అహ్మదాబాద్ : గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం ముమ్మరంగా జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ ఓ లఘు చిత్రం వివాదాస్పదంగా మారింది. మీ ఓటు.. మీ భద్రత పేరిట విడుదలైన ఆ వీడియో ముస్లింల మనోభావాలు దెబ్బతీసేలా ఉందంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది.
ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే... ఓ అమ్మాయి రాత్రి 7 గంటల సమయంలో ఒంటరిగా ఇంటికి వెళ్తూ కనిపిస్తుంది. ఇంతలో అజాన్(మసీదు నుంచి వచ్చే ప్రార్థన గీతం) మొదలవ్వగానే యువతి భయం భయంగా ముందుకు వెళ్తుంది. ఇంట్లో ఆమె కోసం తల్లిదండ్రులు కంగారుపడుతూ కనిపిస్తారు. చివరకు ఆమె ఇంటికి చేరటంతో అంతా ఊపిరి పీల్చుకుంటారు. ‘‘ఇదసలు గుజరాతేనా? అని తల్లి అంటే.. ఇది 22 ఏళ్ల క్రితం గుజరాత్. మళ్లీ వాళ్లు అధికారంలోకి వస్తే ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయి అని తండ్రి చెబుతాడు. చివరకు కూతురు.. కంగారు పడాల్సిన పనిలేదు. ఇక్కడ మోదీ ఉండగా ఎవరూ రారు. భయపడాల్సిన అవసరం లేదు... అంటూ వీడియో ముగుస్తుంది.
75 సెకన్లు ఉన్న ఈ వీడియో బీజేపీకి అనుకూలంగా ఉన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పైగా 22 ఏళ్ల క్రితం కాంగ్రెస్ అక్కడ అధికారంలో ఉన్న విషయం విదితమే. అయితే ఈ వీడియోలో అజాన్ వినిపించటం.. ఖచ్ఛితంగా ముస్లింల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని.. తక్షణం దానిని నిషేధించాల్సిన అవసరం ఉందని గోవింద్ పర్మర్ అనే వ్యక్తి పోల్ ప్యానెల్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి బీబీ స్వెయిన్, అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ సెల్‌ను విచారణకు ఆదేశించారు. అయితే వీడియో ఎక్కడి నుంచి వచ్చిందో అన్వేషించే బదులు.. అందులో నటించిన నటులను విచారిస్తే ఈ వీడియో వెనక ఉంది ఎవరో తెలిసిపోతుందని గోవింద్ పోలీసులకు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment