బాధితుడిని వివరాలు అడిగి తెలుసుకుంటున్న ఎస్పీ రంగనాథ్
సాక్షి, మిర్యాలగూడ అర్బన్: మిర్యాలగూడ పట్టణంలో ఆదివారం రాత్రి దోపిడీ దొంగలు హల్‌చల్ సృష్టించారు. ఓ మాజీ కౌన్సిలర్ ఇంట్లోకి చొరబడి మారణా యుధాలతో బెదిరించి నగదు, బంగారు ఆభరణాలతో ఉడాయించారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ఈదులగూడ 9వ వార్డు మాజీ కౌన్సిలర్ ముదిరెడ్డి సందీపనర్సిరెడ్డి దంపతులు రాత్రి ఇంటి తలుపులు పెట్టి బెడ్రూంలో నిద్రపోయారు. రాత్రి 12:30 గంటల సమయంలో నలుగురు దుండగులు హాల్ తలుపుల తాళాన్ని ఇనుపరాడ్డు, జాకీ సహాయంతో తొలగించారు. అనంతరం ఇంట్లోకి ప్రవేశించి బెడ్రూంలోకి చొరబడ్డారు. బెడ్రూం తలుపు తీసిన వెంటనే చప్పుడు కావడంతో నర్సిరెడ్డి నిద్రలేచాడు. దండగులు కత్తులతో బెది రిస్తూ నర్సిరెడ్డిని లుంగీతో కట్టేశారు.
మాజీ కౌన్సిలర్ మెడపై కత్తిపెట్టి..
ఏం జరుగుతుందో అర్థంకాని అయోమయ స్థితిలో ఉన్న మాజీ కౌన్సిలర్ సందీప మెడపై దుండగులు కత్తిపెట్టారు. ‘‘ చెల్లెమ్మా మేము నక్సలైట్లం.. మిమ్ములను ఏమీ చేయం.. వెంటనే మీ వద్ద ఉన్న బంగారం డబ్బులు ఇవ్వండి.. లేదంటే మిమ్ములను చంపేస్తా’’ అంటూ బెదిరించారు. దంపతుల రెండు సెల్‌ఫోన్లు తీసుకుని స్విచ్ఛాఫ్ చేశారు. దీంతో భయాందోళనకు గురైన ముదిరెడ్డి సందీప కబ్ బోర్డులోని నగదు, బంగారం దుండగులకు చూపించింది. అందులో ఉన్న 30 తులాల బంగారు ఆభరణాలు, రూ.3 లక్షల నగదుతో పాటు ఆమె మెడలోని తాళిబొట్టు, చెవికమ్మలను తీసుకున్నారు. అరగంట తర్వాతే బయటికి రావాలని లేకుంటే మా వాళ్లు మిమ్ములను చంపేస్తారని బెదిరిస్తూ దుండగులు అక్కడినుంచి ఉడాయించారు. కాసేపటికి తేరుకున్న సందీప తన భర్త నర్సిరెడ్డి చేతి కట్లను విప్పేసింది. వెంటనే బయటికి వెళ్లి ఇంటి ఎదురుగా ఉన్న వారిని లేపి దోపిడీ విషయాన్ని వివరించారు. వారి వద్ద ఉన్న సెల్‌ఫోన్‌తో పోలీసులకు, బంధువులకు సమాచారం చేరవేశారు.
ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు
దోపిడీ విషయాన్ని తెలుసుకున్న డీఎస్పీ వై.వెంకటేశ్వర్‌రావు, టూటౌన్ సీఐ దొంతిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌ఐ పరమేష్‌లు సిబ్బందితో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించారు. నల్లగొండ నుంచి క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌లను రప్పించి ఆధారాలు సేకరించారు. నర్సి రెడ్డి ఇంటి నుంచి పరుగెత్తిన డాగ్‌స్క్వాడ్ గుంటూరురోడ్డు వెపునకు వెళ్లి ఆగింది. కాగా ఈ దోపిడీలో సుమారు ఎనిమిది మంది పాల్గొని ఉంటారని పోలీ సులు అనుమానిస్తున్నారు. ఇంటిలోపలికి వచ్చిన నలుగురు దుండగుల్లో ముగ్గురు వ్యక్తులు లూజర్స్ పాయింట్, టీషర్టులు ధరించి ఉండగా ఒకరు లుంగీ షర్టు ధరించి మాస్కులు వేసుకుని, తెలుగులోనే మాట్లాడారని బాధితులు తెలిపారు. దుండగులు కరుడు కట్టిన నేరస్తులుగా పోలీసులు భావిస్తున్నారు. కాగా ఇంటి డోరు తొలగించిన రాడ్డును పూలచెట్లల్లో వదిలి వెళ్లారు. మాజీ కౌన్సిలర్ ఇంట్లో దోపిడీ విషయం తెలుసుకుని కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. కాలనీలో పోలీసుల గస్తీ ఏర్పాటు చేయాలని, పట్టణంలోని ప్రధాన కూడళ్లలోని సీసీ కెమెరాలకు మరమ్మతులు చేయాలని కోరారు.
దుండగులను పట్టుకుంటాం : ఎస్పీ
మాజీ కౌన్సిలర్ ఇంట్లో దోపిడీకి పాల్పడిన దుండగులకు త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ రంగనాథ్ తెలిపారు. సోమవారం ఆయన మాజీ కౌన్సిలర్ ముదిరెడ్డి సందీప, నర్సిరెడ్డి ఇంటిని పరిశీలించారు. దోపిడీ జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment