దువ్వలో సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న ఎస్సై శ్రీనివాసరావు
పశ్చిమగోదావరి, తణుకు: పట్టపగలు. అదీ ఉదయం 8 గంటల నుంచి 9 గంటల మధ్యలో.. ఏకకాలంలో రెండిళ్లలో చోరీ జరిగింది. తణుకు మండలం దువ్వ గ్రామంలో మంగళవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో 8 కాసుల బంగారు ఆభరణాలు, రూ.2 లక్షల నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన అయినపర్తి లక్ష్మణరావు స్థానికంగా పీఎంపీ వైద్యుడిగా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య అరుణ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవల వేసవి సెలవుల నేపథ్యంలో అరుణ తన ఇద్దరు పిల్లలను తీసుకుని కొవ్వూరు బంధువుల ఇంటికి వెళ్లారు. ఇంట్లో లక్ష్మణరావు ఒక్కరే ఉంటున్నారు. మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లారు. తిరిగి 9.30 గంటల సమయంలో ఇంటికి వచ్చి చూసే సరికి ఇంటి వెనుక తలుపులు పగల గొట్టి ఉండటంతోపాటు పడకగదిలోని బీరువాలోని వస్తువులన్నీ మంచంపై చిందరవందరగా పడి ఉన్నాయి. బీరువాలో దాచుకున్న 6 కాసుల బంగారు ఆభరణాలతోపాటు రూ.1.80 లక్షలు నగదును అపహరించుకుపోయినట్టు గుర్తించారు.
మరో ఇంట్లో..
అదే గ్రామానికి చెందిన దండు వెంకటకృష్ణంరాజు, భార్య కాశీఅన్నపూర్ణలు రెండు నెలలుగా హైదరాబాదులో ఉంటున్నారు. గతంలో భర్త చేతిలో హత్యాయత్నానికి గురై కుమారుడిని, భర్తను కోల్పోయి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లక్ష్మీజ్యోతికి ఆసరాగా ఉండేందుకు తల్లిదండ్రులు వెంకటకృష్ణంరాజు, కాశీఅన్నపూర్ణ అక్కడే ఉంటున్నారు. అయితే ఇంటి బాగోగులు చూసేందుకు గ్రామానికి చెందిన మహిళను ఇంటి వద్ద ఉంచారు. రాత్రి సమయంలో అక్కడే నిద్రించి ఉదయం ఇల్లు, వాకిలి తుడిచి వెళుతుంది.
మంగళవారం యధావిధిగా పని ముగించుకుని పెంపుడు శునకానికి ఆహారం పెట్టి 8 గంటల సమయంలో ఇంటికి తాళం వేసి ఆమె వెళ్లింది. 9 గంటల సమయంలో పైఅంతస్తులో నివాసం ఉంటున్నవారు చూసే సరికి ఇంటి ప్రధాన గుమ్మం పగులగొట్టి ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. ఇంటి ఆవరణలో ఉంచిన గునపం సాయంతో తలుపులు పగులగొట్టిన దుండగులు ఇంట్లోకి చొరబడి బీరువాలో దాచుకున్న 2 కాసుల బంగారు ఆభరణాలు, రూ.15 వేలు నగదును ఎత్తుకెళ్లారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్సై ఎన్.శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. క్లూస్ టీం సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment