పోలీసు స్టేషన్‌లో ఉన్న వాహనం
జమ్మలమడుగు: ఎర్రచందనం దుంగలను తరలిస్తూ రోడ్డు ప్రమాదానికి గురైన వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. అయితే ఆ వాహనం ఎవరిది.. అందులో ప్రయాణిస్తున్న వారు ఎవ్వరు అనే విషయం ఇంతవరకు తేలలేదు. స్థానిక తాడిపత్రి బైపాస్ రోడ్డులో రెండు నెలల క్రితం ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న వాహనం పంక్చర్ కావడంతో ప్రమాదానికి గురైంది. అందులో ఉన్న వారు గాయపడినట్లు అక్కడున్న రక్తపు మరకలను బట్టి స్పష్టమైంది. పోలీసులొస్తే దొరికిపోతామనే భయంతో వారు ఎలాగోలా తప్పుకున్నారు.
కానీ అందులో ఉన్న ఎర్రచందనం దుంగలను అలాగే వదిలేసి వెళ్లారు. ఆ తర్వాత కొందరు వ్యక్తులు ఓ వాహనంలో వచ్చి తాము ఫారెస్టు అధికారులమంటూ దర్జాగా అందులో ఉన్న దుంగలను వారి వాహనంలో వేసుకుని ఉడాయించారు. అయితే అందులో ఉన్న ఓ మొబైల్ ఫోన్‌ను అక్కడే వదిలేసి వెళ్లడంతో దాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని వాహనాన్ని పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఆ ఫోన్‌లో ఉన్న నెంబర్లను పరిశీలించిన పోలీసులు అవి కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తులవిగా గుర్తించినట్లు సమాచారం. ఆ నెంబర్ల ఆధారంగా ఇంతవరకు నిందితులను పట్టుకోలేకపోవడం చర్చనీయాంశంగా మారింది. కడప, కోడూరు, బద్వేలు, మైదుకూరు తదితర ప్రాంతాల్లో పోలీసు నిఘా పెరగడంతో స్మగ్లర్లు రూటు మార్చి జమ్మలమడుగు మీదుగా ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులు తమ అదుపులో ఉన్న వాహనం, ఫోన్ నెంబర్ల ఆధారంగా సూత్రధారులను గుర్తించి ఎర్రచందనం అక్రమాలకు కళ్లెం వేయాలని పలువురు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment