హరికృష్ణ మృతదేహాన్ని చెన్నైకు తరలిస్తున్న బంధువులు హరికృష్ణ (ఫైల్)
ప్రాణం పోయాక శవం ఏడ్వడమా! అని ఆశ్చర్యపోతున్నారు కదూ? అవును మరి.అధికారులు వ్యవహరించిన తీరు చూస్తే అదే భావన కలుగుతుంది. ప్రాంతం కాని ప్రాంతానికి వచ్చి ఎవరైనా మరణిస్తే అయ్యోపాపం అని సానుభూతి చూపుతాం.ఆ పాటి దానికి ఆ మృతదేహం నోచుకోలేదు. వడదెబ్బకు గురై తమిళనాడుకు చెందిన ఎస్‌ఐ మరణిస్తే దీనిని ధ్రువీకరించేందుకు అధికారులు నిబంధనల పేరట ఒకరిపై మరొకరిపై నెపం నెట్టేసి విమర్శలు మూటకట్టుకున్నారు. పోలీస్ స్టేషన్, ప్రభుత్వ ఆసుపత్రి, పీహెచ్‌సీ చుట్టూ మృతుని కుటుంబ సభ్యులు 24 గంటల పాటు ప్రదక్షిణలు చేసి వేసారిపోయారు. చివరకు మృతదేహం నుంచి దుర్వాసన వస్తుండడంతో విషణ్ణవదనాలతో మృతదేహాన్ని తీసుకెళ్లారు.
పుత్తూరు: చెన్నైలోని పారిస్ ఏరియాలో ఎస్‌ఐగా పనిచేస్తున్న హరికృష్ణ (58) ఆధ్యాత్మిక చింతన గల 12మంది మిత్రబృందంతో కలిసి శనివారం పౌర్ణమి సందర్భంగా వడమాలపేట మండలంలోని సదాశివకోనకు వచ్చారు. పూజల అనంతరం కోన అంతా తిరిగారు. ఆదివారం తిరుగు ప్రయాణమయ్యారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మండలంలోని నాగిలేరు వద్ద ఎండ తీవ్రతకు సొమ్మసిల్లి కిందపడి హరికృష్ణ మరణించారు. దీంతో ఆయన వెంట వచ్చిన వారు సమాచారం చేరవేయడంతో చెన్నైలో ఎస్‌ఐగా పనిచేస్తున్న మృతుని కుమారుడు శరవణ బంధువులతో కలిసి సంఘటన స్థలానికి సాయంత్రం వేళకు చేరుకున్నారు. మృతదేహాన్ని వాహనంలో పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి రాత్రి ఎనిమిది గంటలకు తరలించారు. అప్పటి నుంచి అధికారులు వారికి చుక్కలు చూపించారు.
మాది కాదంటే మాది కాదు
సాధారణంగా వడదెబ్బతో మృతి చెందితే త్రీమెన్ కమిటీ ధ్రువీకరించాల్సి ఉంది. ఇందులో స్థానిక ఎస్‌ఐ, పీహెచ్‌సీ వైద్యుడు, తహసీల్దార్ సభ్యులుగా ఉంటారు. పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు వడదెబ్బ మృతిని ధ్రువీకరించేందుకు నిరాకరించారు. పోస్టుమార్టం నిర్వహిస్తేనే ధ్రువీకరణ పత్రం ఇస్తామని స్పష్టం చేశారు. ఇందుకు పోలీసుల నుంచి ఎఫ్‌ఐఆర్ నకలు తీసుకురావాలని సూచించారు. అయితే, వడదెబ్బ మృతిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేమని పోలీసులు తేల్చి చెప్పారు. దీంతో గొల్లపల్లె పీహెచ్‌సీ వైద్యుడిని మృతుడి బంధువులు సంప్రదించారు. పీహెచ్‌సీ ఏరియా పరిధిలో ఉండే వ్యక్తులు మృతి చెందితేనే ధ్రువీకరిస్తాం తప్పితే ఇతర ప్రాంతాల వారు మృతి చెందితే ధ్రువీకరించలేమని, ఇందుకు తమ నిబంధనలు అనుమతించవని వారు స్పష్టం చేశారు. మరోవైపు హాస్పిటల్ మార్చురీలో ఫ్రీజర్ బాక్సు కూడా లేకపోవడం, ఎర్రటి ఎండలో హరికృష్ణ మృతదేహాన్ని ఉంచడంతో దుర్వాసన రాసాగింది. అప్పటికే మధ్యాహ్నం ఒంటి గంట దాటింది. అధికారులు తీరుపై మృతుని బంధువులు తీవ్రంగా మండిపడ్డారు. విసిగి వేసారిని మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు చెన్నై నుంచి తెప్పించిన ఫ్రీజర్ అంబులెన్సులో మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకెళ్లారు. మానవత్వం లేకుండా వ్యవహరిస్తారా? అంటూ ఏపీ ప్రభుత్వాన్ని, అధికారులను దుమ్మెత్తిపోశారు.
విమర్శలకు తావిచ్చిన అధికారుల తీరు
కుటుంబానికి చెందిన ఒకరు హఠాన్మరణం చెందితే మృతి చెందితే ఆ కుటుంబం పడే బాధను అర్థం చేసుకోకుండా అధికారులు వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మృతుడు సాక్షాత్తు ఎస్‌ఐ అయిననూ పుత్తూరు పోలీసులు సహకరించకపోవడం, వడదెబ్బ అని కాకుండా ‘అనుమానాస్పద స్థితిలో మృతి’ కింద కేసు నమోదు చేసేందుకు తర్జనభర్జనలు పడడంపై మృతుని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, పీహెచ్‌సీ పరిధిలో ఉండే వ్యక్తులు వడదెబ్బకు గురై మృతి చెందితేనే ధ్రువీకరిస్తామని పీహెచ్‌సీ వైద్యుడు చెప్పడంపై కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మరణించి దాదాపు 24 గంటలు గడుస్తున్నా అధికారులు వడదెబ్బ మృతిని ధ్రువీకరించకుండా నిబంధనల పేరిట అధికారులు ఇంత అమానవీయంగా వ్యవహరించడాన్ని స్థానికులు కూడా తప్పు పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment