
సాక్షి, పెరంబూరు : పిల్లలు పుట్టలేదని మనస్తాపం చెంది నటుడి భార్య ఆత్మహత్య చేసుకుంది. మధురవాయిల్‌లో సిద్ధార్థ్ గోపీనాథ్ అనే కోలీవుడ్ సహాయ నటుడు నివసిస్తున్నాడు. అతను ఆది హీరోగా నటించిన యాగవరాయనుమ్, నాకాక్క తదితర చిత్రాల్లో సహాయ నటుడిగా నటించాడు. సిద్ధార్థ్ భార్య స్మిరిజా. వీరికి వివాహమై మూడేళ్లు అయ్యింది. ఇంకా పిల్లలు కలగలేదు. ఈ విషయమై దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఇదిలాఉండగా సోమవారం రాత్రి సిద్ధార్థ్ భార్యతో కలిసి హోటల్‌కు వెళ్లి భోజనం చేసి ఇంటికి వచ్చారు. అనంతరం దంపతులు గొడవ పడినట్లు తెలుస్తోంది. దీంతో స్మిరిజా కోపంగా గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది. సిద్ధార్థ్ హాలులోనే పడుకున్నాడు.
ఉదయం నిద్రలేచిన సిద్ధార్థ్ 8.30 గంటలు అవుతున్నా భార్య గది నుంచి బయటకు రాకపోవడంతో తలుపుతట్టి పిలిచాడు. ఎలాంటి స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చి వెంటనే మధురవాయిల్ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వచ్చి తలుపులు బద్దలుకొట్టి లోనికి వెళ్లి చూడగా స్మిరిజా ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్మిరిజా మృతదేహానికి పోస్టుమార్టం కోసం కీల్‌పాక్కం ఆస్పత్రికి తరలించారు. కేసు విచారణ జరుపుతున్నారు.