
అరెస్ట్‌యిన నిందితులు అభిషేక్, చేతన్
కర్ణాటక, కృష్ణరాజపురం : మరణానంతరం పున్నామ నరకం నుంచి రక్షించేవాడు పుత్రుడంటూ హిందూ పురాణాలు చెబుతుండగా ఆస్తిపై వ్యామోహంతో పుత్రులు, బతికి ఉండగానే తమ తండ్రికి నరకం చూపించిన ఘటన సోమవారం హెచ్‌ఏఎల్‌లో వెలుగు చూసింది. హెచ్‌ఏఎల్‌లో నివాసముంటున్న రామచంద్ర అనే వ్యక్తికి బొమ్మసంద్రలో ఒకటిన్నర గుంటల స్థలం ఉంది. అయితే జల్సాలకు అలవాటు పడ్డ రామచంద్ర కుమారులు అభిషేక్, చేతన్‌లు బొమ్మసంద్రలో ఉన్న స్థలాన్ని విక్రయించి డబ్బులు ఇవ్వాలంటూ కొద్ది రోజులుగా తండ్రి రామచంద్రపై ఒత్తిడి చేస్తున్నారు. అందుకు రామచంద్ర అంగీకరించకపోవడంతో ఇదేవిషయమై తండ్రీ, కొడుకుల మధ్య వాగ్వాదం, ఘర్షణలు జరుగుతున్నాయి.
దీంతో ఎలాగైనా తండ్రి నుంచి స్థలాన్ని తమ పేరుపై రాయించుకోవాలనే నిర్ణయించుకున్న అభిషేక్, చేతన్‌లు ఇదేనెల 5న బంధువులైన మరికొంత మంది యువకుల సహాయంతో తండ్రి రామచంద్రను అపహరించి ఎలక్ట్రానిక్‌సిటీలోని చిక్కగానహళ్లిలో ఓ పాడుబడిన షెడ్‌లో బంధించి చిత్రహింసలకు గురి చేయసాగారు. రామచంద్ర కనిపించడం లేదంటూ బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న హెచ్‌ఏఎల్ పోలీసులు రామచంద్ర కొడుకులను తమదైన శైలిలో విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. సోమవారం బాధితుడు రామచంద్రను ఆసుపత్రికి తరలించిన పోలీసులు రామచంద్ర ఇద్దరు కొడుకులు అభిషేక్, చేతన్‌లతో పాటు సహకరించిన బంధువులైన యువకులను అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment