రాళ్లతో కొట్టి యువకుడి దారుణ హత్య  | Young Man Brutal murder In Hyderabad | Sakshi
Sakshi News home page

రాళ్లతో కొట్టి యువకుడి దారుణ హత్య 

Published Wed, Oct 25 2023 8:10 AM | Last Updated on Wed, Oct 25 2023 8:10 AM

Young Man Brutal murder In Hyderabad - Sakshi

అమీర్‌పేట: పాత కక్షలు మనసులో పెట్టుకున్న రౌడీ షీటర్‌ మరో ఇద్దరితో కలిసి ఓ యువకుడిని రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేసిన సంఘటన ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని దాసారం బస్తీలో మంగళవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది.పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎస్‌ఆర్‌నగర్‌ బాపూనగర్‌కు చెందిన తరుణ్‌ (22) డిగ్రీ చదువుతూ మధ్యలోనే ఆపేశాడు. సోమవారం రాత్రి అతను బాపూనగర్‌లో దుర్గామాత పూజలో పాల్గొని ఇంటికి తిరిగి వెళుతుండగా ఓ స్నేహితుడు వచ్చి దాసారం బస్తీకి వెళ్లి వద్దామని చెప్పి తీసుకెళ్లాడు.

అప్పటికే అక్కడ రౌడీ షీటర్‌ షేక్‌ షరీఫ్, మరో ముగ్గురితో కలిసి మద్యం తాగుతూ ఉన్నాడు. తరుణ్‌ కూడా వారితో కూర్చున్నాడు. కొద్ది సేపటి తర్వాత షరీఫ్‌ తరుణ్‌ మధ్య గొడవ చోటు చేసుకుంది. ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో షరీఫ్‌ వెంట ఉన్న వ్యక్తులు తరుణ్‌పై దాడి చేశారు. దీంతో బాపూనగర్‌కు వెళ్లిన తరుణ్‌ దాడి విషయాన్ని తన స్నేహితుడికి చెప్పడంతో ఒక్కడిని చేసి ఎలా కొడతారంటూ అతను తరుణ్‌ను వెంట పెట్టుకుని మళ్లీ దాసారం బస్తీకి వచ్చాడు. తరుణ్‌ రాయితో షరీఫ్‌ను కొట్టడంతో అతను తరుణ్‌ కణతపై బలంగా కొట్టాడు.

కిందపడి పోయిన తరుణ్‌పై మరో ఇద్దరు యువకులు రాళ్లతో  దాడి చేశారు. అతడి అరుపులు స్థానికులు అక్కడికి చేరుకునేలోగా షరీఫ్‌ అతడి అనుచరులు పారి పోయారు. రక్తపు మడుగులో పడి ఉన్న తరుణ్‌ను పోలీసులతో కలిసి అమీర్‌పేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అమీర్‌పేటలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నిందితుడు షరీఫ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని వెస్ట్‌జోన్‌ డీసీపీ జోయల్‌ డేవీస్, ఎసీపీ వెంకటేశ్వర్‌రావు, సీఐ రాంప్రపాదరావు పరిశీలించారు. 

పథకం ప్రకారమే హత్య: 
హత్యకు గురైన తరుణ్‌ ,రౌడీ షీటర్‌ షరీఫ్‌ మధ్య పాత గొడవలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.ఈ నేపథ్యంలో తరుణ్‌ను హత్య చేసి ఉండవచ్చని నిర్ధారణకు వచ్చారు. నాలుగు నెలల క్రితం కూడా ఫరీష్‌ తరుణ్‌కు కొట్టి సెల్‌ ఫోన్‌ పగలకొట్టాడు. ఈ ఘటనపై ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. దీంతో తరుణ్‌పై మరింత ఆగ్రహం పెంచుకున్నాడు. ఇటీవల జరిగిన బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ సమయంలో సైతం ఇద్దరి మధ్య గొడవ జరిగింది.నీ అంతు చూస్తానంటూ షరీఫ్‌ తరుణ్‌ను తరుచూ బెదిరించేవాడని స్నేహితులు తెలిపా రు. ఇందులో భాగంగానే పథకం ప్రకారం దసరా పండుగ రోజున తరుణ్‌ను దాసారం బస్తీకి పిలిపించి హత్య చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement