మంగళవారం బాంబు పేలుడు జరిగిన ప్రదేశంలో రక్తపు మరకలు
కర్నూలు: కర్నూలు శివారులోని జొహరాపురం రస్తాలో మంగళవారం చోటుచేసుకున్న బాంబు పేలుడు ఘటన దర్యాప్తుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ ఘటనలో చనిపోయిన జంపాల రాజశేఖర్, మల్లికార్జున, ఏఎస్‌ఐ శ్రీనివాసులు మృతదేహాలకు బుధవారం కర్నూలు సర్వజనాస్పత్రి మార్చురీలో పోస్టుమార్టం పూర్తి చేశారు. ఫొరెన్సిక్ విభాగాధిపతి డాక్టర్ లక్ష్మీనారాయణ నేతృత్వంలో అసిస్టెంట్లు శంకర్ నాయక్, రాజశేఖర్ ఈ ప్రక్రియ పూర్తి చేసి..మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు.
మృతదేహాల్లో ఇనుప గోలీలు, మేకులు, గాజు పెంకులు, ఇతర మందు గుండు సామగ్రి ఆనవాళ్లు ఉండటంతో పేలింది నాటు బాంబులేనని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కర్నూలు డీఎస్పీ యుగంధర్ బాబు, మూడో పట్టణ సీఐ సుబ్రహ్మణ్యం ఉదయం నుంచి మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయ్యే వరకు అక్కడే ఉండి శాంతిభద్రతలను పర్యవేక్షించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పేలుడు నిరోధక చట్టం, ఐపీసీ 304 క్లాజ్–2 సెక్షన్ కింద మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
శరీర భాగాలు హైదరాబాద్ పరీక్ష కేంద్రానికి..
బాంబు పేలుడులో మృతిచెందిన రాజశేఖర్, మల్లికార్జున, ఏఎస్‌ఐ శ్రీనివాసులు మృతదేహాల్లోని కొన్ని భాగాలను హైదరాబాదులోని ఫొరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్)కి పంపారు. గాజుపెంకులు, ఇనుప గోలీలు, ఇనుప మేకులు తదితర వాటిని కూడా శరీర భాగాల నుంచి వెలికితీసి.. దాదాపు 20 బాటిళ్లలో భద్రపరచి పరీక్ష నిమిత్తం ల్యాబ్‌కు పంపారు. వాటి రిపోర్టు రావాల్సి ఉంది
సవాలుగా మారిన దర్యాప్తు
బాంబు పేలుడు ఘటన దర్యాప్తు పోలీసులకు సవాలుగా మారింది. దర్యాప్తు బాధ్యతలను ఎస్పీ గోపీనాథ్ జట్టి..కర్నూలు డీఎస్పీ యుగంధర్ బాబుకు అప్పగించారు. సంఘటన జరిగి రెండు రోజులు గడిచినప్పటికీ పోలీసులు దర్యాప్తుపై దృష్టి సారించలేకపోతున్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినందున గురువారం నుంచి దర్యాప్తుపై దృష్టి సారిస్తామని డీఎస్పీ తెలిపారు. కాగా.. జన సంచారం లేని ప్రాంతంలో ఘటన జరిగినందున పోలీసులకు కేసు దర్యాప్తు సవాలుగా మారింది.
ఏవైనా భారీ ఘటనలు, దాడులు, ప్రమాదాలు, హత్యలు, దోపిడీలు జరిగినప్పుడు ప్రధానంగా సీసీ కెమెరాలపై ఆధారపడి దర్యాప్తు సాగిస్తారు. అయితే పేలుడు ప్రాంతంలో ఆ అవకాశం లేకపోవడంతో మిస్టరీ ఛేదన కష్టసాధ్యంగా మారింది. ఏడాదిన్నర క్రితం ఇదే తరహాలో జూపాడుబంగ్లా ప్రాంతంలో మూడు నాటు బాంబులు పేలాయి. దీని గురించి ఆరా తీయగా.. అడవి పందులను చంపేందుకు పెట్టినట్టుగా తేలింది. కాగా.. ఐదు బృందాలను రంగంలోకి దింపి ఈ కేసు దర్యాప్తు చేపట్టాలని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. బాంబులు పేలిన ప్రాంతంలో స్టీల్ బకెట్ ముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.
బాంబు తయారీదారులపై ఆరా
బాంబు పేలుడు కేసు దర్యాప్తులో భాగంగా జిల్లాలో బాంబుల తయారీదారులు ఎవరెవరు ఉన్నారు.. వారు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు.. అనే విషయాలపై జిల్లా వ్యాప్తంగా పోలీసు బృందాలు ఆరా తీస్తున్నాయి. ప్రధానంగా నందికొట్కూరు, కోడుమూరు, పత్తికొండ, ఆళ్లగడ్డ, బనగానపల్లె ప్రాంతాల్లో దృష్టి కేంద్రీకరించి.. ఆరా తీస్తున్నట్లు సమాచారం. బాంబు పేలుడు తీవ్రతను బట్టి మందు పాతరగానూ పోలీసులు అనుమానిస్తున్నారు. 2013లో సల్కాపురం వద్ద కోడుమూరుకు చెందిన ఎరుకలి వెంకట్రాముడుపై బాంబు దాడి అనంతరం జిల్లాలో ఎక్కడా బాంబులతో హత్యలు చేసిన సంఘటనలు లేకపోవడం గమనార్హం. ఏది ఏమైనప్పటికీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బాంబు పేలుడు ఘటన ప్రశాంతంగా ఉన్న జిల్లాలో అలజడి రేపింది. ఫ్యాక్షన్ నాయకుల ఆగడాలపై జనంలో మళ్లీ చర్చ మొదలయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment