ఆవిరైన ఆశలు..! | Wife And Husband Died In Road Accident Mahabubnagar | Sakshi
Sakshi News home page

ఆవిరైన ఆశలు..!

Published Fri, Feb 8 2019 7:43 AM | Last Updated on Fri, Feb 8 2019 7:43 AM

Wife And Husband Died In Road Accident Mahabubnagar - Sakshi

 సుజాత మృతదేహం   సంఘటన స్థలంలో రవి.. (చికిత్స పొందుతూ మృతి )

జడ్చర్ల: సొంత ఊరును.. కన్న వారిని చూసేందుకు గంపెడాశతో వస్తున్న ఆ దంపతులను రోడ్డు ప్రమాదం అమాంతం మింగేయగా.. కుమారుడు, మరో మహిళ తీవ్రంగా గాయపడ్డారు. మరికొద్దిసేపట్లో తమ కుమారుడు, కోడలు వస్తారని ఇంటి దగ్గర ఆశగా ఎదురుచూస్తున్న వారికి నిరాశే మిగిలింది. ఈ హృదయ విదారక సంఘటన జడ్చర్ల సమీపంలోని జాతీయ రహదారిపై గురువారం చోటు చేసుకుంది. సీఐ బాలరాజుయాదవ్‌ కథనం ప్రకారం.. హన్వాడ మండలం వెంకటమ్మకుంట తండాకు చెందిన కేతావత్‌ రవి(30), అతని భార్య సుజాత(26)లు కొంతకాలంగా హైదరాబాద్‌లో మేస్త్రీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

ఈ క్రమంలో వీరు గురువారం హైదరాబాద్‌ నుంచి సొంతూరులో తల్లిదండ్రులను చూసేందుకు ఓ ప్రైవేట్‌ ఓమినీ వాహనంలో వెంకటమ్మకుంటతండాకు బయలుదేరారు. మరికొద్దిసేపట్లో్ల స్వగ్రామానికి చేరుకుంటామనగా.. జడ్చర్ల సమీపంలో మునవర్‌ దాబా దగ్గర ముందు వెళ్తున్న కెమికల్‌ ట్యాంకర్‌నఅు ఓమినీ వాహనం ఓవర్‌టెక్‌ చేయబోయాడు. అయితే ట్యాంకర్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యంగా అలాగే వెళ్లడంతో ఓమినీ డ్రైవర్‌ ట్యాంకుర్‌ను ఢీకొట్టి.. రోడ్డు డివైడర్‌పై బోల్తాపడింది.

ఈ ప్రమాదంలో సుజాత అక్కడికక్కడే మృతిచెందగా.. ఓమినీలో ప్రయాణిస్తున్న మరో మహిళ కవిత, కేతావత్‌ రవి, రవి కుమారుడు అభిరాం తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు క్షతగాత్రులను 108లో మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రవి మృతిచెందాడు. ప్రమాదానికి కారణమైన ట్యాంకర్‌ను పోలీసులు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

కుటుంబాన్ని ఆదుకోవాలి.. 
కాగా నిరుపేద కుటుంబానికి చెందిన రవి, సుజాత దంపతులు హైదరాబాద్‌లో సిమెంట్‌ నిర్మాణ పనుల్లో కూలీ పనులు చేస్తూ జీవనం గడిపేవారని వెంకటమ్మకుంటతండా సర్పంచ్‌ వెంకట్‌నాయక్‌ తెలిపారు. రవికి ముగ్గురు సంతానమని, వీరిలో ఐదు సంవత్సరాల అభిరాం ప్రమాదంలో ప్రాణాపాయం నుంచి బడయపడ్డాడని వివరించారు. తల్లిదండ్రులు మృత్యువాత పడడంతో పిల్లలు అనాథలయ్యారని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement