అంతులేని విషాదం! | Teenagers Who Were Seriously Injured In A Road Accident Died In Hospital | Sakshi
Sakshi News home page

అంతులేని విషాదం!

Aug 22 2019 8:34 AM | Updated on Sep 6 2019 12:01 PM

Teenagers Who Were Seriously Injured In A Road Accident Died In Hospital - Sakshi

గుండెపోటుతో మృతి చెందిన దీపు నాన్నమ్మ రమణమ్మ (ఫైల్‌), అశోక్‌ (ఫైల్‌), దీపు (ఫైల్‌)  

పాడేరులో విషాదం నెలకొంది. రెండు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు యువకులు కొద్ది గంటల తేడాలోనే తనువుచాలించారు. వీరిలో ఓ యువకుడు చనిపోయిన విషయాన్ని తట్టుకోలేక నాన్నమ్మ గుండెపోటుతో మరికొద్ది గంటల్లో మృతి చెంది కుటుంబీకులను విషాదాన్ని మిగిల్చింది. 

సాక్షి, పాడేరు : పాడేరు పట్టణానికి చెందిన కోట దీపు (25), సుండ్రుపుట్టు వీధికి చెందిన మనతుల అశోక్‌ (28) ఈనెల 19వ తేదీన స్నేహితుడు ఇచ్చిన విందులో పాల్గొని రాత్రి 10 గంటల సమయంలో గొందూరు నుంచి పాడేరుకు ద్విచక్ర వాహనంపై వేగంగా వస్తుండగా ఐటీడీఏ పీవో బంగ్లా సమీపంలోని మలుపు వద్ద అదుపుతప్పి గోతిలో  పడిపోయారు. తీవ్ర గాయాలపాలైన వీరిని స్థానికులు పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించి ప్రాథమిక వైద్య చికిత్స అనంతరం అత్యవసర వైద్యం కోసం విశాఖపట్నంలోని ఓప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వీరిలో దీపు చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందగా అశోక్‌  బుధవారం మృతి చెందాడు.

దీపు మరణవార్త విని నాన్నమ్మ రమణమ్మకు గుండెపోటు వచ్చి బుధవారం ఉదయం ఇంట్లో కుప్పకూలి కన్నుమూసింది. ఈ ఘటన వీరి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. దీపు తండ్రి రమణ విద్యుత్‌ శాఖలో లైన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. దీపును నాన్నమ్మ రమణమ్మ ఎంతో అల్లారముద్దుగా చూసుకునేది. ఆయన మరణవార్త వినడంతో ఒక్కసారిగా గుండె ఆగి తిరిగిరాని లోకానికి చేరింది. దీపు డిగ్రీ చదువుతున్నాడు. ఇక అశోక్‌ తండ్రి రమణ కార్పెంటర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఇంటర్, ఐటీఐ వరకు చదువుకున్న అశోక్‌ వెల్డింగ్‌ షాపు నిర్వహిస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. బైక్‌ ప్రమాదంలో ఒక్కోగనొక్క కొడుకు అశోక్‌ మృతి చెందటంతో తల్లిదండ్రులు భోరున విలపిస్తున్నారు. వీరి అంత్యక్రియలు బుధవారం వేర్వేరు చోట్ల నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement