
సాక్షి, భోపాల్ : మధ్యప్రదేశ్‌లో సోమవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తోన్న ఓ బస్సు, ట్రక్కు ఢీకొట్టడంతో 10 మంది మృతిచెందగా.. 47 మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రయాణికులతో బాందా నుంచి అహ్మదాబాద్ వెలుతున్న ఓ ప్రైవేట్ బస్సు ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటన సోమవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో మధ్యప్రదేశ్‌లోని గుణా జిల్లాకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న రుతియాయ్ పట్టణ పరిధిలో చోటుచేసుకుంది. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఓ చిన్నారితో సహా 10 మంది మరణించారు. ఏడు మంది అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో ముగ్గురు చికిత్స పొందుతూ మృతిచెందినట్లు సమాచారం. మరో 47 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment