
సంఘటనను వివరిస్తున్న బాధితులు (ఫైల్)
సాక్షి, సిటీబ్యూరో: తిరుమలగిరి ఠాణా పరిధిలో పట్టపగలు చోటు చేసుకున్న బందిపోటు దొంగతనం కేసు కొలిక్కి వచ్చింది. దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు నిర్విరామంగా శ్రమించి 24 గంటల్లోనే నిందితులను గుర్తించగలిగారు. మొత్తం ఎనిమిది మంది నిందితుల్లో బుధవారం నాటికి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారి కోసం ప్రత్యేక బృందం ముమ్మరంగా గాలిస్తోంది. బాధితుల సమీప బంధువే ఈ బందిపోటు దొంగతనానికి సూత్రధారిగా గుర్తించారు. కార్వాన్‌లోని జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో పని చేస్తున్న షానవాజ్ తిరుమలగిరి దర్గా సమీపంలో తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతడి వద్ద భారీ మొత్తంలో డబ్బు ఉంటుందని చిలకలగూడకు చెందిన సమీప బంధువు భావించాడు. దీంతో అదును చూసుకుని దోచుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకుగాను సంగారెడ్డికి చెందిన పరిచయస్తులను సంప్రదించాడు. అదే ప్రాంతానికి చెందిన నేరచరితుడైన వ్యక్తి నేతృత్వంలో మొత్తం ఎనిమిది మంది ముఠా కట్టారు. వీరికి కొన్ని రోజుల క్రితం సదరు ‘బంధువే’ షానవాజ్ ఇంటిని చూపించాడు. ఆపై పథకం వేసిన బందిపోటు దొంగలు పలుమార్లు షానవాజ్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారు.
పని దినాల్లో అతను ప్రతి రోజూ ఉదయం 9.30 గంటలకు విధుల నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతాడని గుర్తించారు. ఇదే అనువైన సమయంగా భావించిన బందిపోటు దొంగలు సోమవారం సంగారెడ్డి నుంచి కారులో బయలుదేరి వచ్చారు. షానవాజ్ ఇంట్లో భార్య, తల్లి మాత్రమే ఉండటంతో ఉదయం 10.30 గంటల సమయంలో గేటు తీసుకుని ఇంట్లోకి ప్రవేశించారు. ఈ వీరు ఐదుగురిలో నలుగురు పురుషులు ముఖాలకు ముసుగులు ధరించగా... మరో మహిళ బుర్ఖా వేసుకుంది. కత్తులతో బెదిరించిన దుండగులు బాధితుల కాళ్లుచేతులు కట్టేసి, నోటికి టేప్ వేశారు. అత్తాకోడళ్లను భయభ్రాంతులకు గురి చేసేందుకు వారిపై దాడి చేశారు. అనంతరం ఇద్దరి ఒంటిపై ఉన్న ఐదు తులాల బంగారు నగలు, నగదు, 45 తులాల వెండి పట్టీలు తీసుకున్నారు. గదిలోకి వెళ్లి అల్మారాను తెరిచి ఆద్యంతం వెతికారు. అయితే భారీ మొత్తంలో బంగారం, రూ.1.5 లక్షల నగదును షానవాజ్ తన అల్మారాలోని ‘చోర్ ఖానా’లో (రహస్య ప్రాంతం) ఉంచడంతో వీరి కంట పడలేదు.
పావు గంట లోపే తమపని పూర్తి చేసుకున్న దండగులు అక్కడినుంచి ఉడాయించారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో ఫీడ్‌ను అధ్యయనం చేశారు. ఈ నేపథ్యంలోనే ఓ అనుమానాస్పద కారును గుర్తించిన అధికారులు దాని నెంబర్ ఆధారంగా ముందుకు వెళ్లారు. ఫలితంగా నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని కారు, కత్తులు, బంగారం రికవరీ చేసినట్లు తెలిసింది. పరారీలో ఉన్న మరో నలుగురి కోసం ప్రత్యేక బృందం గాలిస్తోంది. మిగిలిన నిందితులను గురువారం పట్టుకుంటామని అధికారులు పేర్కొన్నారు. దుండగుల చర్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన షానవాజ్ తల్లి ఇక్బాల్ బీ మంగళవారం కన్నుమూసిన విషయం విదితమే. ఆమె మృతదేహానికి గాంధీ ఆస్పత్రి మార్చురీలో బుధవారం పోస్టుమార్టం నిర్వహించి సంబంధీకులకు అప్పగించారు. దుండగుల దాడి కారణంగానే ఇక్బాల్ బీ చనిపోయినట్లు ఫోరెన్సిక్ డాక్టర్లు నిర్ధారించారు. దీంతో బందిపోటు దొంగతనంగా (ఐపీసీ సెక్షన్ 395) నమోదైన కేసును తిరుమలగిరి పోలీసులు బుధవారం బందిపోటు దొంగతనం కోసం హత్యగా (ఐపీసీ సెక్షన్ 396) మార్చారు. కోర్టులో నేరం రుజువైతే నిందితులకు గరిష్టంగా ఉరి శిక్ష సైతం పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment