మాజీ ఎంపీపీ భర్త.. ఘరానా దొంగ | Robbery Thief Arrest in Gold Robbery Case | Sakshi
Sakshi News home page

ఘరానా దొంగ అరెస్ట్‌

Published Wed, Jan 30 2019 10:15 AM | Last Updated on Wed, Jan 30 2019 10:15 AM

Robbery Thief Arrest in Gold Robbery Case - Sakshi

వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ నిందితుడు అమర్‌సింగ్‌

నాగోలు: కల్లుకు బానిసై చోరీలకు పాల్పడుతున్న మాజీ ఎంపీపీ భర్త, పాతనేరస్తుడు అమర్‌సింగ్‌ను ఎల్‌బీనగర్‌ పోలీస్‌లు ఆరెస్ట్‌ చేసి అతడి నుంచి 36 తులాల బంగారు ఆభరణాలు రూ. 2 వేల నగదు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. మంగళవారం ఎల్‌బీనగర్‌ డీసీపీ కార్యాలయంలో డీసీపీ çసన్‌ప్రీత్‌సింగ్‌ వివరాలు వెల్లడించారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లా, వెల్దండ మండలం, బైరాపురం నగరగడ్డతండాకు చెందిన రత్లావత్‌ అమర్‌ సింగ్‌ వృత్తి రీత్యా వ్యవసాయదారుడు. అతని భార్య విజయ గతంలో సర్పంచ్‌గా, ఎంపీపీగా పనిచేసింది. సొంత గ్రామంలో 20 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది.  కల్లుకు బానిసైన ఇతను హైదరాబాద్‌లోని సింగరేణి కాలనీలో ఉంటూ చోరీలకు పాల్పడుతున్నాడు.

గతంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో చోరీలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చాడు.  కొంత కాలంగా ఆమన్‌గల్‌లో ఉంటూ తరచూ నగరానికి వచ్చి వెళ్లే ఇతను సాగర్‌ రింగ్‌రోడ్‌ సమీపంలోని కల్లుకౌంపౌండ్‌లో కల్లు సేవించి రాత్రిళ్లు తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నాడు. ఇటీవల ఎల్‌బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 14 ఇళ్లలో దొంగతనాలు చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీటీవీ పుటేజీ ఆధారంగా నిందుతుడిని అదుపులోకి తీసుకుని విచారించగా చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 2, కంచన్‌బాగ్‌లో ఒక చోరీకి పాల్పడినట్లు తెలిపాడు. గతంలో సరూర్‌నగర్, ఎల్‌బీనగర్, సైదాబాద్, వనస్థలిపురం, చైతన్యపురి, మీర్‌పేట, చందానగర్, షాద్‌నగర్, దేవరకొండ ప్రాంతాల్లో చోరీలు చేసినట్లు అంగీకరించాడు. అతడి నుంచి బంగారు ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.  సమావేశంలో ఎల్‌బీనగర్‌ ఏసీపీ పృథ్వీదర్‌రావు, సీఐ అశోక్‌ రెడ్డి, డీఐ కృష్ణమోహన్, ఎస్‌ఐ మారయ్య, సిబ్బంది వెంకటేష్, శివరాజ్, సుభాష్‌ చంద్రబోస్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement