రవిప్రకాశ్‌ శివాజీ కుట్ర బట్టబయలు | Ravi prakash and sivaji share-purchase agreement Conspiracy Revealed | Sakshi
Sakshi News home page

రవిప్రకాశ్‌ శివాజీ కుట్ర బట్టబయలు

Published Thu, May 16 2019 10:57 AM | Last Updated on Thu, May 16 2019 11:17 AM

Ravi prakash and sivaji share-purchase agreement Conspiracy Revealed - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌, సినీ నటుడు గరుడ పురాణం శివాజీల మధ్య జరిగిన కుట్ర బట్టబయలైంది. ప్రస్తుతం పరారీలో ఉన్న రవిప్రకాశ్‌ ఈ మెయిల్స్‌ను పోలీసులు తనిఖీలు చేయగా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇందుకు సంబంధించిన ఈ మెయిల్స్‌ బయటపడ్డాయి. టీవీ9 మాతృసంస్థ అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (ఏబీసీఎల్‌) కొత్త యాజమాన్యానికి ఇబ్బందులు సృష్టించే ఉద్దేశంతో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)ని అడ్డుపెట్టుకుని పావులు కదిపారని తేటతెల్లమయ్యింది. రవిప్రకాశ్‌, శివాజీ మధ్య కుదిరింది పాత ఒప్పందం కాదని, ఎన్‌సీఎల్‌టీలో కేసు వేయడం కోసం కుట్ర చేసి, పాత తేదీతో నకిలీ షేర్లు కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు పక్కా సాక్ష్యాధారాలు లభించినట్లు తెలిసింది. ఈ కేసు మరో కొత్త మలుపు తిరగడంతో పాటు రవిప్రకాశ్ చుట్టూ మరింత ఉచ్చు బిగుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

చదవండి: (బెజవాడలో రవిప్రకాశ్‌, శివాజీ!)

కుట్రకు సంబంధించిన పలువురు వక్తుల మధ్య బదిలీ అయిన పలు ఈ మెయిల్స్‌ను సైబర్ క్రైమ్ పోలీసు  స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆధారాలు దొరకకుండా సర్వర్‌ల నుంచి రవిప్రకాశ్, ఆయన అనుచరులు డిలీట్ చేసినప్పటికీ, సైబర్ క్రైమ్ పోలీసులు అత్యాధునిక పరిజ్ఞానం ఉపయోగించి వీటిని వెలికి తీశారు. రవిప్రకాశ్ నుంచి 40 వేల షేర్లను కొనుగోలు చేసేందుకు శివాజీ ఫిబ్రవరి 20, 2018న  ఒప్పందం కుదుర్చుకున్నట్లు సృష్టించిన ఒప్పందపు డ్రాఫ్ట్‌... వాస్తవానికి ఏప్రిల్‌13, 2019న తయారు చేశారు. ఈ డ్రాఫ్ట్‌ను ఆ రోజు సాయంత్రం 5:46 గంటలకు టీవీ9 మాజీ సీఎఫ్‌వో మూర్తికి రవిప్రకాశ్‌ సన్నిహితుడు, న్యాయవాది శక్తి మెయిల్‌ చేశారు. ఈ మెయిల్‌ను  రవిప్రకాశ్, ఎంవీకేఎన్‌ మూర్తి, రవిప్రకాశ్‌ సన్నిహితుడు హరిలకూ కాపీలు పంపించారు. ఫిబ్రవరి 20, 2018న  కుదుర్చుకున్నట్లు పాత తేదీతో చేసుకోబోయే ఒప్పందం వివరాలు ఇందులో ఉన్నాయి. ఆ తర్వాత సాయంత్రం 6:45 గంటల నుంచి రాత్రి 9:39 గంటల మధ్య వీరందరి మధ్య మెయిల్స్ సర్క్యులేట్ అయినట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. 

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
 

ఇక శివాజీ ఎన్‌సీఎల్‌టీలో దాఖలు చేయడానికి అవసరమైన పిటిషన్‌ను విజయవాడకు చెందిన  ఓ అడ్వకేట్ రూపొందించారు. ఆ మరుసటి రోజున అంటే, ఏప్రిల్‌14, 2019న ఉదయం 5:38 గంటలకు ఆ పిటిషన్ కాపీని, అందులో చేయాల్సిన మార్పులను ఈ మెయిల్‌లో ప్రస్తావించడంతో పాటు, తగిన మార్పులు చేర్పులతో ఉదయం తొమ్మిది గంటల కల్లా, విజయవాడ అడ్వకేట్‌కు పంపించాల్సి ఉంటుందంటూ శక్తి ... రవిప్రకాశ్‌, ఆయన అనుచరులకు మెయిల్ పంపించారు. అదే రోజు ఈ పిటిషన్‌పై రవిప్రకాశ్ ఆయన అనుచరులు మెయిల్‌లో సంప్రదింపులు జరిపినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. వీటి ఆధారంగానే సెక్షన్ 41 సీఆర్పీసీ కింద పోలీసులు రవిప్రకాశ్‌కు నోటీసులు జారీ చేశారు. ఈ సెక్షన్ కింద అరెస్టయ్యే ప్రమాదాన్ని తప్పించుకోవడం కోసం.. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో రవిప్రకాశ్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను కూడా న్యాయస్థానం తిరస్కరించింది. ఈ వ్యవహారం అంతా బట్టబయలు కావడంతో, ఎన్‌సీఎల్‌టీలో జరగబోయే విచారణ మీదే ఇప్పుడు ఆసక్తి నెలకొని ఉంది. మరోవైపు రవిప్రకాశ్‌ సన్నిహితుడు, న్యాయవాది శక్తి కూడా అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement