కడప రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫాం తరలించేందుకు సిద్ధ్దంగా ఉంచిన రేషన్ బియ్యం బస్తాలు
సాక్షి కడప : ప్రభుత్వం పేదలకు అందించే నిత్యావసరాల్లో ఒకటైన రేషన్ బియ్యం అక్రమార్కుల పాలవుతున్నాయి. అనంతపురం జిల్లాకు చెందిన కొందరితోపాటు జిల్లాకు చెందిన చాలామంది రేషన్ బియ్యం వ్యాపారానికి తెర తీశారు. ప్రతినెల 15 నుంచి 25వ తేదీ వరకు వీధుల్లో తిరుగుతూ బియ్యం కొనుగోలు చేస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రేషన్‌కు సంబంధించి బియ్యం ప్రతినిత్యం సరిహద్దులు దాటుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం..అధికారులు చూసీచూడనట్లు వదిలి వేయడంతో గుట్టుచప్పుడు కాకుండా వ్యవహారం సాగుతోంది. నిఘా ఉంచి అక్రమార్కులను పట్టుకుంటే ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
మైదుకూరు ప్రాంతం నుంచే అధికంగా
జిల్లాలోని మైదుకూరు ప్రాంతం నుంచి గుంతకల్లు, గుత్తి, అనంతపురం, కడప తదితర ప్రాం తాలకు చెందిన వ్యాపారులు అధికంగా కొనుగోలు చేసి సరిహద్దులు దాటిస్తున్నారు. సరుకును ఎక్కువగా అనంతపురం జిల్లా నుంచి బెంగళూరుకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ గోడౌన్లు, హోటళ్లకు సరఫరా అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే బెంగళూరులో అధిక ధరకు అమ్ముకుంటూ ఏలాగోలాగా సొమ్ము చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. మైదుకూరుతో పాటు పులివెం దుల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, బద్వేలు, కడపల నుంచి కూడా సరుకు వెళుతుండగా,జిల్లాలోని మిగతా ప్రాంతాల నుంచి కూడా ఎక్కడికక్కడ వ్యాపారులకు అందిస్తే రాత్రికి రాత్రే సరుకు రవాణా సాగుతోంది. పైగా ఏదో ఒక ప్రాంతంలో రేషన్ బియ్యం పట్టుకుంటూ కేసులు కూడా నమోదవుతున్న ఘటనలు కనిపిస్తూనే ఉన్నాయి.
రైలులో రవాణా
గతంలో ప్రత్యేక వాహనాల ద్వారా కదిరి, బెంగళూరు తదితర ప్రాంతాలకు రేషన్ బియ్యాన్ని తరలించేవారు. ఈ నేపథ్యంలో అక్రమార్కులు కూడా సరుకు రవాణాకు వాహనాన్ని సమకూర్చుకుని వచ్చేవారు. అయితే తనిఖీలు జరుగుతుండడంతో తర్వాత బస్సులు, ఆటోలు, జీపుల్లో ఎవరికీ అనుమానం రాకుండా తరలించేవారు. అయితే ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందన్న ఆలోచనతో రైలులో అయితే ఇబ్బందులు ఉండవని భావించి రవాణాకు మార్గాన్ని ఎంచుకున్నారు. ఎక్కువగా ఇంటర్‌సిటీ రైలులో కడప నుంచి గుంతకల్లు, గుత్తి, బళ్లారి, హుబ్లీ తదితర ప్రాంతాలకు తీసుకెళుతున్నారు. ఇంటర్‌సిటీ అయితే ప్రతి బాక్సు ఖాళీగా ఉంటుంది కాబట్టి సీట్ల కింద మూటలు వేసి అక్రమార్కులు లాగిస్తున్నారు. అందులోనూ ఒకరిద్దరు కాకుండా బృందాలుగా ఉంటూ పెద్ద ఎత్తున రేషన్‌బియ్యాన్ని తరలిస్తున్నారు. వీరు కొంతమంది టీటీఈలు, రైల్వే పోలీసులకు సమాచారం తెలిసినా అమ్యామ్యాల ద్వారా చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. వాళ్లతో పరిచయాలు కూడా ఉండడంతో రావడం, తృణమో, ఫణమో పుచ్చుకోవడం, ఏమి తెలియనట్లు వెళ్లిపోతుండడం కనిపిస్తోంది. ఏది ఏమైనా అక్రమ రవాణా పెద్ద ఎత్తున సాగుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. రెవెన్యూతోపాటు పౌరసరఫరాలశాఖ, పోలీసు అధికారులు ఈ విషయంగా ప్రత్యేక దృష్టి సారిస్తే అక్రమార్కుల వ్యవహారం బట్టబయలయ్యే అవకాశం లేకపోలేదు.
కిలో రూ. 10తో కొనుగోలు
జిల్లాలో ఎక్కడ చూసినా రేషన్‌షాపుల్లో తెచ్చుకున్న బియ్యాన్ని కిలో రూ. 10తో వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. డీలర్‌షాపుల వద్ద కార్డుదారులు కిలో రూపాయితో కొనుగోలు చేసి రూ. 10కు అమ్ముకుంటున్నారు. ఒకచోట కాదు..జిల్లా వ్యాప్తంగా చాలాచోట్ల ఈ కొనుగోలు వ్యవహారం జోరుగా సాగుతోంది. రేషన్‌షాపుల్లో ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు సరుకుల పంపిణీ సాగుతోంది. తర్వాత పది రోజుల వ్యవధిలో ఆ బియ్యాన్ని కొనుగోలు చేస్తూ సరిహద్దులు దాటిస్తున్నారు.అందులోనూ కొంతమంది డీలర్లు కూడా అధికారులతో కుమ్మక్కై ఎన్నో కొన్ని వినియోగదారుల నుంచి తూకంలో తగ్గించుకుని మిగుల్చుకున్నయో లేక తమ చేతివాటాన్ని ప్రదర్శించి దక్కిన బియ్యాన్ని అమ్మి సొమ్ము చేసుకుంటుండగా... మరికొంతమంది రేషన్‌కార్డుదారుల నుంచి కూడా కొనుగోలు చేసి విక్రయాలు సాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment