మృతి చెందిన విద్యార్థిని
కోహీర్(జహీరాబాద్): మండలంలోని మద్రి గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థిని ప్రియాంక నాటు వైద్యం వికటించడంతో బుధవారం మృతి చెందింది. ఆమె గత కొంత కాలంగా కామెర్లతో బాధపడుతోంది. దీంతో తల్లిదండ్రులు రెండు మూడు సార్లు నాటు వైద్యం చేయించినట్లు సమాచారం. అది వికటించడంతోనే విద్యార్థిని మృతి చెందినట్లు తెలుస్తోంది. వివరాల ప్రకారం..మంగళవారం మధ్యాహ్నం పరీక్ష రాసి ఇంటికి వెళ్లిన ప్రియాంక తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే ఆటోలో జహీరాబాద్ ప్రభుథ్వాస్పత్రికి తరలించారు.డాక్టర్ల సూచన మేరకు బీదర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది.
గ్రామానికి చెందిన అశోక్, లక్ష్మి దంపతుల కుమార్తె ప్రియాంక గురుజువాడ ప్రభుత్వోన్నత పాఠశాలలో 10 తరగతి చదివింది. దురదృష్టవశాత్తు ఒక పరీక్ష మిగిలి ఉండగానే విద్యార్థిని అనారోగ్యంతో మృతి చెందింది. తరగతిలో చురుకైన విద్యార్థుల్లో ఒకరైన ప్రియాంక ఎలాగైనా పాఠశాల ఫస్ట్ రావాలనే సంకల్పంతో చదివేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. కామెర్లతో బాధపడుతున్న ప్రియాంకను ఆస్పత్రికి తీసుకెళ్లమని అనేక సార్లు తల్లిదండ్రులకు చెప్పానని, కానీ వారు నాటువైద్యాన్ని నమ్ముకోవడంతో అనార్థం జరిగిందని హెచ్‌ఎం జిన్‌రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment