వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం | Road Accounts In Mahabubnagar | Sakshi
Sakshi News home page

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం

Published Thu, Oct 25 2018 12:12 PM | Last Updated on Thu, Oct 25 2018 12:12 PM

Road Accounts In Mahabubnagar - Sakshi

కొండారెడ్డి మృతదేహం, చికిత్స పొందుతున్న సత్యం

భూత్పూర్‌ (దేవరకద్ర): వారాంతపు సంతలో కూరగాయలు విక్రయించి ద్విచక్రవాహనంపై ఇంటికి వస్తున్న ఓ రైతును వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ సంఘటన మండలంలోని అన్నాసాగర్‌ సమీపంలోని జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. హెడ్‌కానిస్టేబుల్‌ సుదర్శన్‌ కథనం ప్రకారం.. అన్నాసాగర్‌ గ్రామానికి చెందిన సూదిరెడ్డి కొండారెడ్డి(50) వ్యవసాయంతోపాటు కూరగాయలు పండిస్తూ జీవనం సాగిస్తున్నాడు.

ఈ క్రమంలో మంగళవారం మూసాపేటలో జరిగే వారాంతపు సంతకు ద్విచక్రవాహనంపై కూరగాయలు తీసుకువెళ్లి విక్రయించిన అనంతరం ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో అన్నాసాగర్‌ సమీపంలోని పెట్రోల్‌ బంక్‌లో పెట్రోల్‌ పోసుకుని అన్నాసాగర్‌ వైపు వస్తుండగా హైదరాబాద్‌ నుంచి కర్నూలు వైపు వెళ్తున్న కారు వేగంగా ఢీకొంది. దీంతో కొండారెడ్డికి తీవ్రగాయాలు కాగా 108లో ఎస్పీఎస్‌ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అదే రాత్రి హైదరాబాద్‌కు తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. కొండారెడ్డి భార్య హారిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్‌ తెలిపారు.

గుర్తుతెలియని వాహనం ఢీకొని.. 
గండేడ్‌ (మహబూబ్‌నగర్‌): పొలం నుంచి ఇంటికి వస్తున్న ఓ రైతును గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో చికిత్స పొందుతూ మృతిచెందాడు. సంఘటనకు సంబంధించి పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా.. మండలంలోని కొమిరెడ్డిపల్లికి చెందిన రైతు తెలుగు శ్రీను(35) మంగళవారం రాత్రి సమయంలో తన సొంత పొలానికి వెళ్లి.. తిరిగి రోడ్డుపై నడుచుకుంటూ వస్తుండగా వెనక నుంచి వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో రెండు కాళ్లు విరిగి తీవ్ర గాయాలపాలయ్యాడు. సకాలంలో ఎవరూ గుర్తించలేకపోయారు.

బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అటువైపు నుంచి వాహనంపై వెళ్తున్న ఓ యువకుడు గమనించి స్థానికులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని మహబూబ్‌నగర్‌ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ఉస్మానియాకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. శ్రీను భార్య సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రవీందర్‌ తెలిపారు. 

క్రూయిజర్, బైక్‌ ఢీ.. 
తాడూరు (నాగర్‌కర్నూల్‌): క్రూయిజర్, ద్విచక్రవాహనం ఢీకొనడంతో ఇరువురికి గాయాలైన సంఘటన మండలంలోని ఇంద్రకల్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మిడ్జిల్‌ మండలం బోయిన్‌పల్లి గ్రామానికి చెందిన శ్రీను, సత్యం ఇరువురు ద్విచక్రవాహనంపై యాదిరెడ్డిపల్లి నుంచి ఇంద్రకల్‌కు వస్తుండగా ఇంద్రకల్‌లో ప్రధాన రోడ్డుపై ఎదురుగా వచ్చిన క్రూయిజర్‌ ఢీకొనడంతో ఇరువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని గ్రామస్తుల సహకారంతో జిల్లా ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement