మూసీనది ఒడ్డున వివరాలు సేకరిస్తున్న డీసీపీ పద్మజారెడ్డి, పోలీసు సిబ్బంది
అత్తాపూర్ : ప్రియుడితో కలిసి భర్తను చంపిన ఓ మహిళను పోలీసులు కటకటాల వెనక్కి పంపించారు. రాజేంద్రనగర్ ఠాణాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శంషాబాద్ డీసీపీ పద్మజారెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. వికారాబాద్ జిల్లా బొంరాస్‌పేట్ మండలానికి చెందిన ఆనంద్, మహేశ్వరి దంపతులు కొన్నేళ్ల క్రితం రాజేంద్రనగర్ పరిధిలోని శివరాంపల్లికి వలస వచ్చారు. ఆనంద్ హోటల్‌లో వంట పని చేస్తుండగా మహేశ్వరి ఓ షాపింగ్‌మాల్‌లో పనిచేస్తుండేది.
కొన్ని నెలల క్రితం తను పనిచేస్తున్న మాల్‌లో మహేశ్వరి అస్వస్థతకు గురైంది. ఆ సమయంలో తోటి సిబ్బంది ఆటోను పిలిచి ఆమెను ఆస్పత్రికి తరలించారు. సదరు ఆటో డ్రైవర్ సంజూ మహేశ్వరికి సపర్యలు చేసి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నాడు. ఈనేపథ్యంలో వారికి పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. మహేశ్వరిని భర్త ఆనంద్ నిత్యం తాగి వచ్చి కొడుతుండగా.. సంజూ బాగా చూసుకునేవాడు.
ఈనేపథ్యంలో ఇద్దరూ కలిసి ఆనంద్‌ను చంపేయాలని పథకం వేశారు. మహేశ్వరి మే 7న ఇంట్లో భర్త ఆనంద్ పీకలదాకా తాగేలా చేసింది. మత్తులో ఉన్న అతడిని ఆమె తన ప్రియుడు సంజూతో కలిసి ఓ ప్లాస్టిక్ వైర్‌తో ఉరి బిగించి చంపేసింది. అనంతరం ఆటోలో మృతదేహాన్ని గండిపేట మండల పరిధిలోని గంధంగూడ సమీపంలో ఉన్న మూసి నది ఒడ్డుకు తీసుకువెళ్లారు. అక్కడ పెట్రోల్ పోసి మృతేహాన్ని కాల్చేశారు.
మరుసటి రోజు అస్తికలను మూసినదిలో పడేశారు. అనంతరం పది రోజుల పాటు ఏమీ తెలియనట్లు ఉన్న మహేశ్వరి మే 20న తన భర్త కనిపించడం లేదని రాజేంద్రనగర్ పోలీసులకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆనంద్ కుటుంబీకుల వివరాల ద్వారా పోలీసులు మహేశ్వరితోపాటు సంజూను అదుపులోకి తీసుకొని విచారించగా చేసిన నేరం అంగీకరించారు.
దీంతో బుధవారం వారిద్దరిని రిమాండ్‌కు తరలించారు. డీసీపీ పద్మజారెడ్డి బుధవారం ఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. సమావేశంలో రాజేంద్రనగర్ ఏసీపీ ఆశోక్, ఇన్‌స్పెక్టర్ సురేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment