కోడెల అంతిమయాత్రలో శివరామ్
సాక్షి, హైదరాబాద్: కోడెల శివప్రసాద్ ఆత్మహత్య కేసు దర్యాప్తును హైదరాబాద్ పోలీసులు ముమ్మరం చేశారు. ఆయన ఆత్మహత్యకు కుటుంబ వివాదాలు ఏమైనా కారణమా? అనే కోణంలోనూ విషయ సేకరణపై పోలీసులు దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా కోడెల తనయుడు శివరామ్‌ను త్వరలోనే విచారించేందుకు రంగం సిద్ధం చేశారు. కోడెల కొన్ని రోజుల కిందట కూడా తన స్వస్థలంలో ఆత్మహత్యకు యత్నించగా కుటుంబీకులు ఆ విషయం దాచి గుండెపోటుగా చిత్రీకరించడంపైన తెలంగాణ పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కుమారుడు, కుటుంబీకుల కారణంగానే కోడెల ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన మేనల్లుడు కంచేటి సాయిబాబు గుంటూరు జిల్లా సత్తెనపల్లి డీఎస్పీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ ఫిర్యాదు ఆంధ్రప్రదేశ్ పోలీసుల నుంచి తమకు అందిందని హైదరాబాద్ వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ బుధవారం తెలిపారు. దీన్ని కూడా పరిగణలోకి తీసుకుని కోడెల ఆత్మహత్య కేసుతో కలిపి దర్యాప్తు చేస్తామని ఆయన చెప్పారు.
బసవతారకం ఆస్పత్రి వైద్యురాలికి చివరి కాల్..
హైదరాబాద్‌లో కోడెల ఉరి వేసుకున్న గదిని పోలీసులు పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. ఆయన కొన్నేళ్లుగా వినియోగిస్తున్న మందులను వైద్య నిపుణులతో పరీక్ష చేయించాలని నిర్ణయించారు. అదే సమయంలో కోడెల పర్సనల్ మొబైల్ సెల్‌ఫోన్ ఎక్కడుంది? దాన్ని దాచాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఆత్మహత్యకు ముందు ఆ ఫోన్‌తో ఆయన ఎవరితో మాట్లాడారు? ఫోన్ దొరికితే గుట్టు రట్టవుతుందని ఎవరైనా భయపడుతున్నారా? అనే ప్రశ్నలకు సమాధానాల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఫోన్ నంబర్ ఆధారంగా కాల్‌డేటా రికార్డర్ యాప్ (సీడీఆర్‌ఏ)తో కాల్‌లిస్ట్‌ను పరిశీలిస్తున్నారు. ఆత్మహత్యకు ముందు కోడెల బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి చెందిన ఒక వైద్యురాలికి ఫోన్ చేసి 24 నిమిషాలు మాట్లాడినట్లు పోలీసుల దృష్టికి వచ్చినట్టు సమాచారం. ఆ ఫోన్ కాల్‌లో ఏం మాట్లాడారు అనేది తెలుసుకోవడానికి ఆ డాక్టరును విచారించాలని నిర్ణయించారు.
కేబుల్ వైరుతో ఉరి.. పోస్టుమార్టం నివేదిక
కోడెల శివప్రసాదరావు మృతదేహానికి సోమవారం పోస్టుమార్టం నిర్వహించిన ఉస్మానియా ఆస్పత్రి ఫోరెన్సిక్ వైద్యులు ఆ నివేదికను బుధవారం పోలీసులకు అందించారు. మెడకు కేబుల్ వైరు బిగించుకోవడం ద్వారానే మరణం సంభవించిందని వైద్యులు పోస్టుమార్టం నివేదికలో పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు. కోడెల గొంతు భాగంలో ఎనిమిది అంగుళాల పొడవుతో మచ్చ ఉందని తెలిపారు. ముందుగా తన పంచెను చింపి తాడుగా చేసుకుని ఉరి వేసుకోవాలని కోడెల ప్రయత్నించారని, అది సాధ్యం కాకపోవడంతో గదిలో ఉన్న కేబుల్ వైరుతో ఉరి వేసుకున్నారని తెలిపారు.
12 మందిని విచారించాం: బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్‌రావు
కోడెల ఆత్మహత్య కేసు దర్యాప్తులో భాగంగా కుటుంబీకులు, గన్‌మెన్, డ్రైవర్ తదితరులతో కలిపి మొత్తం 12 మంది వాంగ్మూలాలు నమోదు చేసినట్లు బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావు తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోడెల అంత్యక్రియలు, ఇతర కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఆయన కుమారుడు, ఇతర కుటుంబీకులు, సన్నిహితులతోపాటు అనుమానం ఉన్న ప్రతి ఒక్కరినీ విచారిస్తామని చెప్పారు. కోడెల ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై కొడుకు శివరామ్ స్టేట్‌మెంట్ కీలకం కానుందని పేర్కొన్నారు. కోడెల ఫోన్‌లోని కాల్‌డేటా ఆరా తీస్తున్నామన్నారు.
ముగిసిన కోడెల అంత్యక్రియలు
నరసరావుపేట/నరసరావుపేటటౌన్: అనుమానాస్పద రీతిలో ఆత్మహత్యకు పాల్పడిన శాసనసభ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత డాక్టర్ కోడెల శివప్రసాదరావుకు టీడీపీ కార్యకర్తలు కన్నీటి వీడ్కోలు పలికారు. నరసరావుపేట కోటలోని కోడెల నివాసం నుంచి స్వర్గపురి వరకు సాగిన కోడెల అంతిమయాత్రలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, లోకేష్‌తో పాటు ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు నేతలు పాల్గొన్నారు. కోడెల భౌతికకాయాన్ని బుధవారం మధ్యాహ్నం వరకు అభిమానుల సందర్శనార్థం కోటలో ఉంచారు. మధ్యాహ్నం 2గంటల సమయంలో చంద్రబాబు వచ్చి నివాళులర్పించి అంతియాత్ర ప్రారంభించారు. ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని కలెక్టర్ శామ్యూల్ కోడెల కుటుంబ సభ్యులకు వివరించగా.. వారు నిరాకరించారు. కోడెల చితికి శాస్త్రోక్తంగా ఆయన కుమారుడు శివరామకృష్ణ నిప్పంటించి అంతిమ సంస్కారం నిర్వహించారు.
కోడెల అంతిమయాత్రలో ప్రతిపక్షనేత చంద్రబాబు
అంతిమయాత్రలో ఉద్రిక్తత..
కోడెల శివప్రసాదరావు అంతిమయాత్రలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముందుగా నిర్ణయించిన రూట్ మ్యాప్ ప్రకారం అంతిమయాత్ర సాగనీయకుండా ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గృహం మీదుగా తీసుకెళ్లాలంటూ టీడీపీ నేతలు పట్టుబట్టడంతో పోలీసులు అడ్డు చెప్పారు. అంతిమయాత్ర మల్లమ్మసెంటర్‌కు చేరిన అనంతరం తిరిగి ఉచ్చయ్య,పెంటయ్య వీధి గుండా స్వర్గపురికి వెళ్లాల్సి ఉంది. అయితే మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు మల్లమ్మ సెంటర్ నుంచి ఎమ్మెల్యే గోపిరెడ్డి ఇంటివైపు మళ్లించే ప్రయత్నం చేశారు. అయితే గుంటూరు రూరల్ ఎస్పీ ఆర్.జయలక్ష్మి , డీఎస్పీ వీరారెడ్డి సిబ్బందితో అక్కడకు చేరుకుని ముందస్తు రూట్ మ్యాప్ ప్రకారం వాహనాన్ని మళ్లించారు.
సంబంధిత కథనాలు..
‘కోడెలను తిట్టించిన చంద్రబాబు’
Comments
Please login to add a commentAdd a comment