నిందితులు హత్యకు ఉపయోగించిన కోడి కత్తులు, ఉపయోగించిన సెల్‌ఫోన్లు
ప్రకాశం, చీరాల రూరల్: హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ వై జయరామ సుబ్బారెడ్డి తెలిపారు. స్థానిక కొత్తపేటలోని రూరల్ సర్కిల్ కార్యాలయంలో సీఐ టి. వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు. చీరాల పట్టణంలోని హారిస్‌పేటకు చెందిన నల్లగొండ్ల నయోమి, చిరంజీవి దంపతులకు ఇద్దరు సంతానం. వారిలో మొదటి కుమారుడు దినేష్ (19) స్థానికంగా రైల్వేస్టేషన్ వద్ద ఉన్న పెట్రోలు బంకులో పనిచేస్తుంటాడు. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా వెదుళ్లపల్లి గ్రామానికి చెందిన కంపా సంధ్య అనే యువతి దినేష్ ఇంటి సమీపంలోని ఓ చర్చికి ప్రతి ఆదివారం వచ్చేది. ఈ క్రమంలో సంధ్య, దినేష్‌లకు పరిచయం ఏర్పడి..ఆ పరిచయం ప్రేమగా మారింది. విషయం సంధ్య ఇంట్లో తెలియడంతో ఆమె కుటుంబ సభ్యులు దినేష్‌ను పలుమార్లు హెచ్చరించారు. అయితే దినేష్‌లో మార్పు రాకపోవడంతో వారు సంధ్యను చీరాలలో కాలేజీ మాన్పించి బాపట్లలో చేర్పించారు. అయినప్పటికీ దినేష్ బాపట్లలోని ఆమె చదివే కాలేజీకి వెళ్లి ఆమెతో మాట్లాడేవాడు. ఈ విషయం సంధ్య తల్లికి తెలిసి అవమానానికి గురై రెండుసార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో దినేష్ ప్రవర్తనపై విసుగు చెందిన సంధ్య అన్నయ్య వంశీ, ఆమె తండ్రి రాజేష్‌లు దినేష్‌పై కక్ష పెంచుకున్నారు. ఏ విధంగానైనా దినేష్‌ను అంతమొందించాలని పథకం సిద్ధం చేసుకున్నారు.
పావని అనే యువతిని పావుగా వాడి...
దినేష్‌ను చంపేయాలని నిర్ణయించుకున్నరాజేష్, వంశీలు పక్కా ప్రణాళిక రూపొందించారు. వంశీ ప్రేయసి అయిన పావని అనే యువతి ద్వారా దినేష్‌ను ట్రాప్‌లోకి దించారు. వెదుళ్లపల్లికి వస్తే చంపేయాలనే నిర్ణయానికి వచ్చిన వారు అనేక సార్లు పావని, సంధ్యతో దినేష్‌కు ఫోన్లు చేయించారు. అయితే దినేష్ లాక్‌డౌన్ కారణంగా వారి వద్దకు వెళ్లలేకపోయాడు. పావని ఫోన్ చేసిన సమయంలో తన ఫోన్ పోయిందని దినేష్ ఆమెకు చెప్పడంతో తన వద్ద కొత్త ఫోన్ ఉందని వెదుళ్లపల్లికి వస్తే ఫోన్ ఇస్తానని మభ్యపెట్టింది. దీంతో దినేష్ తన స్నేహితునితో కలిసి బైక్‌పై వెదుళ్లపల్లి బయలుదేరాడు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం సంధ్య తండ్రి రాజేష్ తన కుమారుడైన వంశీకి కోడి పందేలకు ఉపయోగించే కత్తులను ఇచ్చి పంపించాడు. వంశీ తన స్నేహితుడైన వెదుళ్లపల్లికి చెందిన బొజ్జగాని దుర్గారావు, అదే ప్రాంతానికి చెందిన మరో మైనర్ బాలుడితో కలిసి దినేష్‌ను హత్య చేసేందుకు కాపు కాశారు.
దినేష్ స్నేహితునితో కలసి వెదుళ్లపల్లి వెళుతుండగా తోటవారిపాలెం బైపాస్ రోడ్డుకు సమీపంలోని కృపానగర్ వద్ద వంశీ అతని స్నేహితులు దినేష్ వాహనాన్ని అడ్డగించారు. దినేష్ వారి నుంచి తప్పించుకొని పరుగులు తీయగా..వారు వెంబడించి కత్తులతో గొంతు కిందభాగంలో బలంగా పొడిచారు. దీంతో తీవ్ర రక్త స్రావానికి గురైన దినేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసిన డీఎస్పీ జయరామ సుబ్బారెడ్డి.. రూరల్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై వి. సుధాకర్‌కు దర్యాప్తు బాధ్యతలు అప్పగించారు. కేసును దర్యాప్తు చేపట్టిన వారు అందిన సమాచారం మేరకు నిందితులు ఆటోనగర్ బైపాస్ రోడ్డువద్ద ఉన్న కుందేరు బ్రిడ్జిపై ఉన్నారనే విషయం తెలుసుకుని నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వారితో పాటు హత్యకు ఉపయోగించిన రెండు కోడి కత్తులు, రెండు సెల్‌ఫోన్లు, ఒక ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న సంధ్య, ఆమె తండ్రి రాజేష్‌లు పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలో పట్టుకుంటామని డీఎస్పీ చెప్పారు. కేసును వేగవంతంగా ఛేదించి నిందితులను అరెస్టు చేసిన సీఐ టి. వెంకటేశ్వర్లు, ఎస్సై వి. సుధాకర్, హెడ్ కానిస్టేబుళ్లు ఎస్. వెంకయ్య, పి. హేమ చంద్రుడు, కానిస్టేబుళ్లు భాస్కర్, విజయ కృష్ణ, ఉమెన్ పీసీలు అనిత, షహనాజ్, హోంగార్డులు సతీష్, ప్రభావతిలను డీఎస్పీ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment