విచారణ చేస్తున్న పోలీసులు నిర్మల (ఫైల్)
నెల్లూరు(క్రైమ్): ఒంటరిగా నివశిస్తున్న ఓ మహిళను గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. అనంతరం ఆమెను తగులబెట్టి నగలు దోచుకెళ్లారు. ఈ సంఘటన నెల్లూరులోని రామలింగాపురంలోని సమీపంలో చోటుచేసుకుంది. బుధవారం పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. నీలగిరిసంఘానికి చెందిన బి.నిర్మలాబాయి (45)కి 23 సంవత్సరాల క్రితం రమేష్‌సింగ్ అనే వ్యక్తితో వివాహమైంది. వారికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. మూడేళ్ల క్రితం రమేష్‌సింగ్ అనారోగ్యంతో మృతిచెందాడు. అప్పటి నుంచి ఆమె నగరంలోని బీవీనగర్‌లోని తన బంధువుల ఇంటి వద్ద ఉంటూ రామలింగాపురంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తోంది. కుమారుడు బెంగళూరులో ఉద్యోగం చేస్తుండగా, కుమార్తె తిరుపతిలో ల్యాబ్‌టెక్నీషియన్ కోర్సు చదువుతోంది. సుమారు నెలన్నర నుంచి ఆమె రామలింగాపురంలో సమీపంలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. ఇల్లు స్కూల్ దగ్గరగా ఉండడంతో ప్రతిరోజూ నడుచుకుంటూ వెళ్లి సాయంత్రం స్కూల్ నుంచి తిరిగి వచ్చేది. మంగళవారం ఆర్టీఓ కార్యాలయంలో పని ఉందని స్కూల్ నుంచి ముందుగానే వెళ్లింది. రాత్రి ఏడు గంటలకు ఇంటికి చేరుకుంది.
దట్టమైన పొగ రావడంతో..
సుమారు 7.45 గంటల ప్రాంతంలో నిర్మలాబాయి నివశిస్తున్న రెండో అంతస్తు ఇంట్లోనుంచి దట్టమైన పొగ బయటకు వచ్చింది. ఆమె ఇంటి పైభాగంలో నివాసం ఉంటున్న యువకులు ఈ విషయాన్ని గుర్తించి ఏం జరిగిందోనని నిర్మలాబాయి ఇంటివద్దకు పరుగులు తీశారు. తలుపు ఓరగా వేసి ఉండడంతో తెరిచి పక్కనే ఉన్న బాత్‌రూమ్‌లో నుంచి నీటిని తెచ్చి చల్లారు. దీంతో ఉమాబాయి మృతదేహం కాలుతూ కనిపించడంతో వారు అక్కడినుంచి పరుగులు తీసి చుట్టుపక్కల వారికి విషయం తెలియజేశారు. బాలాజీనగర్ ఎస్సై రమేష్‌బాబు తన సిబ్బందితో అటుగా వెళుతూ స్థానికులు గుమికూడి ఉండడం, పొగ వస్తుండటాన్ని గుర్తించి సంఘటనా స్థలానికి వెళ్లారు. నిర్మలాబాయి ఇంటివద్దకు చేరుకుని పరిశీలించారు. పరుపుపై ఆమె మృతదేహం కనిపించింది. పూర్తిగా కాలిపోయి ఉంది. ఇంట్లోనుంచి గ్యాస్ లీక్ అవుతున్నట్టుగా గమనించిన పోలీసు సిబ్బంది వంటగదిలోకి వెళ్లి రెగ్యులేటర్‌ను ఆఫ్ చేశారు. అనంతరం జరిగిన విషయాన్ని ఎస్సై బాలాజీనగర్ ఇన్‌స్పెక్టర్ జి.వేణుగోపాల్‌రెడ్డి, నగర డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణల దృష్టికి తీసుకెళ్లారు.
గొంతులో పొడిచారు
సంఘటనా స్థలానికి చేరుకున్న నగర డీఎస్పీ, బాలాజీనగర్ ఇన్‌స్పెక్టర్లు సంఘటన జరిగిన తీరును బట్టి తొలుత అగ్నిప్రమాదం జరిగి ప్రమాదవశాత్తు నిప్పంటుకుని మృతిచెంది ఉండొచ్చని భావించారు. అయితే మృతదేహాన్ని పరిశీలించగా అగ్నిప్రమాదం కాదని తేలింది. ఆమె గొంతులో బలమైన ఆయుధం (కత్తి లేదా స్క్రూ డ్రైవర్)తో విచక్షణారహితంగా 15 పోట్లకు పైగా పొడిచి ఉండడాన్ని గుర్తించారు. చెవుల రంధ్రాలు తెగి ఉండడాన్ని బట్టి కమ్మలను సైతం దుండగులు తెంపుకెళ్లినట్లు తెలుస్తోంది. మంటల కారణంగా ఇంట్లోని వస్తువులు పూర్తిగా కాలిపోయాయి.
తెలిసిన వారి పనే?
తెలిసిన వారే ఈ దురాఘతానికి ఒడిగట్టి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతురాలు ఏడు గంటలకు ఇంటికి వచ్చింది. అరగంట వ్యవధిలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించే అవకాశమే లేదు. ఒకవేళ అలా జరిగి ఉంటే మృతురాలు పెద్దగా కేకలు వేయడంతోపాటు ప్రతిఘటించేది. సంఘటనా ప్రదేశంలో పెనుగులాడిన ఆనవాళ్లు సైతం లేవు. దీనిని బట్టిచూస్తే బాగా తెలిసిన వారి పనై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. నిందితులు ఆమెను హత్యచేసి ఆపై తగులబెట్టారు. గ్యాస్‌ను లీక్ చేశారు. దీనిని బట్టిచూస్తే గ్యాస్ లీకై ప్రమాదం సంభివించి ఆమె మృతిచెందిందని నమ్మించేలా చేసి ఉండొచ్చని అనుకుంటున్నారు. మరోవైపు చెవుల్లోని కమ్మలు దొంగలించడాన్ని చూస్తే ఈ పని దొంగలు చేసి ఉంటారని నమ్మించే ప్రయత్నం చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. మృతురాలి బంధువు ఫిర్యాదు మేరకు పోలీసులు మర్డర్ ఫర్ గెయిన్ కింద కేసు నమోదుచేసి మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు. బుధవారం ప్రభుత్వ వైద్యులు శవపరీక్ష నిర్వహించి బాధిత కుటుంబసభ్యులకు అప్పగించారు. తల్లి మృతదేహాన్ని చూసిన పిల్లలు కన్నీటి పర్యంతమయ్యారు.
ఏ కారణంతో?
హత్యకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు విభిన్న కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నారు. అసూయ, ఆర్థిక లావాదేవీలా? కుటుంబకలహాలా? నిజంగా ఆగంతుకుల పనేనా తదితర కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. మృతురాలి ఫోన్‌కాల్ డీటైల్స్‌ను, సంఘటన జరిగిన సమయంలో టవర్ లోకేషన్ ద్వారా వివరాలను సేకరించి వాటిని పరిశీలిస్తున్నారు. మరోవైపు ఈ తరహా నేరాలకు పాల్పడి పోలీసులకు చిక్కిన వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆమెతో సన్నిహితంగా ఉండే బంధువులు, స్నేహితులను సైతం విచారిస్తున్నారు. మొత్తంగా కేసులోని మిస్టరీని త్వరితగతిన ఛేదించి నిందితులను అరెస్ట్ చేస్తామని బాలాజీనగర్ ఇన్‌స్పెక్టర్ జి.వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. ఘటనా స్థలంలో క్లూస్‌టీం వేలిముద్రలను సేకరించింది.
Comments
Please login to add a commentAdd a comment