమనుకున్నావ్.. కాల్చి పారేస్తా..’ అంటూ పాయింట్ బ్లాంక్‌లో రివాల్వర్ పెట్టి ఓ కానిస్టేబుల్ బెదిరించిన ఘటన నగరంలో చోటు చేసుకుంది. ఘటనపై బాధితురాలు వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల కథనం మేరకు... వైఎస్సార్ జిల్లా ఎమ్మెల్సీ బీటెక్ రవి సోదరుడు భరత్‌రెడ్డికి గన్‌మన్‌గా పనిచేస్తున్న కానిస్టేబుల్ రాజారెడ్డి అనంతపురంలోని హమాలీకాలనీలో వివాహం చేసుకున్నాడు. కొన్ని నెలలుగా భార్య సుహాసినితో రాజారెడ్డికి మనస్పర్థలు వచ్చాయి. ఈ సమయంలో పెద్దమనుషుల పంచాయితీలు జరిగాయి. స్థానికంగా ఉంటున్న వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం నాయకురాలు లక్ష్మిదేవి భార్యాభర్తలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. దీన్ని మనసులో పెట్టుకున్న గన్‌మన్ రాజారెడ్డి బుధవారం భార్య ఇంటిపై దాడి చేసేందుకు వచ్చాడు. ఆ సమయంలో ఇంటిపక్కనే ఉన్న లక్ష్మిదేవి కనిపించడంతో ఒక్కసారిగా కోపోద్రిక్తుడైన గన్‌మన్ ఏకంగా ఆమె తలకు రివాల్వర్‌పెట్టి బెదిరించాడు. దీంతో ఇంట్లోకి పరుగుతీసిన లక్ష్మిదేవి తలుపు వేసుకుంది. అయినప్పటికీ విడిచిపెట్టక బలవంతంగా తలుపు తీసి ఆమెను చంపేందుకు యత్నించాడు. గట్టిగా కేకలు వేయడంతో కాలనీ ప్రజలు గుమికూడడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. రాజారెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని బాధితురాలు లక్ష్మిదేవి పోలీసులను కోరారు.
ఖండించిన మహిళా విభాగం నాయకులు
ఓ మహిళను పాయింట్‌బ్లాంక్ రేంజ్‌లో రివాల్వర్ పెట్టి కానిస్టేబుల్ బెదిరించడం దారుణమని, వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీదేవి డిమాండ్ చేశారు. బాధితురాలితో కలిసి వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌లో డీఎస్పీ వీరరాఘవరెడ్డి, సీఐ ప్రతాప్‌రెడ్డిలను కలిసి ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment