అక్షరాలను ఆస్వాదిస్తారనుకుంటేఆయువుతీసుకుంటున్నారు.. ఊరికి పేరు తెస్తారనుకుంటేఉరికి వేలాడుతున్నారు. ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతారనుకుంటే అంపశయ్యలెక్కుతున్నారు. చదవలేక చావును కోరుకుంటున్న వారు కొందరైతే, ఒత్తిడికి చిత్తై ప్రాణాలొదులుతున్న వారు ఇంకొందరు. చదవలేక, కక్కలేక.. చావులేఖ రాస్తున్న భావిభారత పౌరుల భవితను మార్చాలి. కార్పొ‘రేట్’ విషానికి విరుగుడు తేవాలి. కన్నవాళ్ల కడుపుకోత తీర్చే చదువును కనిపెట్టాలి.
నేడు కార్పొరేట్ కళాశాలలు బంద్
రాష్ట్రంలోని పలు కార్పొరేట్ విద్యాసంస్థల్లో జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలకు నిరసనగా సోమవారం వైఎస్సార్ విద్యార్థి విభాగం బంద్‌కు పిలుపునిచ్చింది. కార్పొరేట్ విద్యాసంస్థల్లో విద్యార్థులు పిట్టల్లా రాలుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టుగా కూడా లేదని విమర్శించాయి. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా మూడున్నరేళ్లలో వందలాది మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం నగర అధ్యక్షుడు దొడ్డ అంజిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కార్పొరేట్లకు తొత్తుల్లా వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా నగరవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిస్తున్నట్లు వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగంతోపాటు ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ, ఏఐఎస్‌ఎఫ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపాయి. అనంతరం మంత్రి గంటా శ్రీనివాసరావును కలిసి వినతిపత్రం అందించనున్నాయి.
లబ్బీపేట(విజయవాడతూర్పు): చదువు అనేది స్వేచ్ఛాపూరిత వాతావరణంలో కొనసాగినప్పుడే విద్యార్థిలో సంపూర్ణ వికాసం వెల్లివిరుస్తుంది. విజ్ఞానాన్ని సంపాదించడమే విద్య అనే విషయాన్ని తెలుసుకుని.. ఎవరికి ఏది సరిపోతుందో అదే నేర్పించాల్సి ఉంటుంది. కానీ, నేటి పోటీ ప్రపంచంలో పిల్లలకు చదువు మినహా ఇతర అంశాలేవీ లేవనేలా తల్లిదండ్రులు వ్యవహరిస్తున్నారు. పబ్లిక్‌తో మాట్లాడటం, అన్నదమ్ములతో గడపడం వంటివి కూడా చేయకపోవడంతో వారిలో ఒత్తిడిని నియంత్రించుకునే ధోరణి కుదరడం లేదనేది విద్యావంతుల వాదన. చదువుల వ్యాపకంలో పడి మనిషి వ్యక్తిత్వాన్ని చంపేస్తున్నారని, వ్యక్తిత్వం లేని చదువు వ్యర్థమనే విషయాన్ని గ్రహించడం లేదు. దీంతో చదువులో వెనకబడినవారు చావు ఒక్కటే పరిష్కారమని భావిస్తున్నారు. చదువు లేకపోయినా మనిషి ఆనందంగా జీవించగలడని, విజ్ఞానం అందించే సాధనంగానే విద్యను భావించాలని మేధావులు హితవు చెబుతున్నారు.
సృజనను చంపేస్తున్నారు
ప్రస్తుత కార్పొరేట్ విద్యావిధానం మనిషిలోని సృజనను చంపేస్తోంది. విద్యార్థులు మార్కులు సాధించే యంత్రంలా భావించే విద్యాసంస్థల వల్ల మనిషి వ్యక్తిత్వం లేనివాడిగా తయారవుతున్నాడు. వారంవారం మెరిట్ పరీక్షలు, మార్కుల ఆధారంగా తరగతులు నిర్వహిస్తుండటం వారిలోని ఆందోళన, ఒత్తిడిని మరింత పెంచుతోంది. మార్కులు తక్కువ వస్తే క్లాస్ మారుస్తారనే ఆందోళన విద్యార్థుల్లోని సృజనను చంపేస్తోంది. సిలబస్ ఒత్తిడి తట్టుకోలేక, తల్లిదండ్రులు సైతం సహకరించకపోవడంతో వారు ఎవరికి చెప్పుకోవాలో తెలియక చావునే మార్గంగా ఎంచుకుంటున్నారు.
భయపెడుతున్న వరుస ఘటనలు
సెప్టెంబరు 17 : మార్కులు రాలేదని వైస్ ప్రిన్సిపాల్ కొట్టడంతో మనస్థాపానికి గురైన గూడవల్లి నారా యణ కళాశాల విద్యార్థి పి.ఈశ్వర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరు జిల్లా మంచికల్లుకు చెందిన ఆ విద్యార్థి తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపించారు.
♦ కోడూరు మండలం మందపాకలకు చెందిన ఇంటర్మీడియెట్ విద్యార్థి శివసాయి మణికంఠ చదువులో తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
సెప్టెంబరు 19 : నగరంలోని శ్రీచైతన్య డే స్కాలర్ కళాశాలలో చదివే చింతా కల్యాణ్ అధ్యాపకుల వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు.
అక్టోబరు 12 : నిడమానూరులోని శ్రీచైతన్య కళాశాలలో చదువుతున్న కడప జిల్లా రాయచోటికి చెందిన ఆరమాటి భరత్‌రెడ్డి (16) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చదువులో తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటూ, తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చినా సకాలంలో రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లు అతడి స్నేహితులు చెప్పారు.
♦ నూజివీడులోని ట్రిపుల్ ఐటీ విద్యార్థి రమాదేవి, లక్ష్మీ నరసింహమూర్తి, తిరువూరుకు చెందిన వెంకటకుమారి, గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి దుర్గాసతీష్.. ఇలా నెల రోజుల్లో వరుస ఆత్మహత్యలు భయాందోళన కలిగిస్తున్నాయి.
అంతా కార్పొరేట్ విద్యార్థులే..
విద్యలో ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారంతా కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న వారే కావడం విశేషం. కార్పొరేట్ సంస్థల్లో చదివే విద్యార్థులకు ఆటపాటలు లేకుండా రోజులో 18 గంటల పాటు నిర్బంధంగా పుస్తకాలతో కుస్తీ పట్టించడమే కారణంగా తెలుస్తోంది. తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ, చదువులో తీవ్రమైన ఒత్తిడికి గురవుతూ, జీవితమంటే చదువు ఒక్కటే అని భావిస్తున్న విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నిర్బంధ విద్యలో మార్పు రానంత వరకూ ఇలాగే జరుగుతుందని విద్యావేత్తలు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment