
తుమకూరు: వైద్యో నారాయణో హరి అన్నారు. అంటే వైద్యులు భగవంతునితో సమానమని కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న రోగికైనా ప్రాణం పోయడానికి శతథా ప్రయత్నిస్తారని విశ్వసిస్తాం. కానీ కొందరు వైద్యుల నిర్వాకాల వల్ల ఆస్పత్రులంటేనే దడ పుడుతుంది. ఇక్కడ ఒక ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్ల గర్భిణికి ఎయిడ్స్ జబ్బు ఉందని తప్పుడు నిర్ధరణతో ఆమె జీవితం అతలాకుతలమైంది. కడుపులో ఉన్న బిడ్డను కోల్పోవడంతో పాటు తీవ్ర మనోవేదనతో మంచం పట్టింది.
ఏం జరిగిందంటే...
2015, డిసెంబర్‌లో... తుమకూరు జిల్లాలోని శిర పట్టణంలో ఉన్న ప్రభుత్వాస్పత్రికి స్థానిక గర్భిణి మహిళ ఒకరు సాధారణ వైద్య పరీక్షల కోసం వెళ్లారు. వైద్యులు ఆమెకు వైద్య పరీక్షలతో పాటు హెచ్‌ఐవీ టెస్ట్ కూడా చేయించారు. ‘ఆ పరీక్షలో పాజిటివ్ అని వచ్చింది. నీకు హెచ్‌ఐవి ఉంది’ అని వైద్యులు చెప్పడంతో బాధితురాలు షాక్‌కు గురైంది. రోజుల తరబడి తిండితిప్పలు లేక, కుటుంబ సభ్యుల అనుమానపు చూపులతో తీవ్రంగా విలపించింది. ఆ బాధతో అబార్షన్ అయ్యింది. గడిచిన రెండు సంవత్సరాల నుంచి వైద్యులు రాసిచ్చిన మందులు వాడుతూ ఉంది.
నిగ్గుతేల్చిన ప్రైవేటు ఆస్పత్రి
ఇటీవలే ఆమె మళ్లీ గర్భవతి కావడంతో తుమకూరులో ఉన్న ఓ ప్రవేట్ ఆస్పత్రికి వెళ్ళి వైద్య పరీక్షలు చేయించుకుంది. వైద్యులు ఆమెకు ఎలాంటి వ్యాధీ లేదని, ఆరోగ్యం భేషుగ్గా ఉందని చెప్పడంతో నమ్మలేకపోయిన మహిళ సుమారు నాలుగైదు ప్రవేట్ ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు చేయించుకుంది. ఎక్కడా హెచ్‌ఐవీ/ ఎయిడ్స్ అని నిర్ధరణ కాలేదు. కనీసం ఆ లక్షణాలు ఉన్నట్లు కూడా పేర్కొనలేదు. దాంతో తుమకూరు జిల్లా ఆస్పత్రికి వెళ్ళి అక్కడ పరీక్షలు చేయించుకోగా వారూ అదే తేల్చిచెప్పారు. అక్కడి వైద్యులు సైతం హెచ్‌ఐవీ ఏమీ లేదని తెలిపారు.
న్యాయ పోరాటం చేస్తా: బాధితురాలు
అప్పటికి బాధితురాలు ఊపిరిపీల్చుకుంది. అయితే రెండేళ్ల నుంచి అనుభవిస్తున్న మనోవేదనకు కారణమైన శిరా పట్టణ ప్రభుత్వాస్పత్రి వైద్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. కడుపుకోతతో పాటు రెండు సంవత్సరాల పాటు నరక యాతన అనువించానని తెలిపింది. ఈ వైద్యులు నాకు అన్యాయం చేశారని, ఈ విషయం పైన తాను న్యాయ పోరాటం చేస్తానని చెప్పింది.