
సాక్షి, టీ.నగర్ (చెన్నై) : రౌడీషీటర్ బుల్లెట్ నాగరాజ్‌కు సినీ సహాయనటితోపాటు ఆరుగురు భార్యలు ఉన్నట్లు తాజాగా పోలీసు విచారణలో వెల్లడైంది. అలాగే, తేని జిల్లాకు చెందిన స్పెషల్ ఎస్‌ఐ బాలమురుగన్‌తో సన్నిహిత సంబంధం ఉన్నట్లు తేలింది. తేని జిల్లా, పెరియకుళం సమీపం మేలమంగళానికి చెందిన ఈ రౌడీషీటర్‌ను సోమవారం తెన్‌కరై సమీపంలో మఫ్టీలో ఉన్న పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అతని వద్ద ఉన్న కత్తులు, నాటు తుపాకులు, పాత, కొత్త కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.
అతన్ని పెరియకుళం పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లి పోలీసులు విచారించగా.. విస్మయపరిచే విషయాలెన్నో వెలుగుచూశాయి. తేని ఎస్పీ భాస్కరన్, పోలీసు అధికారుల ఆధ్వర్యంలో విచారణ జరిపిన అనంతరం అతన్ని మంగళవారం తెల్లవారుజామున పెరియకుళం మేజిస్ట్రేట్ అరుణ్‌కుమార్ ముందు హాజరుపరిచారు. నాగరాజ్‌కు 15 రోజుల కస్టడీ విధిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చారు. పోలీసులు అతన్ని తిరుచ్చి సెంట్రల్ జైలుకు తరలించారు. వత్సలగుండులో తాను బసచేసిన లాడ్జిలో ఎస్‌ఎస్‌ఐ బాలమురుగన్ పేరుతో నమోదు చేసినట్లు విచారణలో నాగరాజ్ తెలిపాడు. ఎస్‌ఎస్‌ఐ బాలమురుగన్ ప్రస్తుతం సెలవులో ఉన్నారు. బాలమురుగన్‌పై శాఖాపరమైన చర్యలకు పోలీసు ఉన్నతాధికారులు యోచిస్తున్నారు.
ఆరుగురు భార్యలు: బుల్లెట్ నాగరాజ్ చోరీ చేసిన నగదుతో జల్సాగా గడిపేవాడు. ఓ సినీ సహాయ నటి సహా తనకు మొత్తం ఆరుగురు భార్యలు ఉన్నట్లు నాగరాజ్ పోలీసులకు వెల్లడించాడు. అలాగే నకిలీ నోట్లను మార్చి భారీగా నగదు కొల్లగొట్టినట్లు తెలిపాడు.