ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, శ్రీకాకుళం సిటీ : జిల్లా కేంద్రంలో రౌడీషీటర్ల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండాపోతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా ఫాజుల్‌బాగ్‌పేటకు చెందిన ఓ రౌడీషీటర్ రాయల్ ఎన్‌ఫీల్డ్ బండిపై చెక్కతుపాకీగా పేర్కొంటున్న గన్‌ను తగిలించుకుని చక్కర్లు కొట్టడం నగరంలో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ సంఘటనను చూసిన వారంతా ముక్కున వేలేసుకున్నారు. గతంలో ఎస్పీ బ్రహ్మారెడ్డి హయాంలో కుక్కిన పేనులా ఉన్న వీరంతా ప్రస్తుతం పాత పద్ధతిలోనే నడిచేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.
జిల్లాలో 300 మందికిపైగా రౌడీషీటర్లు
జిల్లా వ్యాప్తంగా 300 పైబడి రౌడీషీటర్లు ఉన్నారు. వీరంతా వారానికోసారి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సంతకాలు చేయాల్సి ఉంటుంది. జిల్లా దాటి ఎక్కడికి వెళ్లాలన్నా పోలీసుల అనుమతి తప్పనిసరి.
కానీ పోలీస్ రికార్డుల్లో నమోదైన రౌడీషీటర్ల కదలికలపై పోలీసులు దృష్టి పెట్టకపోవడం వల్ల మూడు సెటిల్‌మెంట్లు, ఆరు దందాలు అన్న చందంగా మారింది. బ్రహ్మారెడ్డి ఎస్పీగా ఉన్న సమయంలో రౌడీషీటర్లపై ఉక్కుపాదం మోపారు. వారిలో పరివర్తన తీసుకువచ్చేందుకు ఎంతగానో కృషిచేశారు. ప్రస్తుతం ఆ దిశగా చర్యలు లేకపోవడంతో రౌడీషీటర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
విచారణ చేపట్టాం
ఫాజుల్‌బేగ్‌పేటకు చెందిన రౌడీషీటర్ చెక్కతుపాకీతో నగరంలో చక్కర్లు కొడుతున్నట్లు సమాచారం అందడంతో అతనిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి విచారించాం. మందలించాం. ఇటువంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా చేస్తాం. సంఘటనను ఉన్నతాధికారులకు నివేదిస్తాం. – ఎం.తిరుపతి, రెండోపట్టణ సీఐ, శ్రీకాకుళం
Comments
Please login to add a commentAdd a comment